మేం ఓడిపోలేదు. ఓట్ల చోరీకి పాల్పడి 90లక్షల పేర్లు తొలగించి మోసం చేశారు

May 28, 2026 - 15:30
May 28, 2026 - 15:33
 0  0

మేం ఓడిపోలేదు.

ఓట్ల చోరీకి పాల్పడి 90లక్షల పేర్లు తొలగించి మోసం చేశారు అంటున్న  టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ.

స్వతంత్ర ఎన్నికల వ్యవస్థ  నీడలో  ఇది వాస్తవమైతే  సమగ్ర విచారణ  జరిపించాలి. 

 ప్రజాస్వామ్యం పేర జరిగే ఈ అవమానం బాధాకరం.

----వడ్డేపల్లి మల్లేశం

ఇటీవల పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అస్సాం రాష్ట్రాలకు జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలు  4, మే 2026 సోమవారం రోజున వెలువడిన సందర్భంగా  అనేక ప్రశ్నలకు  ఆస్కారం ఇవ్వడాన్ని  క్షుణ్ణంగా పరిశీలించవలసిన అవసరం ఉంది .సాధారణంగా ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత  ప్రజల అభీష్టం మేరకు పరిపాలనలో ప్రభుత్వంలో వచ్చిన మార్పు పట్ల ఆసక్తితో ప్రజలు ప్రజాస్వామ్యవాదులు  సంబరాలు జరుపుకుంటే అర్థం ఉంటుంది. కానీ అనేక వాగ్దానాలు,  థాయిలాలు గుప్పించి  సినిమా నటుడు అయితే  ప్రజాకర్షణ భ్రమలో  లక్షలాది మందిని సమీకరించి  తొక్కిసలాటలో  వందలాది మందిని కోల్పోతూ  జరుగుతున్న ఎన్నికల ప్రచారం  తర్వాత  అసలైన పార్టీ ప్రతినిధులు ఎవరు?  గత ప్రభుత్వాల కంటే మిన్నగా పరిపాలన చేయగలరా?  విద్యా వైద్యాన్ని ప్రభుత్వ రంగంలోనే అమలు చేసి నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టే శక్తి ఉందా?  వాళ్ళ ఎన్నికల ప్రణాళికలో ఈ విషయాలను ఎప్పుడైనా ప్రస్తావించినారా?  అని చర్చించుకోవడం అవసరం. అలాంటి ""మార్పులకు నాంది పలికిన పార్టీ అధికారంలోకి వస్తే సంతోషపడితే అర్థం ఉంటుంది.  ఇది ప్రజల పరంగా  రావలసినటువంటి మార్పు, ఆలోచన చర్య  కానీ ప్రజల నుండి ఎలాంటి స్పందన లేకపోగా  ఎన్నుకోబడినటువంటి రాజకీయ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు  తహతహలాడుతూ,  ఇతర పార్టీల పైన  విమర్శలు గుమ్మరిస్తూ,  తమ ఆధిపత్యాన్ని చలాయించే క్రమంలో  ప్రజలు తమకు మద్దతు పలికినట్టు తమ పట్ల పూర్తి విశ్వాసాన్ని ప్రదర్శించినట్లు నమ్మలికే ప్రయత్నం చేస్తూ సంబరాలు జరుపుకోవడం నిజంగా  తమను తాము పొగడుకోవడమే అవుతుంది.? "" ఎన్నుకోబడిన పార్టీ యొక్క క్రమశిక్షణ,  ప్రణాళిక,  మానవీయ విలువలు,  సేవా దృక్పథం  గుర్తించిన ప్రజలు జరుపుకునే  పండుగకు బదులు  ప్రజల ఆలోచనలు కప్పిపుచ్చే క్రమములో  పోలీసుల పహారా మధ్యన  రాజకీయ పార్టీలు పండుగ జరుపుకోవడం  అదుపు తప్పితే ఈ పండుగల సందర్భంగా  మృత్యు సంఘటనలు జరిగిన కూడా ఆశ్చర్యపోనక్కరలేదు. వాళ్లకు కావాల్సింది స్వప్రయోజనం, స్వార్థం,  గెలుపు, ఆకర్షణ,   రాజ్యాధికారం మాత్రమే. కానీ ప్రజల యొక్క ప్రయోజనం  ఏ నాడు ఏ పార్టీ ఏ ప్రభుత్వం కూడా ఆశించదు. ""  ప్రజలు విజ్ఞత కలిగి చైతన్యవంతులై ఆరోగ్యంగా ఉంటే  దేశాభివృద్ధి సాధ్యమని  ఆ వైపుగా కృషి చేయడం ద్వారా ప్రజల మన్ననలు చూర గొనా- లనే కనీస అవగాహన లేని పాలకులు  80 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నప్పటికీ ఏ రాజకీయ పార్టీ కూడా  తమ ఎజెండాలో విద్యా వైద్యం  ప్రస్తావించకపోవడం. అదే సందర్భంలో ప్రజలు కూడా  వాగ్దానాలు, థాయిలాలు  అంగీకరించే బదులు  తమ ఆరోగ్యం తమ పిల్లల విద్య కోసం డిమాండ్ చేయగలిగితే  ఈ దేశంలోని  మెజారిటీ ప్రజానీకం సకల సమస్యలకు పరిష్కారం దొరికేది. ""  ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల సందర్భంగా ఏ రాజకీయ పార్టీ అయినా ఈ అంశాలను ప్రస్తావించినట్లు గమనించినారా?  లేదు కదా!  అంటే అక్కడే ప్రజల పట్ల  పాలకుల యొక్క కుట్ర వ్యక్తం అవుతున్నది.  ఇదే అంశాన్ని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  ప్రస్తావించి  ""భారత రాజ్యాంగం ప్రకారం   విద్యా వైద్యాన్ని ప్రజలకు ఉచితంగా  నాణ్యమైన పద్ధతిలో అందించాలని  నిర్దేశిస్తూనే ఆ పని ఏ ప్రభుత్వం కూడా తలపెట్టదు. ఎందుకంటే వాళ్ళ ఉనికికే ప్రమాదం అయ్యే ఈ రెండు   బలపడితే వాళ్ళ అస్తిత్వమే లేకుండా పోతుందనేది  దాని సారాంశం.

"నీతివంతమైన సమగ్ర విచారణ కు డిమాండ్:

ఎన్నికల నిర్వహణ అయినా   సక్రమంగా న్యాయబద్ధంగా జరుగుతుందా?  స్వేచ్ఛగా స్వతంత్రంగా ప్రజలు ఓటు వేయగలుగుతున్నారా?  ఒక రాజకీయ పార్టీని ప్రభుత్వంలో ఉన్న రాజకీయ పార్టీ  అనగ తొక్కుతున్నదా?  కేంద్ర ప్రభుత్వం  రాష్ట్రాల పైన ఇతర రాజకీయ పార్టీల పైన అధికారం చలాయిస్తుందా?  అనే విషయాల పైన సమగ్రంగా చర్చించుకోవడం అవసరం. తమిళనాడులో టీవీకే పార్టీ  అధినేత  నటుడు  ఎన్నికలకు ముందు జరిగిన  బహిరంగ సభ తొక్కిసలాటలో ఎంతోమంది చనిపోవడం  జగమెరిగిన సత్యమే.  తెలంగాణ రాష్ట్రంలో కూడా  పుష్ప సినిమా ప్రదర్శన సందర్భంగా ఒక స్త్రీ  నేలకొరిగిన విషయం మనకు తెలుసు.  ఒక్కొక్కరికి 20 లక్షల చొప్పున  నష్టపరిహారం ప్రకటించినట్లుగా  చెన్నై సంఘటనలో చెబుతున్నప్పటికీ  ప్రజలను వంచించడం,చంపడం, నష్టపరిహారం చెల్లించడం  ఇదే నా రాజనీతి? అని ప్రశ్నించుకోకపోతే ఎలా?  ప్రభుభక్తిని గుడ్డిగా ప్రదర్శిస్తే  ప్రజల పైన  పార్టీలు ప్రభుత్వాలు స్వారీ చేస్తూనే ఉంటాయి.  ఇక ప్రజల కోసం పని చేస్తున్న కొన్ని రాజకీయ పార్టీల పరిపాలన క్రమంలో  కేంద్రం ఇతర  వర్గాల యొక్క జోక్యం కూడా  ఈ దేశంలో కొనసాగుతున్నదని రాష్ట్ర అధినేతలు  విమర్శించడంలోని వాస్తవాన్ని  రాబట్టవలసిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే స్వేచ్ఛ స్వాతంత్రానికి  నిలువుటద్దమైన భారత రాజ్యాంగం మేరకు పరిపాలన అందించే బదులు  హింస, ఆధిపత్య రాజకీయాలకు ఏ పార్టీ పాల్పడినా కూడా అది సహించరాని నేరమే అవుతుంది .ఇటీవల ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో తృ ణమూల్ కాంగ్రెస్ ఓటమి పాలై  బిజెపి అధికారంలోకి  వచ్చే సమయం ఆసన్నమైనవేళ   ఓటమి పాలైన  టి ఎం సి అధినేత్రి మమతా బెనర్జీ"  "ఇది మా పార్టీ యొక్క ఓటమి కాదని, బలవంతంగా  ఓడించడం అని,  ఓట్ల చోరీకి బిజెపి పాల్పడినదని,  90 లక్షల ఓట్లను నిర్దాక్షిణ్యంగా ఓటర్ల జాబితా నుండి తొలగించడం ద్వారా  ఎన్నికల సంఘం  నిరంకుశంగా వ్యవహరిస్తే  ఆ సంస్థ కేంద్ర ప్రభుత్వ నీడలో పనిచేసినట్లు  ఎన్నికలు నిర్వహించి  ఫలితాలు ప్రకటించిన రోజున  వెల్లడించడాన్ని  సభ్య సమాజం, మేధావులు,న్యాయవ్యవస్థ  పరిశీలించవలసిన అవసరం ఉంది.ఎందుకంటే ఈ దేశంలో  స్వేచ్ఛ స్వాతంత్ర్యాలకు కొదవలేదు అనే భ్రమలో  దశాబ్దాలుగా పాలన కొనసాగుతున్నది కానీ హింస, ఆధిపత్యం,  అత్యాచారాలు,  దోపిడీ పీడన, వర్గ దృక్పదము,  సామాన్యులు దళితులు ఆదివాసీల పైన  వివక్షత  నిరంతరం కొనసాగుతూ ఉంటే  వాటి జోలికి పోకుండా వాటిని ప్రస్తావించకుండా  ఆకర్షణ పథకాల భ్రమలో ప్రజలను  కూరుకు పోయేలా  నిద్రపుచ్చి  ప్రశ్నించకుండా  బలి పశువులను చేస్తున్న రాజకీయ, ఎన్నికల వ్యవస్థ  ఈ దేశంలో కొనసాగడం అత్యంత బాధాకరం అవమానకరం కూడా .ఎన్నికలకు ముందు నుండి కూడా ముఖ్యంగా బెంగాల్ రాష్ట్రం నుండి  కేంద్రం పైన ఓటర్ల జాబితా నుండి లక్షలాదిమంది ఓటర్లను తొలగించడం,  ఎలక్ట్రిక్ ఓటింగ్ మిషన్ల యొక్క  మోసం, కేంద్ర ప్రభుత్వానికి ఆ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఫలితాలు వచ్చేలాగా  ఈవీఎంలలో తప్పుడు పనులకు పాల్పడుతున్నట్లు ఆరోపిస్తున్నప్పటికీ  కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపించకపోవడం విచారకరం.   ఈ దేశంలో అన్యాయాన్ని తుడిచిపెట్టి  న్యాయాన్ని కనీసo గా అయినా అందించవలసిన బాధ్యతల్లో ఉన్నటువంటి సర్వోన్నత న్యాయస్థానం కూడా  ఇంత స్పష్టమైన ఆరోపణలను  సుమోటోగా స్వీకరించకపోవడం వెనుక ఎవరి హస్తం ఉన్నదో. . పౌర సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు, మేధావులు  అనేక సందర్భాలలో  ఎలక్షన్ ఓటింగ్ మిషన్లపైన వస్తున్న ఆరోపణలను బట్టబయలు చేసే క్రమంలో  సమగ్ర విచారణ జరగాలని  డిమాండ్ చేస్తున్నప్పటికీ  కేంద్రం స్పందించకపోవడం,  విచారణ జరిపించకపోవడం,  వాస్తవాన్ని అంగీకరించకపోవడం,  అంతిమంగా న్యాయవ్యవస్థ కూడా ఈ విషయంలో  మౌనం వహించినట్టుగా రాజకీయ సామాజిక విశ్లేషకులు  ఆవేదన చెందుతూ ఆందోళనకు గురవుతున్నారు.

ప్రపంచంలోనే అత్యంత  విస్తృత రాజ్యాంగాన్ని కలిగి ఉండి కూడా  కనీస న్యాయాన్ని  ప్రజలకు అందించకపోవడంలోని ఔచిత్యం ఏమిటి? దీనికి ఎవరు బాధ్యులు?  పొరపాటు జరుగుతున్నది ఎక్కడ? నేరస్తులకు  తగిన శిక్ష విధించి  చట్టానికి ఎవరూ కూడా అతీతులు కారని రుజువు చేయాల్సిన అవసరం లేదా ?  మమతా బెనర్జీ ఆరోపణలను హృదయపూర్వకంగా స్వీకరించి కేంద్ర ప్రభుత్వం, బిజెపి పార్టీ  తగిన విచారణకు  సిద్ధమైతే  వాస్తవాలు ఏమిటో బయటపడతాయి.""  ఎన్నికల చోరీ,,ఎలక్ట్రిక్ ఓటింగ్ మిషన్ల మోసం ఏకపక్షంగా ప్రభుత్వ అనుకూలంగా  సీట్లు రావడానికి కారణం అవుతున్నట్లు  ఎన్నోసార్లు  ఆరోపణలు వచ్చినా వాస్తవం లేదని కేంద్రం  రుజువు చేయలేదు.  ఎలక్ట్రిక్ యంత్రాలను  తయారుచేసినటువంటి సాంకేతిక నిపుణులు కూడా సవాల్ విసిరి  తమ చిత్తశుద్ధిని రుజువు చేసుకోలేదు. ఈ అన్నింటికీ  ప్రత్యక్ష సాక్షిగా ఉన్న న్యాయవ్యవస్థ కూడా  అవమానకరమైన  ఓట్ల చోరీ అంశం పైన సమగ్ర విచారణకు ఆదేశించిన సందర్భాలు లేకపోవడం పైన సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు." తమలాంటి సాధారణ ప్రజలకు న్యాయం ఎలా జరుగుతుంది? ఒక రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న పార్టీకే  అన్యాయం  మోసం  చ ట్టపరమైన దోపిడీ  జరిగినట్లుగా  పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ కథనం ద్వారా తెలుస్తూ ఉంటే  దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ దేశ  పాలకులకు లేదా? ఒకవైపు ఎన్నికల్లో ఓటమి పాలైన తృణమూల్ కాంగ్రెస్  కేంద్రం బిజెపి పైన స్పష్టమైన ఆరోపణలు చేస్తూ ఉంటే మరొకవైపు బిజెపి పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం  వ్యూహాలు పన్నుతున్నదే కానీ మమత  ఆరోపణలలోని  వాస్తవాల పైన స్పందించడానికి సిద్ధంగా లేకపోవడం  సామాజిక రాజకీయ బాధ్యతను విస్మరించడమే అవుతుంది .ఒక రాష్ట్ర పాలనా వ్యవస్థకే  ఇబ్బందులు కలిగిస్తూ  పరిపాలనను అస్తవ్యస్తం చేసినట్టుగా  ఆరోపణలు రావడం  గతంలో ఢిల్లీని పరిపాలించినటువంటి  ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ నాయకత్వంలోని ప్రభుత్వం పైన కూడా  అధికారాలను కుదించి  ఆరోపణలతో జైలు పాలు చేసి  ఇటీవల నిర్దోషిగా బయటకు రావడం వెనుక ఉన్న  వాస్తవాలను పరిశీలించకపోతే   "న్యాయం అన్యాయానికి" తేడా ఏముంటుంది? "" విజ్ఞత కలిగిన ప్రజలు  తమకున్న విచక్షణ అధికారంతో పాలకులను ప్రశ్నించాలి  తమ ఓట్లకు  పుట్టిన ప్రభుత్వాలను  నిలదీసే అధికారం  ప్రజలకే ఉంటుంది .ఇదే సందర్భంలో దేశంలోని అన్ని  రాజకీయ పార్టీలు కూడా  స్వతంత్ర ఎన్నికల వ్యవస్థ  కోసం  ఎన్నికల్లో  అరాచకాలను  ఖండిస్తూ  అక్రమంగా తొలగించినటువంటి లక్షలాది ఓటర్ల  అంశం పైన పోరాడుతూనే  రాష్ట్రాలకు ఉండాల్సిన హక్కుల విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటే  ఊరుకునేది లేదని సంయుక్తంగా ప్రకటించగలిగితే  కేంద్రం దిగివస్తుంది.  న్యాయ వ్యవస్థ కూడా  ఆరోపించబడినటువంటి అన్ని విషయాల పైన  విచారణ జరిపే అవకాశం ఉంటుంది". ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా  గెలుపొందిన రాజకీయ పార్టీల  కోలాహలాన్ని పక్కనపెట్టి  ఆ పార్టీల యొక్క ప్రజా దృక్పథం,  ఎజెండా,  పాలనా సామర్థ్యం  ఆధారంగా  పాలకులను ఆదేశించగలిగితేనే  ప్రజాస్వామ్యంలో ప్రజలకు గలఓటు హక్కుకు అర్థం ఉంటుంది .బిజెపి పార్టీ పైన వస్తున్నటువంటి  విమర్శల నీలి నీడలను  తొలగించుకొని  చిత్తశుద్ధిని ప్రదర్శించుకోవడం  ప్రస్తుతం బిజెపి పార్టీ పైన కేంద్ర ప్రభుత్వం పైన  ఉన్న ప్రధాన బాధ్యత. "  తల్లిదండ్రుల వంటి కేంద్రమే తప్పుడు పనులకు పాల్పడితే  ఇక పిల్లలవంటి ప్రజలకు రక్షణ  ఎలా ఉంటుంది?  ."

(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడుarasam రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ  )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333