సఖి కేంద్రంను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
సఖి కేంద్రంలో విధులను సమర్థవంతంగా నిర్వహించాలి.
సిబ్బంది నిబద్ధతతో పని చేయకుంటే కఠిన చర్యలు.
సఖి కేంద్రం సేవలపై పెద్ద ఎత్తున ప్రచారం అవసరం.
జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.
జోగులాంబ గద్వాల 8 జూన్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల.: సఖి కేంద్రంలో పనిచేసే సిబ్బంది సమర్థవంతంగా తమ విధులను నిర్వర్తించాలని, నిబద్ధతతో పనిచేయకుంటే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.
సోమవారం గద్వాలలోని సఖి కేంద్రంను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఐటీ, స్టోర్, సర్వైవర్, కిచెన్, తదితర విభాగాలను తిరిగి పరిశీలించారు. సిబ్బంది హాజరు రిజిస్టర్ తో పాటు ఇతర రికార్డులను పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్రంలో పెద్ద సంఖ్యలో సిబ్బంది పనిచేస్తున్నప్పటికీ ఇటీవల సంరక్షించబడ్డ ఓ మహిళ అదృశ్యం కావడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ పనిచేయకపోతే లాభమేమిటని ప్రశ్నించారు. గత రెండేళ్లలో కేంద్రంకు వచ్చిన కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. హింసకు గురై, ఇతర సమస్యలతో బాధపడుతున్న మహిళలు, బాల్యవివాహాలు, బాల కార్మికులు, ఇతరాత్ర సమస్యలతో వేదనకు గురైన బాలికలను సంరక్షించేందుకు, కౌన్సిలింగ్ నిర్వహించేందుకు ఉద్దేశించిన సఖి కేంద్రంలో ఎంతో బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమిటని మండిపడ్డారు. పోలీసు శాఖ నుంచి రిఫర్ చేసిన కేసులే ఇక్కడికి ఎక్కువగా వస్తున్నాయని, సఖి తరపున సంరక్షించబడుతున్న కేసులు చాలా తక్కువగా ఉన్నాయన్నారు. సఖి కేంద్రం అందిస్తున్న సేవలపై నిర్వహించే అవగాహన కార్యక్రమాలకు చాలా తక్కువ మంది హాజరయ్యారని, పెద్ద ఎత్తున, ఎక్కువ మందికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. రెండు నెలల్లో సఖి సిబ్బంది తమ పనితీరును మెరుగుపరుచుకోకుంటే నిర్లక్ష్యంగా ఉండే వారిని ఉద్యోగంలో నుంచి తొలగించి, అర్హులైన ఇతరులను తీసుకోవడం జరుగుతుందన్నారు. అనంతరం సఖి కేంద్రం పరిసరాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అక్కడ పొదలు, ఇతర వ్యర్థాలు ఉండడాన్ని గమనించి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత మహిళలకు రక్షణ, ఆశ్రయం కల్పించేందుకు ఉద్దేశించిన సఖి కేంద్రాన్ని చిత్తశుద్ధితో నిర్వహించాలని, అలసత్వం వహించే సిబ్బందిపై చర్యలు తప్పవని ఈ సందర్భంగా కలెక్టర్ హెచ్చరించారు.