సినిమా ఇండస్ట్రీకి సవాల్ విసిరిన సీఎం.

సినిమా ఇండస్ట్రీకి సవాల్ విసిరిన సీఎం.
బెనిఫిట్ షోలు రేట్ల పెంపు ఉండవన్న రాష్ట్ర ప్రభుత్వం.పుష్ప 2
సినిమాలోని కథాంశం సామాజిక విద్రోహం అన్న పోలీసు అధికారులు.
సెన్సార్ బోర్డు బాధ్యతాయుతంగా వ్యవహరించాలంటున్న ప్రజలు,
ప్రజాస్వామికవాదులు.రేవతి మృతి నేపథ్యంలో సీఎం సవాల్ను ఎలా చూడాలి?
వడ్డేపల్లి మల్లేశం
22...12...2024
ప్రజలు సంపాదించిన సొమ్ముతో సినిమాలను చూసి వసూలైన డబ్బుతో నటులు సినిమా యంత్రాంగము సిబ్బంది కోట్లకు పడగలెత్తుతూ ఉంటే ఒక్కొక్క సినిమా హీరో కోట్ల రూపాయలను దర్శక నిర్మాతల నుండి ఆశిస్తూ ఉంటే ఆ సినిమా ద్వారా ఏ రకమైన ప్రయోజనం సమాజానికి చేకూరుతుంది అని ఆలోచన చేయకుండానే సెన్సార్ బోర్డు అనుమతించడం, నటులకు హీరోలకు ఫాన్స్ పెద్ద మొత్తంలో స్వాగతం పలకడం, జన సమ్మర్ధం మధ్య తొక్కిశలాట జరగి కొందరు మృతికి కారణం అవుతుంటే ఈ ఆగడాలు ఆడంబరాలు ఎవరి కోసం అని చర్చించుకోవలసిన సమయం ఆసన్నమైనది. సెన్సార్ బోర్డు కథను పరిశీలించదు, ప్రభుత్వము అందులోని లోటుపాట్లను తరచి చూడదు, నిర్మాతలు దర్శకులు సిబ్బందికి ఏ రకంగానూ ప్రజల సంక్షేమం పట్టదు, వాళ్లకు కావలసింది కేవలం పెద్ద మొత్తంలో వసూలు అంతకుమించి అభిమానులను తయారు చేసుకోవడం ద్వారా ఊరేగాలని ప్రయత్నించడమే కానీ ఈ సమాజ పురోగతి కోసం సినిమా రంగం ఏ రకంగానూ తోడ్పడిన సందర్భాలు లేవు అని సమాజం గుర్తించాల్సిన అవసరం ఉంది. పుష్ప-1 సంవత్సరాల క్రితం విడుదల అయితే పుష్ప2 డిసెంబర్ 24 లో విడుదలైన సందర్భంగా 4 డిసెంబర్ 2024న సంధ్యా థియేటర్ హైదరాబాదులో హీరో అల్లు అర్జున్ రాక తొక్కిశలాట తదనంతర పరిణామాలలో రేవతి అనే మహిళ మృతి చెందడం ఆమె కొడుకు చావు బతుకుల్లో కొట్టుమిట్టాడడం మనందరికీ తెలిసిన విషయమే. సినిమాలో నటించే హీరోలు నిజజీవితంలో కూడా హీరోలమేనని, దైవాంశ సంభూతులుగా భావించి ఏదో సాధించినట్లు సమాజాన్ని ఉద్ధరించినట్లుగా వేలాది లక్షలాది మందితో ఫ్యాన్స్ ను ఏర్పాటు చేసుకోవడం వలన సమాజానికి ఒరిగేది ఏమీ లేదు. నిర్మాణం చేస్తున్నటువంటి సినిమాల్లో ఏ మేరకు సమాజ హితాన్ని కోరుతున్నాము? సమ సమాజ స్థాపనకు అసమానతలు అంతరాలకు ఏరకంగా స్ఫూర్తినివ్వగలుగుతుంది? రాజ్యాంగబద్ధమైన హక్కులను పేద ప్రజానీకానికి అందివ్వడానికి మన ముందున్నటువంటి అవకాశాలు ఏమిటి? పేదరికం నిరుద్యోగము ఆకలి చావులు ఆత్మహత్యలను నివారించడానికి మార్గాలు ఏమైనా సినిమాలలో చూపగలుగుతున్నామా? రాజకీయ అధికార యంత్రాంగం యొక్క అవినీతిని బట్టబయలు చేయడానికి పేదరికం ని తరిమి కొట్టడం ద్వారా ప్రజా సంపదను అందరికీ సమానంగా పంచడానికి సంబంధించి ఏ సినిమాలోనైనా కథాంశం మనకు కనపడిందా? ఒక్కసారి సమాజ పక్షాన మనం, ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది అని మీతో విజ్ఞప్తి.
ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రి, పోలీసుఅధికారి హెచ్చరిక సినిమా రంగం కనువిప్పు కావడానికి తోడ్పడాలి:-
తొక్కిసలాట జరిగి రేవతి మృతి చెంది కొడుకు మరణశయ్య పైన కొట్టుమిట్టాడుతుంటే ఇప్పటికీ అల్లు అర్జున్ ఆ కుటుంబాన్ని పరామర్శించకపోవడం సిగ్గుచేటు. 25 లక్షలు ప్రకటించినట్లు చెప్పగానే సరిపోదు. జరిగిన తొక్కిసలాట, చట్టపరమైన అంశాలు, సినిమా హీరో పేరుతో చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం వంటి సంఘటనల నేపథ్యంలో అరెస్ట్ అయిన తర్వాత అదేదో దేశానికి జరిగిన అనర్ధం లాగా పోలీసులు సినిమా సిబ్బంది కోర్టులో పరిగెత్తి బెయిల్ తెచ్చుకోవడానికి చూపిన శ్రద్ధ సినిమా నిర్మాణంలో కానీ సినిమా సమాజానికి ఉపయోగపడే ప్రయోజనకరమైన సన్నివేశాలను కానీ నిర్మించడంలో చూపకపోవడం విడ్డూరం. పైగా సినిమాలోని కథ గమనించినప్పుడు పోలీసులను కూడా అతి హీనంగా చూపించడం, హీరో తన పలుకుబడితో ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని గజగజలాడించడం, ముఖ్యమంత్రినే స్వయంగా తన ఇంటికి రప్పించుకొని సన్మానం పొందడం, పోలీసులను అవమానించిన తీరు పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన విధానం స్వాగతించవలసిన అవసరం ఎంతగానో ఉన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 21 డిసెంబర్ 2024న అసెంబ్లీలో జరిగినటువంటి చర్చ సందర్భంగా ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ ఒక కుటుంబం మృత్యుపాలు కావడం, వాళ్ల కుమారుడు అనాధగా మిగిలిపోవడం, సినిమా సిబ్బంది రాజ్యమేలడం, కతాంశంలోని డొల్లతనం, పోలీస్ సిబ్బందిని హీనంగా చూసినటువంటి అంశంతో పాటు బెనిఫిట్ షోల పేరుతో రేట్లు పెంచుకోవడం ద్వారా లబ్ధి కోసం చేసిన ప్రయత్నాన్ని కఠినంగా హెచ్చరిస్తూ సీఎం తన ప్రసంగంలో ఇకముందు ఏ రకమైనటువంటి లబ్దిని సినిమా రంగానికి చేకూర్చడం జరగదని ఇలాంటివి ఇకముందు పునరావృతం కాకూడదని అంటే సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా బెనిఫిట్ షోలను రద్దు చేయడంతో పాటు ధరలు పెంచే ప్రసక్తి లేదని ప్రభుత్వ పక్షాన 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తున్నట్లు ఆ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ప్రకటించడం సినిమా రంగం యొక్క ఒంటెద్దు పోకడను కట్టడి చేసే క్రమంలో కొన్ని కఠిన చర్యలుగా భావించాలి.
పోలీస్ కమిషనర్ సాహసం చేసి తమ సిబ్బందిలో సీనియర్ అధికారులు కూడా మాట్లాడడం లేదని కానీ సినిమా నిర్మాణము, హీరో పని విధానము, మృత్యువాత, కోర్టు తీర్పులు, ఆ పైన ప్రజల స్పందన, ఆ కుటుంబాన్ని ప్రత్యేకంగా చూడడం వంటి అంశాల పైన స్పందిస్తూ పుష్ప2 సినిమాలో పోలీసులను అవమానించిన తీరు పైన సెన్సార్ బోర్డు అంత నిర్లక్ష్యంగా వివరించడాన్ని తప్పు పట్టడం సంతోష్ దాయకం. ప్రభుత్వాలు, అధికారులు, పోలీసుల కనుసన్నళ్ళో పాలన నడుస్తున్నప్పటికీ వాళ్లందర్నీ తప్పించి ఎర్రచందనం ఇతర దేశాలకు దొంగతనంగా పంపించడమే ఈ కథలోని గొప్పతనం అయితే అది సమాజానికి ఏ రకంగా తోడ్పడుతుందో చెప్పాల్సిన అవసరం ఉందని ఆ పోలీస్ అధికారి హెచ్చరించిన తీరును మనమందరం స్వాగతించవలసిందే. భవిష్యత్తులో ఏ రకమైన సినిమా నిర్మాణం చేసినా సెన్సార్ బోర్డు తో పాటు ప్రభుత్వం కూడా అందులో సామాజిక ప్రయోజనం ఉంటే తప్ప అనుమతించకుండా ఉన్ననాడు సినిమాల పైన ఈ మాత్రం కొనసాగుతున్న పిచ్చి తగ్గుతుంది. ప్రమాదాలు జరగకపోగా నిర్మాణాత్మకంగా వ్యవహరించవలసినటువంటి యువత సినిమాల బారిన పడి తమ జీవితాలను కోల్పోవడాన్ని కూడా అడ్డుకోవాల్సిన అవసరాన్ని ముఖ్యమంత్రి హెచ్చరిక సంబంధిత మంత్రి యొక్క ఆగ్రహము పోలీస్ కమిషనర్ యొక్క ప్రెస్ మీట్ రాష్ట్ర ప్రభుత్వానికి, సినిమా రంగానికి కూడా కనువిప్పు కావాల్సినటువంటి అవసరం వుంది. ముఖ్యమంత్రి ఈ సంఘటన పట్ల పుష్పటు సినిమాలోని కథాంశం పట్ల పోలీసు అధికారులు ముఖ్యమంత్రి పట్ల సినిమాలోని సన్నివేశాల పట్ల స్పందించిన తీరు ఇకముందు కూడా కొనసాగించాలి. ప్రస్తుతము నిర్మాణం అవుతున్నటువంటి సీరియల్ వివిధ రకాల సినిమాలలోనూ సామాజిక ప్రయోజనం ఏమాత్రం లేకపోగా కేవలం కొద్దిమంది సినిమా రంగానికి సంబంధించిన సిబ్బంది దర్శక నిర్మాతల యొక్క ప్రయోజనం కోసం ప్రజలందరినీ పావులుగా వినియోగించుకోవడం, గుడ్డిగా ఎగబడి యువతను తమ కర్తవ్యాన్ని విస్మరించే వాళ్ళుగా తయారు చేయడం మాత్రం నిజంగా సిగ్గుచేటు. ఈ రకమైనటువంటి అనర్థాలు సమాజంలో వివిధ రంగాల్లో జరుగుతూ ఉంటే ప్రభుత్వాలు కూడా నిర్లిప్తంగా ఉండడం, సామాజిక బాధ్యతను విస్మరించడo, ఏదో సంఘటన జరిగినప్పుడు మాత్రమే స్పందించడం కాదు ఒక్కొక్క శాఖకు సంబంధించినటువంటి మంచి చెడుల పైన మంత్రి అధికారులు నిక్కచ్చిగా ఉండి సమాజానికి ప్రయోజనం చేకూర్చనటువంటి నిర్ణయాన్ని నిర్దాక్షిణ్యంగా ఖండించడం, ఎంతటి వారైనా వారి నిర్ణయం పైన ఉక్కు పాదం మోపాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అసెంబ్లీలో స్పందించిన తీరు ఇకముందు సినిమా రంగంతో పాటు ప్రతి రంగంలోని అనర్థాల పైన కూడా కొనసాగించడం ద్వారా సామాజిక ప్రయోజనాలను విస్మరించి ప్రజలను పావు లుగా వాడుకునే దుష్టశక్తులను కట్టడి చేయడానికి తోడ్పడుతుంది. ఆ వైపుగా ప్రభుత్వాల ప్రయాణం కొనసాగాలని మనసారా కోరుకుందాం.
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ