1/70 చట్టం జోలికి వస్తే కబడ్డార్.. నాన్ ట్రైబల్స్ కుట్రలను తిప్పి కొడతాం: ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఉమ్మడి రాష్ట్రనేతల హెచ్చరిక 

Jun 27, 2026 - 19:03
 0  0
1/70 చట్టం జోలికి వస్తే కబడ్డార్.. నాన్ ట్రైబల్స్ కుట్రలను తిప్పి కొడతాం: ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఉమ్మడి రాష్ట్రనేతల హెచ్చరిక 

తెలంగాణ వార్త జూన్ 27 జిల్లా స్టాపర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా :  సుప్రీంకోర్టులో 1/70 చట్టాన్ని సవరించాలంటూ, ఆదివాసీల రాజ్యాంగబద్ధమైన హక్కులను పూర్తిగా కాలరాసే విధంగా గిరిజనేతరులు పన్నుతున్న కుట్రలను ఆదివాసి సమాజం ఐక్యంగా తిప్పికొడుతుందని ఆదివాసీ సంక్షేమ పరిషత్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పూనెం శ్రీనివాస్ పాలకులను, నాన్ ట్రైబల్స్‌ను తీవ్రస్థాయిలో హెచ్చరించారు. భద్రాచలం కేంద్రంగా ఆదివాసీ సంక్షేమ పరిషత్ తెలుగు రాష్ట్రాల (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) ముఖ్య కార్యకర్తల అత్యవసర విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పూనెం శ్రీనివాస్ మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులకు జీవనరేఖ, గుండెకాయ లాంటి 1/70 చట్టం జోలికి వస్తే సహించేది లేదని, ఎవరైనా చట్టాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తే ‘కబడ్డార్’ అంటూ ఉరుము శబ్దంతో హెచ్చరించారు. సుమారు 1700 మంది నాన్ ట్రైబల్స్ వలసవచ్చి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ వెనుక పాలకుల ఓటు బ్యాంకు రాజకీయాలు, ఏజెన్సీలోని అపారమైన ఖనిజ సంపదను, భూములను మల్టీ నేషనల్ కంపెనీలకు దారాదత్తం చేసే పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. గతంలో ఐదవ, ఆరవ షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన 'జీవో నెంబర్ 3' విషయంలో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల తీవ్ర నిర్లక్ష్య వైఖరి, గిరిజన ప్రజాప్రతినిధుల చేతకానితనం వల్లే సుప్రీంకోర్టులో ఆ జీవో కొట్టివేయబడిందని ఆయన మండిపడ్డారు. ఇప్పుడు అదే పంథాలో ఆదివాసీల ఉనికిని దెబ్బతీసేందుకు 1/70 చట్టాన్ని కూడా రద్దు చేయించడానికి ఉమ్మడి కుతంత్రాలు సాగుతున్నాయని ఆరోపించారు. చట్ట సవరణల పేరుతో అడుగుపెట్టడం అంటే ఆదివాసులను నిలువునా పూడ్చిపెట్టడమేనని, ఒకవేళ ఈ చట్టం రద్దయితే పాలకులకు, గిరిజనేతరులకు ఏజెన్సీలోని ఖనిజ సంపదను, భూములను పూర్తిగా దోచుకునే చట్టబద్ధమైన హక్కు దొరుకుతుందని హెచ్చరించారు. ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతాల్లోని ఖనిజ వనరులను మల్టీ నేషనల్ కంపెనీలకు అప్పజెప్పి అడవులను విచ్చలవిడిగా నాశనం చేస్తున్నారని, భూములు అమ్ముకోవడానికి మరియు కొనుగోలు చేయడానికి వెసులుబాటు కల్పించాలనే దురాశతోనే గిరిజనేతరులు ఆదివాసుల హక్కులపై దాడికి దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా తక్షణమే స్పందించి, సుప్రీంకోర్టులో గిరిజనేతరులు వేసిన పిటిషన్‌పై అత్యంత బలమైన కౌంటర్ దాఖలు చేసి ఆ కేసును కొట్టివేయించేలా మరియు ఆ పిటిషన్లను తొలగించేలా తక్షణ లీగల్ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వివిధ రాజకీయ పార్టీలలో పదవుల్లో కొనసాగుతున్న గిరిజన ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా ఆయా పార్టీలకు ఊడిగం చేయడం మానేసి, తమ జాతి రక్షణ కోసం ప్రభుత్వాలపై తీవ్ర ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఆదివాసీలు తమ ఐక్యతను చాటాల్సిన క్లిష్ట సమయం ఆసన్నమైందని, ఇప్పుడు కూడా "నా రాజకీయ పార్టీ, నా నాయకుడు" అంటూ స్వార్థంతో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా విడిపోతే భవిష్యత్తులో ఆదివాసుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. "మేలుకో ఆదివాసి మేలుకో - ఏజెన్సీ కాపాడుకో.. నీ చట్టాలను కాపాడుకో" అనే నినాదంతో ఆదివాసి సమాజం అంతా ఏకం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ అత్యవసర కీలక కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ జాతీయ నాయకులు కొరస వెంకటేశ్వర్లు, ఏటిఏ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కల్లూరు జయబాబు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సోయం కామరాజు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను, తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఈసాల సురేష్, రాష్ట్ర కార్యదర్శి సంప విష్ణు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పర్షిక సతీష్, కుర్సం రవి, తుర్స కృష్ణబాబు, తాటి రాంబాబు, మరియు మీడియం అర్జున్ తదితర ప్రముఖ ఆదివాసి నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటిస్తూ చట్టాల రక్షణ కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.
భద్రాచలంలో1/70 అమలులో ఉన్నప్పటికీ g+4 భవనాల కు అనుమతి ఎలా వస్తోందో అధికారులు తెలియజేయాలని ఆదివాసీ నేతలు కోరారు. 

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333