అమరవీరుల త్యాగం అజరామరం
తెలుగు నేలమీద మాదిగ దండోరా ఉద్యమం పురుడుపోసుకుని 30 ఏళ్లు పూర్తవుతుంది. పొడుస్తున్న పొద్దు మీద చి(రా చిటికెన పుల్లతో దరువేస్తూ అణగారిన వర్గాలకు జరుగుతున్న అన్యాయాలను ధిక్కరిస్తూ మాదిగ డప్పు పై దండోరా మోగిస్తూ తమ హక్కుల సాధనకు స్వరం విప్పి మూడు దశాబ్దాలు గడిచింది .అయినా నేటికీ దిక్కులు పిక్కటిల్లెల మాదిగ, మాదిగ ఉప కులాల గొంతులు ఎస్సి ఏ బి సి డి వర్గీకరణ కోసం పోరాడుతూనే ఉన్నాయి. 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఈ ఉద్యమం నిర్మాణం జరగడానికి ఎంతో చారిత్రాత్మక నేపథ్యం ఉందని చెప్పక తప్పదు. 30 ఏళ్ల ఉద్యమంలో మాదిగలు తమ అస్తిత్వం, ఆత్మ గౌరవం కోసం జరిగిన అనేక పోరాటాల్లో మాదిగలు పాల్గొని తమ విలువైన ప్రాణాలను సైతం త్రుణప్రాయంగం వదిలేశారు.
30 ఏళ్ల వర్గీకరణ ఉద్యమం చేసిన పోరాటాల్లో అమరులైన మాదిగ అమరవీరుల త్యాగాలు అజరామరం. 1985 జూలై 17న కారంచేడులో అమరులైన కారం చెడు అమరవీరుల త్యాగాలను ఎత్తిపడుతూ తెలుగు నేలమీద ఎమ్మార్పీఎస్ ఉద్యమం దండు కట్టి దండోరా వేసి తెలుగు నేల మీద దళితులపై జరుగుతున్న దాడులు, అణిచివేతలపై ఎనలేని పోరాటాలు చేసింది. ఏ బి సి డి వర్గీకరణ కాకుండా ఎమ్మార్పీఎస్ ఉద్యమం అనేక సామాజిక ఉద్యమాలకు బాసటగా నిలిచి పెద్దన్న పాత్ర పోషించింది. వృద్ధాప్య పింఛన్ల పెంపు, ఆరోగ్యశ్రీ ,విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ వంటి ఎన్నో పథకాలను రూపొందించేలా ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చింది కూడా ఎమ్మార్పీఎస్ ఉద్యమమేనన్న సంగతి అందరికీ తెలిసిందే .ఇవే కాకుండా దళిత, బహుజనులపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, బూటకపు ఎన్కౌంటర్లను నిరసించింది. ఎస్సీ ఎస్టీ బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలపై ధిక్కరించి హక్కుల కోసం ఉద్యమించింది. మూడు దశాబ్దాల ఎమ్మార్పీఎస్ ఏబిసిడి వర్గీకరణ ఉద్యమాన్ని పాలకులు నేటికీ తొక్కిపెట్టి అన్యాయం చేస్తున్నారు.
వర్గీకరణ జరిగితే ఎస్సీ కులాల్లోని అన్ని ఉపకులాలకు వారి వారి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ఫలాలు అంది అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది. కానీ నేటి వరకు కేంద్రాల్లో రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు వర్గీకరణ చేస్తామని చెబుతూ ఎన్నికలలో ఓట్లు వేయించుకొని కాలయాపన చేస్తున్నారే తప్ప వర్గీకరణ మాత్రం చేయడం లేదు. గత 30 ఏళ్లుగా జరిగిన పోరాటాల ఉద్యమ తీవ్రత ఫలితంగా 1997లో న్యాయమూర్తి రామచంద్ర రాజు నేతృత్వంలోని కమిషన్ ఎస్సీలను వర్గీకరించాలని సిఫారసు చేసింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 15% ఎస్సీ కోటాను విభజిస్తూ జీవో విడుదల చేసింది .ఏ గ్రూపులో రెల్లి కులం తో పాటు 12 కులాలను కలిపి ఒక శాతం కోట ఇవ్వగా బి గ్రూపులో మాదిగ మరో 18 కులాలను చేరుస్తూ ఏడు శాతం కోటాను సి గ్రూపులో మాల దాని ఉపకులాలు మరో 25 కులాలను చేర్చి ఆరు శాతం కోటాగా డి గ్రూపులో ఆది ఆంధ్రుల తో పాటు నాలుగు ఉప కులాలను చేర్చి ఒక శాతం కోటగా నిర్ణయించారు. అప్పటికే మాల మహానాడు ఈ విషయంపై కోర్టుకు వెళ్ళింది. ఈ జీవో రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిమితికి మించిందని, రాజ్యాంగ విరుద్ధమైనదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆనాడు ప్రకటించింది.
ఆ తర్వాత 2000 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీలను వర్గీకరిస్తూ రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ చట్టం చేసి అసెంబ్లీ తీర్మానించింది. అప్పటి రాష్ట్రపతి కే ఆర్ నారాయణన్ ఆమోదంతో అమలులోకి వచ్చింది. అప్పట్లో జనాభా దామాషా ప్రకారం ఆ కులాలకు కోటాను నిర్ణయించారు. నాలుగు సంవత్సరాల పాటు వర్గీకరణ ఫలాలు అందాయి. కానీ తిరిగి 2004లో సుప్రీంకోర్టు ఆ అంశాన్ని కొట్టివేయడంతో మళ్లీ మొదటికొచ్చింది. ఆ తర్వాత 2004లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఎస్సీ వర్గీకరణపై ఒత్తిడి పెరిగి రాజ్యాంగ సవరణ కోరుతూ అసెంబ్లీ తీర్మానం చేసింది. దీనికి ప్రతిస్పందనగా సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ ఆనాడు ఉషా మెహర కమిషన్ ఏర్పాటు చేసింది. 2008లో మంత్రి మీరా కుమారికి కమీషన్ ప్రత్యేక నివేదికను సమర్పించింది .రాజ్యాంగం లోని ఆర్టికల్ 341 సవరించాలని, ఆర్టికల్ 3 వ క్లాజ్ ను చేర్చడం ద్వారా రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవం తీర్మానం చేసిన పక్షంలో కులాల వర్గీకరణను పార్లమెంటు ఆమోదించవచ్చునని ఉషా మెహర కమిషన్ సిఫారసు చేసింది.
అయితే కేంద్రంలో ఉన్న ఉషా మెహర కమిషన్ సిఫారసులను సీరియస్ గా తీసుకోకపోవడంతో నేటికీ సమస్య పరిష్కారంగా ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ అందని ద్రాక్ష గానే మిగిలిపోయింది. ఎమ్మార్పీఎస్ ఉద్యమం ఎన్ని పాయలుగా విడిపోయిన అమరుల స్ఫూర్తితో ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ లక్ష్యంగా బి ఎన్ రమేష్ మాదిగ, మేడి పాపయ్య మాదిగ ,పిడమర్తి రవి మాదిగ, ఇటుక రాజు మాదిగ, వంగపల్లి శ్రీనివాస్ మాదిగల నాయకత్వంలో మాదిగలు తమ హక్కులకై పోరాటాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మూడోసారి ప్రధాని అయిన నరేంద్ర మోడీ ఈసారైనా పార్లమెంటులో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం డిమాండ్ చేస్తుంది. మాదిగల ఆత్మగౌరవ ఉద్యమానికి 30 ఏళ్ళు నిండిన సందర్భంగా ఆ అమరవీరులను స్మరించుకోవడం వారి త్యాగాలను ఎత్తిపట్టడం ఎంతైనా అవసరం ఉంది. మొదటిసారిగా మందకృష్ణ మాదిగ ఆమరణ నిరాహార దీక్ష కు పూనుకున్న సందర్భంలో అమరుడైన తెల్లబండ్ల రవి, గాంధీభవన్ ముట్టడి సందర్భంగా మంటల్లో చిక్కుకొని అమరులైన పొన్నాల సురేందర్, నడిమిట్టి దామోదర్, ములుగు మహేష్, చలో కలెక్టరేట్ పిలుపులో భాగంగా సికింద్రాబాద్లో జరిగిన ధర్నా కార్యక్రమంలో పోలీసుల తోపులాటలో గుండెపోటుకు గురై అమరులైన దర్శనాల భారతి వివిధ సందర్భాల్లో అమరులైన సిర్ర నాగేశ్వరరావు, మీరా సాహెబ్ ,పెద్దడ ప్రకాష్ రావు, ప్రభాకర్ లాంటి అమరవీరులతోపాటు సుదీర్ఘకాలం ఉద్యమంలో పనిచేసి అనారోగ్య, ఇతర కారణాలతో అమరులైన సుంకపాక దేవన్న, బాష ప0గు రామన్న, బియన్ ఎల్లయ్య, మారపంగు మైసయ్య, పెబ్బ జీవ, కొండూరి రాజ ఎల్లయ్య, సిరిపురం సోమన్న, నకిరేకంటి యాకన్న, వీరన్న బాకీ యాదయ్య వంటి ఎంతోమంది అమరులయ్యారు.
వారి త్యాగాలను, పోరాటాలను ఎత్తి పడుతూ మాదిగల ఆత్మగౌరవ ఉద్యమం 30 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా వారిని స్మరించుకునేందుకు జులై 7న హైదరాబాద్ లోయర్ ట్యాంకు బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో మాదిగ అమరవీరుల సంస్మరణ సభను నిర్వహిస్తున్నాం.
బూర్గుల నాగేందర్ మాదిగ
తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు.