విద్యార్థుల ఆత్మహత్యలను అడ్డుకోలేమా?
భావి భారత పౌరుల జీవితాలు అర్ధాంతరంగా ఆగిపోవలసిందేనా?
ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు క్రియాశీల పాత్ర పోషించాలి.
వికాసమే ముఖ్యం కానీ ర్యాంకులు కాదని ఎలుగెత్తి చాటాలి .
యువతను కాపాడుకోవడం సామాజిక బాధ్యత కూడా..
సమాజంలోని విభిన్న వర్గాలలో అసంతృప్తి, ఆత్మ న్యూనత, వెనుకబాటు తన ము, పేదరికము, ఆర్థిక సంక్షోభం వంటి కారణాల రీత్యా కార్మికులు, రైతులు, చేతివృత్తుల వాళ్ళు, పేదవాళ్లు అనాదిగా ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయాన్ని మనం గమనిస్తోనేవున్నాం. అదే కోవలో బావి భారత పౌరులైన విద్యార్థులు వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల తో పాటు ఇంట్లో కూడా ఆత్మహత్యలకు పాల్పడిన సందర్భాలు మనకు తెలుసు. గత రెండున్నర దశాబ్దాలకు పైగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనేక పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులు ఈ దురాగతానికి పాల్పడడం అదే పరంపర నేటికీ కొనసాగడం ఆందోళన కలిగిస్తున్న విషయం. ఇటీవలి కాలంలో తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాలలో విద్యార్థుల ఆత్మహత్యలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి . తాత్కాలికంగా ఆందోళన కొనసాగించి యాజమాన్యం లేదా ప్రిన్సిపాల్ ను దో షిగా ముద్రించి న్యాయం చేయాలని శవాలను ముందు పెట్టి పోరాటం చేయడం తప్ప వీటికి పరిష్కారాలను కనిపెట్టే ప్రయత్నం అంతగా జరగడం లేదు. అంటే విద్యార్థుల తో పాటు ముఖ్యంగా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల పైన ప్రధాన పాత్ర ఉన్నదని గుర్తించడం చాలా అవసరం . రాజస్థాన్ రాష్ట్రంలోని కోట శిక్షణా కేంద్రాలలోని విద్యార్థులు కూడా అనేక మంది ఇటీవల ఆత్మహత్యలకు పాల్పడినట్లు అనేక రుజువులు ఉన్నాయి. వీటికి గల కారణాలను అన్వేషించి , శాస్త్రీయ దృక్పథంతో విశ్లేషించి, పరిష్కార మార్గాలను కనిపెట్టకుండా దాటవేస్తూ పోతే యువత ఎక్కువ గల భారతదేశంలో ఆ సంఖ్య దిగజారిపోయి అనేక కుటుంబాలకు శోకాన్ని మిగిల్చడం తప్ప చేసేది ఏమీ ఉండదు.
భావి భారత పౌరుల జీవితాలు అర్ధాంతరంగా ఆగిపోవాల్సిందేనా?
ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న కాలంలో నా అనుభవంలో ఐదవ తరగతి విద్యార్థి(2003) కుటుంబ ఆర్థిక పరిస్థితి కారణంగా వీధిలో జరిగిన అవమానానికి మానసిక క్షోభకు గురై ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇంకా నా మదిలో కదలాడుతూనే ఉంది. అన్నా చెల్లెల మధ్యన తగువులాటతో, కొత్త డ్రెస్సులు కొనివ్వలేదని, టీవీ చూసే సందర్భంలో ఘర్షణ, తల్లిదండ్రులు మందలించినారని, ఉపాధ్యాయులు బెదిరించినారని, పాఠ్యాంశాల మానసిక ఒత్తిడికి తట్టుకోలేకపోతున్నామని, ఫెయిల్ అయినందుకు కొందరు, ఉత్తీర్ణులము కాగలమో లేదో అనుమానంతో మరికొందరు నిరంతరము విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతూనే ఉన్నారు. ఇటీవలి కాలంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న వాళ్లు అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోయి కొందరు ఉత్తరాలు రాసి పెడితే మరికొందరి మృతి వీడని మిస్టరీగా మిగిలిపోతూనే ఉన్నది. మొత్తం విద్యా వ్యవస్థలో సుమారు 7 శాతంగా ఉన్నటువంటి రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యాభ్యాసము నాణ్యతగా ఉంటుందని సౌకర్యాలు అవకాశాలు మెరుగు ఉంటాయని నమ్మకంతో ఇటీవల కాలంలో సమాజం డిమాండ్ మేరకు ప్రభుత్వాలు కూడా రెసిడెన్షియల్ పాఠశాల లను ప్రారంభించడం జరుగుతున్నది . ఇదే క్రమంలో కుటుంబాలకు దూరంగా నెలల తరబడి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులను విడిచిపెట్టి ఉండడం వలన కూడా మానసిక వేదనకు గురవుతున్నట్టుగా అనేక సంఘటనల ద్వారా అర్థమవుతున్నది. పై అన్ని రకాల కారణాలను విశ్లేషించినప్పుడు విద్యార్థుల పైన అధిక ఒత్తిడి, పోటీ తత్వం కారణంగా ర్యాంకుల కోసం పెరిగిన ఆరాటం కుటుంబాలను ఆందోళనకు గురి చేస్తూ విద్యా కుసుమాలు రాలిపోతుంటే బావి భారత పౌరుల జీవితాలు ఇలా అర్ధాంతరంగా ముగిసి పోవాల్సిందేనా? అధిక మార్కులు సాధించాలని ఒత్తిడి, అంచనాలతో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల కారణంగా విద్యార్థులు బలి పశువులు కాక తప్పడం లేదు.
వసతి గృహాలతో పాటు ముఖ్యంగా ఇటీవల గురుకులాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఎక్కువమంది మానసిక ఆందోళనకు గురి అయ్యి, తమ అభిప్రాయాలను భావోద్వేగాలను పంచుకునే అవకాశాలు లేక, తమలో తామే బాధపడి, పరిష్కారం లేని పరిస్థితిలో ఇంటికి రాలేక ఒత్తిడి భరించలేక విగత జీవులుగా మారుతున్న విషయం మన అనుభవములోనిదే . సున్నితమైన అభిప్రాయాలు కటోరమైన మార్కులు ర్యాంకుల టార్గెట్లు రెండింటి మధ్యన విద్యార్థులు సంక్షోభానికి గురవుతున్న విషయాన్ని విద్యార్థులు ఉపాధ్యాయులు సమాజం అర్థం చేసుకోవాలి . స్వేచ్ఛ తో కూడుకున్న విద్యా విధానం కరువై పోటీ తత్వాన్ని పెంచి సవాల్ గా తీసుకోవడమే తప్ప మార్గం లేని పరిస్థితిలో తట్టుకోలేని కొందరు ఈ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఆత్మ న్యూనతా భావానికి గురైన ఏ వర్గమైనా ఇలాంటి సాహసాలకు పూనుకోవడం రైతులు కార్మికులు చేనేత కార్మికులు ఇతర వర్గాలలో మనం చూడవచ్చు.
కొన్ని పరిష్కార మార్గాలను ఆలోచిస్తే.
1ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలోని పేద కుటుంబాలు ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితుల కారణంగా కూడా జరుగుతున్న కొన్ని ఆత్మహత్యలను నివారించడానికి పేదరిక నిర్మూలన చర్యలను ప్రభుత్వాలు ముమ్మరం చేయాలి.
2. ప్రాథమిక స్థాయి నుండి స్నాతకోత్తర స్థాయి వరకు విద్యార్థుల యొక్క ఆర్థిక పరిస్థితులను ఆధారంగా వాళ్లకు అన్ని రకాల సౌకర్యాలను లోటు లేకుండా కల్పించవలసిన బాధ్యత కూడా ప్రభుత్వాలదే .
3.తల్లిదండ్రులు ఉపాధ్యాయులు తరచుగా విద్యాసంస్థల్లో సమావేశాలను నిర్వహించి విద్యార్థుల్లో మానసిక స్థైర్యాన్ని కల్పించి వారి అభిప్రాయాలను స్వేచ్ఛగా ప్రకటించే విధమైన నూతన పరిస్థితులను కల్పించి ఒత్తిడిని తగ్గించాలి.
4.ఇటీవల ఆన్లైన్ సెల్ఫోన్ వ్యవస్థకు బానిసలుగా మారుతున్న కారణంగా కూడా ఇలాంటి వికృత పరిణామాలు చోటు చేసుకోవడాన్ని మనం గమనించవచ్చు
5.బోధనా విధానంలో మార్పులను తీసుకురావడం ద్వారా విద్యార్థులను ప్రోత్సహించే విధంగా వారిలో ధైర్యాన్ని సంతోషాన్ని తట్టి లేపే విధమైనటువంటి చర్యలు చేపట్టాలి.
6. తరచుగా వైద్య పరీక్షలు నిర్వహించడం ద్వారా శారీరక మానసిక అస్థిరత కలిగిన విద్యార్థులకు తగిన కౌన్సిలింగ్ ను ఇవ్వడం ద్వారా భారీ నష్టాన్ని నివారించవచ్చు.
7.అటు తల్లిదండ్రులు ఇటు ఉపాధ్యాయులు కూడా పిల్లల యొక్క మానసిక స్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూనే ఎప్పటికప్పుడు సమీక్షలు జరపడంతో పాటు ఆత్మస్థై ర్యాన్ని పెంచే విధంగా తీర్చిదిద్దాలి.
8.మార్కులు, ర్యాంకులను ప్రధానం చేస్తున్న విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయవలసిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉన్నది. అదే సందర్భంలో ఉపాధ్యాయులు తల్లిదండ్రులు కూడా పోటీ తత్వానికి అంతగా ప్రాధాన్యత ఇవ్వకుండా సామర్ధ్యాలు ఆకాంక్షలు అనుభవాలు ఆసక్తులను తట్టి లేపే విధంగా విద్యాసంస్థలలో కృషి జరగాలి.
9.పుస్తక పట నానికి పాఠ్యాంశాలకు అతిగా ప్రాధాన్యత ఇవ్వకుండా విద్యార్థుల ఉపాధ్యాయుల అనుభవాలే కేంద్రంగా చర్చలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.
10.ప్రభుత్వాలు విద్యార్థుల పుస్తకాల మో తను తగ్గించడంతోపాటు.
సృజనాత్మకతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే విధంగా సిలబస్లో వినూత్న మార్పులు తీసుకురావాలి. ఈ రకమైన కృషి జరపకుండా, ఉపాధ్యాయులు తల్లిదండ్రులు మారకుండా, ప్రభుత్వాలు చర్యలు తీసుకోకుండా ఆత్మహత్యలు ఆగాలి అని మనం ఆశించడం అత్యాశే అవుతుంది. బాధ్యతలు నిర్వహించకుండా ఫలితాన్ని కోరుకోవడం పక్కన బెట్టి నిర్మాణాత్మకమైన కృషిని అన్ని వర్గాలు కొనసాగించడం ద్వారా రెసిడెన్షియల్ పాఠశాలలు వసతి గృహాలతో పాటు విద్యార్థి లోకంలో జరుగుతున్నటువంటి ఇలాంటి అనర్థాలను అడ్డుకోవాల్సిన బాధ్యత సమాజం పైన ముఖ్యంగా ఉన్నది. ఎందుకంటే నేటి యువత పైననే రేపటి భవిష్యత్తు ఆధారపడి ఉంది కనుక వారిని కాపాడుకోవడం మనందరి విధి . ఈపాటి సోయి,శ్రద్ద, బాధ్యత ప్రభుత్వాలు గుర్తించినప్పుడు మాత్రమే మన ఆలోచన ఆకాంక్షలు అక్షర రూపం దాలుస్తాయి, విద్యా కుసుమాలు మరింత విరబూస్తాయి.
--- వడ్డేపల్లి మల్లేశం
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రక్షితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు హుస్నాబాద్ (చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)