శ్రీరామచంద్రా... త్రాగునీళ్లు ఏదయ్యా?!
జోగులాంబ గద్వాల 10 జూన్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి :- జిల్లా కేంద్రంలోని కొత్త కనెక్షన్‌కు మామూళ్లు ఇవ్వలేదని త్రాగు నీటి సరఫరా బంద్ చేసిన లైన్‌మెన్! మున్సిపల్ ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్లినా స్పందించని వైనం లంచం ఇవ్వనిదే గద్వాల మున్సిపాలిటీలో ఏ పనీ జరగడం లేదు: పట్టణ ప్రజల ఆగ్రహం! గద్వాల మున్సిపాలిటీలో రాజ్యమేలుతున్న అవినీతి!
గద్వాల మున్సిపాలిటీలో అవినీతి ఏ స్థాయికి చేరిందో చెప్పడానికి నిదర్శనంగా, కొత్తగా తీసుకున్న వాటర్ కనెక్షన్‌కు మామూళ్లు ఇవ్వలేదన్న నెపంతో ఏకంగా త్రాగునీటి సరఫరానే నిలిపివేసిన దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మున్సిపాలిటీ పరిధిలోని భీంనగర్‌లో నివసిస్తున్న ఓ ఇంటి యజమాని తన ఇంటి అవసరాల నిమిత్తం గత ఏప్రిల్ నెలలో త్రాగునీటి కనెక్షన్ కోసం మున్సిపాలిటీ నుంచి అన్ని రకాల అనుమతులు పొందారు. ఇందుకోసం ప్రభుత్వం నిర్ణయించిన రుసుము రూ. 7,050లను చలాన్ రూపంలో అధికారికంగా చెల్లించారు. అంతటితో ఆగకుండా వాటర్ కనెక్షన్ పైప్‌లైన్ మరియు కూలీల ఖర్చుల కోసం అదనంగా మరో రూ. 2,300 కూడా ఖర్చు చేశారు. కనెక్షన్ తీసుకున్న మొదటి నెల రోజుల పాటు త్రాగునీటి సరఫరా సక్రమంగానే సాగింది.
అయితే, గత 15 రోజుల నుంచి సదరు ఇంటికి త్రాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. పైప్‌లైన్‌లో ఏదైనా సాంకేతిక సమస్య ఉందేమోనని భావించిన బాధితుడు, స్థానిక వాటర్ లైన్‌మెన్ ను ఫోన్ ద్వారా సంప్రదించారు. దీనిపై లైన్‌మెన్ స్పందిస్తూ... "మాకు ఇవ్వాల్సిన మామూళ్లు (లంచం) ఇవ్వలేదు కాబట్టే లైన్ కట్ చేశాను. నువ్వు ఎవరికైనా చెప్పుకో... మామూళ్లు ఇస్తేనే త్రాగునీటి సరఫరా పునరుద్ధరిస్తాం" అని బహిరంగంగానే బెదిరిస్తూ, ఖరాకండిగా సమాధానం ఇచ్చాడు. అధికారుల ఉదాసీనత – ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం: లైన్‌మెన్ మాట్లాడిన ఆడియో మరియు లంచం వ్యవహారాన్ని ఒక వార్డు కౌన్సిలర్ గద్వాల మున్సిపల్ ఛైర్మన్ దృష్టికి తీసుకువెళ్లారు. లంచం ఇవ్వాల్సిన అవసరం లేదని, లైన్‌మెన్‌తో మాట్లాడి త్రాగునీటి సరఫరాను వెంటనే పునరుద్ధరిస్తామని ఛైర్మన్ హామీ ఇచ్చి మూడు రోజులు గడుస్తున్నా, ఇప్పటి వరకు ఆ ఇంటికి చుక్క నీరు కూడా విడుదల కాలేదు. ఒక మున్సిపల్ ఛైర్మన్ చెప్పినా కింది స్థాయి సిబ్బంది వినకపోవడం చూస్తుంటే మున్సిపాలిటీలో అవినీతి తిమింగలాలు ఏ స్థాయిలో రాజ్యమేలుతున్నాయో అర్థమవుతోంది. ప్రభుత్వ నిబంధనల మేర త్రాగు నీటి కనెక్షన్ కోసం ప్రభుత్వానికి చలాన్ కట్టినా, లంచం ఇవ్వలేదన్న ఒకే ఒక్క కారణంతో సామాన్య ప్రజల ప్రాథమిక హక్కైన త్రాగునీటిని నిలిపివేయడంపై పట్టణ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లంచం ఇవ్వనిదే గద్వాల మున్సిపాలిటీలో ఏ చిన్న పనీ కావడం లేదని ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఇది ఇలా ఉండగా రాజకీయ నాయకులు పలుకుబడితో ఎలాంటి అపరాద రుసుం చెల్లించకుండా అనేక మంది డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ పొందారు. నిబంధనల మేరకు అస్తిపన్ను, డ్రింకింగ్ రుసుము చెల్లిస్తేనే కొత్త కనెక్షన్ ఇవ్వాలి. అన్ని చెల్లించిన వారికి ముడుపులు ఇవ్వాలి, రాజకీయ నాయకుల జోక్యంతో కనెక్షన్ వారి నుంచి ఎలాంటి ముడుపులు అడగడం లేదు. గద్వాల మున్సిపాలిటి అన్ని వార్డులలో కొత్త కౌన్సిలర్లు ఎన్నుకోబడారు. వాళ్లకు పాలన మీద పట్టు దొరకకపోవడంతో మున్సిపాలిటిలో కింది స్తాయి సిబ్బంది నుంచి పై స్థాయి అధికారి వరకు ఇష్టారాజ్యం అయిపోయిందని పలు వార్డుల ప్రజలు ఆరోపిస్తున్నారు. కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు వార్డు సమస్యలతో పాటు పాలన పై పట్టు సాధిస్తే భవిష్యత్ ఉంటుంది. లేకపోతే one Time Settlements లాగ ఇదొకసారి ప్రజలు అవకాశం ఇచ్చే అవకాశంముంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు మరియు జిల్లా కలెక్టర్ స్పందించి, లంచగొండి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తక్షణమే సదరు ఇంటికి త్రాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని భీంనగర్ కాలనీవాసులు మరియు పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.