మనుషుల అజ్ఞానానికి, మత గ్రంధాలే కారణం

Feb 28, 2025 - 20:50
Mar 1, 2025 - 19:01
 0  3
మనుషుల అజ్ఞానానికి, మత గ్రంధాలే కారణం

పుస్తకాలు మనిషికి మంచి మిత్రులు.
పుస్తకాలు మనుషులకు మార్గదర్శకత్వం వహిస్తాయి. 
తెలియని విషయాలు ఎన్నో తెలుసుకోవచ్చు. పుస్తకాలు జ్ఞానాన్ని పంచుతాయి. 
పుస్తకాలు మనిషి మనోవిజ్ఞానానికి తోడ్పడతాయి. 
పుస్తకాలు మనిషి ఎదుర్కొనే ఎన్నో విషయాలకు, సమస్యలకు పరిష్కార మార్గాలు చూపెడతాయి.

కానీ................  కొన్ని పుస్తకాలు మనిషిలో మూర్ఖత్వాన్ని అజ్ఞానాన్ని కలిగిస్తాయి. కల్మషం లేని మనసును కలుషితం చేస్తాయి. సరియైన బాట చూపకుండా అజ్ఞాన బాటను పట్టిస్తాయి. అవే మత గ్రంథాలు మత గ్రంథాలు కేవలం ఒక మతాన్ని ప్రచారం చేయడానికి పనికి వస్తాయి. ఆ మతాన్ని అంటిపెట్టుకున్న దేవున్ని గొప్పగా చూపెడతాయి.  మతాలు మంచివని, మనిషికి మతాచరణ ముఖ్యమని, మత నియమాలు మతాచారాలు మత సంప్రదాయాలు ప్రతి మనిషి పాటించాలని అట్లా పాటించని వారు నరకానికి పోతారని మతాన్ని పాటించని వారు మనిషే కాదని 

భయపెడతాయి. ఆ మతానికి అనుబంధంగా ఉన్న దేవుడిని పూజించకుంటే, నమ్మకుంటే  మనిషికి అనేక బాధలు కష్టాలు, దుఃఖాలు కలుగుతాయని, ఆ మత దేవుని నమ్ముకుంటే కష్టాలను తీరుస్తాడని సుఖాలను కలిగిస్తాడని స్వర్గ ప్రాప్తి కలుగుతుందని కథల రూపంలో నీతుల రూపంలో మత గ్రంథాలలో ఉన్నవన్నీ నిజాలని ఒక వర్గం వారు ప్రచారం చేయడం వల్ల మనుషులు అవన్నీ నిజమేనని తమ పనులు కూడా మానుకొని కొన్ని సమయాలలో లాభం కలిగే విషయాలను కూడా పక్కనపెట్టి మతాచారాలు మత సంప్రదాయాలు మత నియమాలు పాటిస్తూ దేవుని ప్రార్థిస్తూ డబ్బులను సమయాన్ని వృధా చేస్తున్నారు. మత గ్రంథాలలోని పాత్రలు దైవాంశ సంభూతులని వారు ఎన్నో మహిమలు కలిగి ఉంటారని వారు చేసేవన్నీ లీలలు ( అకృత్యాలు కూడా)అని వారు ఏం చేసినా అవి లోక కళ్యాణం కోసమేనని మత గ్రంధాలు ఘోషిస్తాయి.

మత గ్రంథాలను నిత్యము చదవాలని అందులోని పాత్రలను దేవుళ్ళుగా పూజించాలని యజ్ఞాలు యాగాలు నిర్వహించాలని అలాగైతే మనిషి పుణ్యాత్ముడు అవుతాడని పుణ్యం సంపాదించవచ్చునని, అట్టి పుణ్యంతో బొందితో కైలాసం చేరవచ్చని లేకుంటే స్వర్గానికి వెళ్ళవచ్చని కథలు మనకు కనబడతాయి. స్వర్గంలో ఏ పని చేయనవసరం లేదని సకల సౌఖ్యాలు ఉంటాయని వారికి ఆకలి దప్పులు ఉండవని, రంభ, ఊర్వశి,మేనక తిలోత్తమ లాంటి దేవ వేశ్యల నృత్యాలు తిలకించి ఆనందించవచ్చని, మనుషులు నమ్మేటట్లుగా అందులో రాసి ఉంటుంది. అవి నిజమని  బ్రాంతిపడే వారికి మెదడు నిండా అవే ఆలోచనలు ఉంటాయి.. ఇక వారు వాటి మాయలో పడి కొన్ని పనులు విడిచిపెట్టి కూడా మత గ్రంథాలను చదువుతూ తామెంతో పుణ్యం సంపాదించామని తాము సరాసరి స్వర్గానికి వెళ్తామని భావనతో ఇతరులను చిన్నచూపు చూస్తారు. మతాచారాలను పాటించని వారిని హేళనగా మాట్లాడుతారు.

భక్తుల వలె ఫోజులు కొడతారు. కానీ అవన్నీ నిష్ప్రయోజనం. మత గ్రంథాలు బోధించేటి దంతా ఒక వర్గం వారి లాభం కోసమే. కష్టాలు చేయక కూర్చుండి తినేవారి స్వప్రయోజనాల కోసమే. మనం చూస్తున్న ఈ ప్రార్థన స్థలాలన్నీ దోపిడీదారులకు దోచిపెట్టడానికే తప్ప సాధారణ ప్రజలకు ఎలాంటి లాభం ఉండదు. పైగా నష్టం కూడాను. మత గ్రంథాలన్నీ  అబద్ధాలతో, కల్పిత కథలతో, కట్టు కథలతో మనిషిని అజ్ఞానంలోకి నెట్టేస్తాయి. వాటిలో రాసిందంతా అబద్ధమే. దేవుడు ఎక్కడా లేడు. ఎవరి ఇష్టప్రకారం వారు ఉండవలసిందే.మతం కేవలం వ్యక్తిగతమే. కానీ మతాన్ని సామూహికంగా నిర్వహిస్తున్నారు. ఇది చాలా తప్పు. ఇదంతా అనులోచనాపరుల అంటే ఆలోచించలేని వారి యొక్క చర్యలే తప్ప ఆలోచించి నడుచుకునేవారు ఏ దేవుడిని నమ్మరు ఏ మతాన్ని అనుసరించరు.

ఏ మత గ్రంథం అయినా మినహాయింపు లేదు అన్ని మత గ్రంథాలు అబద్ధాల రాతలే ఇప్పటికైనా మనుషులు ఆలోచించి మత గ్రంథాల్లోని కథలన్నీ కల్పిత కథలుగా భావించాలి.... హేతువాద దృక్పథంతో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని జీవితాన్ని పూలబాటగా మార్చుకోవాల్సిందే...........

అడియాల శంకర్,
అధ్యక్షులు,
తెలంగాణ హేతువాద సంఘం

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333