27న భద్రాచలం దేవస్థానం అభివృద్ధి పనులకు శ్రీకారం
- ఆగమశాస్త్ర ప్రకారం ఆలయ అభివృద్ది పనులు.
- యుద్ద ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలి
- అధికారులకు మంత్రి పొంగులేటి గారి ఆదేశం
50 ఏళ్లకు పూర్వం నడిచే దైవం కంచి స్వామి వారి ఆధ్వర్యంలో భద్రాద్రి లోనిర్వహించిన ఆలయ పునరుద్ధరణ (కుంభాభిషేకం) జరిగిన విధంగా ప్రస్తుత రామాలయం పునరుద్ధరణ కూడా కంచి పీఠాధిపతులు మరియు రామానుజాచార్య స్వామి వారి ఆధ్వర్యంలో నిర్వహించాలని భక్తులు కోరుతున్నారు.
తెలంగాణ వార్త జూన్26 జిల్లా స్టాపర్ టెంపుల్ టౌన్ భద్రాచలం : తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన, దక్షిణ అయోధ్యగా ఖ్యాతి గాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు ఈ నెల 27వ తేదీన శ్రీకారం చుడుతున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిగారు ప్రకటించారు.
గురువారం సచివాలయంలోని తన కార్యాలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, భద్రాచలం ఆలయ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ, భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆగమశాస్త్ర నియమాలను కచ్చితంగా పాటిస్తూ ఆలయ అభివృద్ధి పనులు చేపట్టాలని స్పష్టం చేశారు.
భద్రాచలం శ్రీ రాముని ఆలయ వైభవం, ఆధ్యాత్మికతకు ఎటువంటి భంగం కలగకుండా, సంప్రదాయ శిల్పకళను ప్రతిబింబించేలా రాతి నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. రాబోయే రెండు వందల సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్ తరాలకు కూడా ఆదర్శంగా నిలిచే విధంగా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంకల్పించారని ఈ మేరకు ఈ నెల 27వ తేదీన ఆలయ పునరుద్ధరణ పనులను అధికారికంగా ప్రారంభించాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోనే పనులు పూర్తయ్యేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలని అధికారులను ఆదేశించారు. ఈ ఆలయ పునరుద్దరణ పనులకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 351 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.
వచ్చే శ్రీరామ నవమి నాటికి నిర్దేశించిన పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయడానికి అన్ని పనులు చేపట్టాలని సూచించారు.
దక్షిణ అయోధ్యగా ప్రఖ్యాతిగాంచిన భద్రాచలం రామాలయ0 సర్వాంగ సుందరంగా ఆగమ శాస్త్ర ప్రకారం నభూతో న భవిష్యతి అనే విధంగా రూపుదిద్దుకోవడానికి కంచి స్వామీజీ మరియు రామానుజాచార్య స్వామివార్ల ఆధ్వర్యంలో పునరుద్ధరణ పనులు జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రామ భక్తులు కోరుతున్నారు.
ఎండ్