30వ డివిజన్ కాంగ్రెస్ కార్యకర్త చట్టు మంగ ఆవేదన
మీడియా సాక్షిగా తన గోడు వెళ్లబోసుకున్న బాధితురాలు
ఖమ్మం : పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేస్తున్న తనను ఒక మహిళనని చూడకుండా కించపరుస్తున్నారని , రాజకీయాలెందుకంటూ అవమానకరంగా మాట్లాడుతున్నారని 30వ డివిజన్ మహిళా కాంగ్రెస్ కార్యకర్త చట్టు మంగ ఆవేదన వ్యక్తం చేశారు . సోమవారం ఖమ్మం పంపింగ్ వెల్ రోడ్డులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె తనపై జరుగుతున్న వేధింపులను వివరించారు . ఈ నెల 21వ తేదీన డివిజన్ పరిధిలో బూత్ లెవల్ కమిటీ సమావేశం జరిగింది . ఆ సమయంలో పార్టీకి చెందిన బొమ్మ ఉదయ్ అనే వ్యక్తి తనను ఉద్దేశించి "నీకు రాజకీయాలతో పనేంటి ? ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకోవాలి కదా" అంటూ అసభ్యంగా మాట్లాడారని ఆమె ఆరోపించారు . గతంలోనూ నాలుగైదు సార్లు ఇలాగే కించపరిచారని , ఈ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లినా సదరు వ్యక్తి తీరులో మార్పు రాలేదని పేర్కొన్నారు . "నేను నిన్నగాక మొన్న రాజకీయాల్లోకి రాలేదు . 1997 నుంచి గాంధీనగర్ ప్రాంతంలో పార్టీ బలోపేతం కోసం ఒక కార్యకర్తగా బాధ్యతాయుతంగా పనిచేస్తున్నాను . తుమ్మల నాగేశ్వరరావు , పొంగులేటి శ్రీనివాసరెడ్డికి నా పనితీరు తెలుసు . ఎప్పుడూ పదవుల కోసం ఆరాటపడలేదు . రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుంటే , క్షేత్రస్థాయిలో ఇలాంటి అణచివేత చర్యలు బాధాకరం" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు . మహిళా కార్యకర్తలకు గౌరవం దక్కాలని , తనను దూషించిన వ్యక్తిపై పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలని ఆమె ఈ సందర్భంగా డిమాండ్ చేశారు .