రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులను జారీ చేస్తాం

Apr 16, 2026 - 22:07
Apr 16, 2026 - 22:11
 0  9
రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులను జారీ చేస్తాం

రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులను జారీ చేస్తాం

జీవో 252 లో అవసరమైన మేరకు సవరణలు చేస్తాం

జర్నలిజంతో సంబంధం లేనివారికి అక్రెడిటేషన్లు జారీ కాకుండ చూడాలి

ఎలైట్ పీపుల్స్ నుంచి జర్నలిస్టులను తొలగించాలి

తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే.శ్రీనివాస్ రెడ్డి

మేడ్చల్: రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు జారీ చేస్తామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే.శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. జర్నలిస్టు సంఘాలు, జర్నలిస్టుల అభ్యర్థన మేరకు 252 జీవోలో, అవసరమైన మేరకు సవరణలు చేసి డిపిఆర్ఓలకు పంపిస్తామని చెప్పారు. గురువారం మేడ్చల్ జిల్లాలోని ఎస్ఎన్ఆర్ పుష్ప కన్వెన్షన్ లో టియుడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర విస్తృత స్థాయి 

కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు కె.విరాహత్ అలీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మీడియా అకాడమీ చేర్మెన్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, జర్నలిస్టులకు జారీ చేసే అక్రెడిటేషన్ కార్డుల విషయంలో ఎలాంటి అపోహలు పడవద్దని సూచించారు. గతంలో కంటే మెరుగైన జీవోను ఈ ప్రభుత్వం తీసుకువచ్చిందని చెప్పారు.

సర్క్యులేషన్ ప్రాతిపదికన కార్డులను రాష్ట్ర, జిల్లా స్థాయిలో జారీ చేస్తారని అన్నారు. కేబుల్ ఛానల్ జర్నలిస్టులకు జారీ చేసే కార్డుల విషయమై సబ్ కమిటీ వేశామని ఆ కమిటీ నివేదిక మేరకు నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. పెద్ద పత్రికల జర్నలిస్టులేవరికీ అన్యాయం జరగదని, ఆయా పత్రికల్లో డెస్క్ సబ్ ఎడిటర్లుగా పనిచేస్తున్న వారందరికీ అక్రెడిటేషన్ కార్డులు మంజూరు చేస్తారని అన్నారు. జర్నలిజం వృత్తితో సంబంధం లేని వారికి అక్రెడిటేషన్లు జారీ కాకుండా యూనియన్ బాధ్యులు జాగ్రత్త వహించాలని సూచించారు. నకిలీ జర్నలిస్టులకు కార్డులు అందకుండా అడ్డుకోవాలని అన్నారు. అక్రెడిటేషన్ కమిటీ సభ్యులకు త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి వారికి కూడా అవగాహన కల్పిస్తామన్నారు. 

హైదరాబాద్ లోని జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ సభ్యులకు ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు అభ్యంతరకరమైందని, ఐఏఎస్, ఐపిఎస్ లు, ఎమ్మెల్యేల జీవితాలతో జర్నలిస్టులను పోల్చడం అభ్యంతర కరమైందన్నారు. జర్నలిస్టులు ఉన్నత వర్గాలు కాదని, ఇటీవల విజయవాడలో జరిగిన ఐజేయు ప్లీనరీ సమావేశంలో తీర్మానం చేసినట్లు ఆయన తెలిపారు. ఐజేయు స్టీరింగ్ కమిటీ సభ్యులు దేవులపల్లి అమర్ మాట్లాడుతూ సంఘం సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలను క్షేత్ర స్థాయిలోకి తీసుకువెళ్లాలని, సంఘం బలోపేతం కోసం పాటుపడాలని, సభ్యుల సంఖ్య ముఖ్యం కాదని, పనిచేయడం ముఖ్యమన్నారు.

 అర్హులైన జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు అందే విధంగా పాటుపడాలన్నారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కే. విరాహత్ అలీ మాట్లాడుతూ, ఆయా జిల్లాల్లో నిర్వహించాల్సిన మహా సభలను మే 15లోగా నిర్వహించాలని మరికొన్ని జిల్లాల సభలను జూన్ 15 లోపు నిర్వహించాలని సూచించారు. రాష్ట్రంలో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు వచ్చే విధంగా యూనియన్ కృషి చేస్తుందని అన్నారు. అంతకుముందు మూడు మాసాల కాలంలో ప్రమాదాలు, అనారోగ్య కారణాలవల్ల మరణించిన 16 మంది జర్నలిస్టులకు నివాళి అర్పించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రాంనారాయణ తన నివేదికను సమర్పించారు.

ఈ సందర్భంగా సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేశన్ కార్డులు జారీ చేయాలని, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే జర్నలిస్టులకు కూడా వైద్య సదుపాయాన్ని కల్పించాలని, ఐజేయు ప్లీనరీలో చేసిన తీర్మానం మేరకు హైదరాబాద్ లో జాతీయ మహిళా జర్నలిస్టుల సదస్సును ఏర్పాటు చేయాలని, జాతీయ న్యూస్ పేపర్స్ కన్ఫడరేషన్ జాతీయ సమావేశాన్ని హైదరాబాద్ లో నిర్వహించాలని తీర్మానించారు. అలాగే రాష్ట్రంలో జర్నలిస్టులపై నమోదవుతున్న కేసులపై నిజానిర్ధారణ చేసేందుకు గాను, సీనియర్ పాత్రికేయులతో త్రిసభ్య కమిటీని నియమించాలని సమావేశం నిర్ణయించింది. ఈ సమావేశ నిర్వహణకు మేడ్చల్ జిల్లా కమిటీ ఆతిథ్యాన్ని ఇచ్చింది. ఈ సమావేశానికి రాష్ట్ర కార్యవర్గంతో పాటు 29 జిల్లాల యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు హాజరయ్యారు. 

ఇంకా ఈ సమావేశంలో ఐజేయు స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎం.ఏ మాజీద్, జాతీయ ఉపాధ్యక్షులు వై.నరేందర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు నగునూరి శేఖర్, కే సత్యనారాయణ, అజిత, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కే. రాములు, కోశాధికారి మోతే వెంకట్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఫైసల్ అహ్మద్, బుర్ర సంపత్ కుమార్ గౌడ్, గాడిపల్లి మధు, రాష్ట్ర కార్యదర్శులు వరకాల యాదగిరి, శ్రీకాంత్ రెడ్డి, గుండ్రాతి మధు గౌడ్, రాష్ట్ర చిన్న, మధ్యతరగతి పత్రికల అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యూసుఫ్ బాబు, అశోక్, మేడ్చల్ జిల్లా యూనియన్ అధ్యక్షుడు జి.బాల్ రాజ్ గౌడ్, కార్యదర్శి వెంకట్రాంరెడ్డి, వివిధ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333