అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాకౌట్

Feb 14, 2024 - 13:31
Feb 15, 2024 - 00:22
 0  105
అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాకౌట్

ఓటాన్ అకౌంట్ పై చర్చ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. అధికార, ప్రతిపక్ష నేతల ఆరోపణలతో సభ దద్దరిల్లింది. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నల్గొండ సభలో చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఓ ముఖ్యమంత్రిని పట్టుకుని ఎలాంటి మాటలు మాట్లాడారంటూ కేసీఆర్ పై మండిపడ్డారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగా అరుపులు కేకలు వేస్తూ నిరసన తెలిపారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ముఖ్యమంత్రిని మాట్లాడనివ్వండి.. మీకు మైకు ఇచ్చినపుడు మాట్లాడండి అంటూ స్పీకర్ విజ్ఞప్తి చేసినా వినిపించుకోలేదు. ఈ గందరగోళం మధ్యనే సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం కొనసాగింది.

ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. కాళేశ్వరం, గోదావరి జలాలపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదలచేస్తే చర్చలో తామంతా పాల్గొంటామని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులపై చర్చ జరగడం మంచిదేనని, రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని అన్నారు. అయితే, సీఎం రేవంత్ రెడ్డి భాషపై తమకు అభ్యంతరం ఉందని కడియం చెప్పారు. ఓ ముఖ్యమంత్రి సభలో మాట్లాడాల్సిన భాష ఇది కాదని అన్నారు. సభలో మట్లాడకూడని భాష ఉపయోగించటం సబబు కాదని, సీఎం తన గౌరవాన్ని కాపాడుకోవాలని హితవు పలికారు. దీనిపై అధికార పార్టీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బల్లలు చరుస్తూ, అరుపులతో నిరసన తెలిపారు. అధికార పార్టీ సభ్యుల తీరుతో సభలో నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బయటకొచ్చారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333