రాష్ట్రంలో దంచికొడుతున్న ఎండలు.. రాబోయే 5 రోజులు మరింత పెరుగనున్న ఉష్ణోగ్రతలు
హైదరాబాద్:-రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల గరిష్టానికి చేరుకున్నాయి. సూర్యుడి ప్రతాపంతో ఉదయం నుంచే ఉక్కపోత మొదలవుతున్నది. పొద్దున 9 గంటలకే భానుడు భగభమంటున్నాడు. రాబోయే 5 రోజులపాటు ఉష్ణోగ్రతలు మరింత తీవ్రంగా ఉంటాయని హైదరాబాద్ వాతారణ కేంద్రం తెలిపింది. 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు వడగాడ్పుల ముప్పు అధికంగా ఉంటుందని పేర్కొంది.
శనివారం నల్లగొండ జిల్లాలోని శివన్నగూడెంలో అత్యధికంగా 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. మరో రెండు రోజుల్లో ఉష్ణో గ్రతలు 44 డిగ్రీలకు చేరే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు. కాగా, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేశారు.