బడిబాటలో 20శాతం అదనపు నమోదు సాధించాలి: జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
బడిబాటలో 20శాతం అదనపు నమోదు సాధించాలి: జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
సూర్యాపేట టౌన్, 9 జూన్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా విద్యాశాఖ అధికారులు, కాంప్లెక్స్ హెడ్మాస్టర్లతో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మంగళవారం వెబెక్స్ ద్వారా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యా ప్రమాణాల మెరుగుదల, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై అధికారులకు పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట’ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రతి పాఠశాలలో ఈ ఏడాది విద్యార్థుల నమోదును కనీసం 20 శాతం పెంచాలని లక్ష్యంగా నిర్దేశించారు. గతంలో జీరో ఎన్రోల్మెంట్ విద్యార్థులు లేని కారణంగా మూతపడిన పాఠశాలలను గుర్తించి, ఈ విద్యా సంవత్సరం నుండి వాటిని పునఃప్రారంభించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాకు కొత్తగా మంజూరైన 91 పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో ఇన్స్ట్రక్టర్లను, ఆయాలను త్వరితగతిన నియమించాలన్నారు. విస్తృత ప్రచారం నిర్వహించి ఈ కేంద్రాలలో చిన్నారులను పెద్ద సంఖ్యలో చేర్పించడంతో పాటు, అవసరమైన మౌలిక వసతులను సమకూర్చాలని స్పష్టం చేశారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తప్పనిసరిగా గ్యాస్ కనెక్షన్లు, మరుగుదొడ్ల సౌకర్యం ఉండాలన్నారు. ముఖ్యంగా ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ర్యాంపులు, వెస్ట్రన్ టాయిలెట్లను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పాఠశాలలకు ఇప్పటికే మంజూరైన ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్లు, కంప్యూటర్లు నిరంతరం పనిచేసే స్థితిలో ఉండేలా చూసుకోవాలని, ఇంటర్నెట్ సౌకర్యం లేని పాఠశాలల వివరాలతో తక్షణమే ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులను మెరుగుపరిచి, డిజిటల్ బోధన ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ప్రాధాన్యత అని అధికారులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేసి బడిబాటను విజయవంతం చేయాలని కోరారు. ఈ వెబెక్స్ సమీక్షా సమావేశంలో జిల్లా విద్యాశాఖ సెక్టోరల్ అధికారులు హరికృష్ణ, సూర్యనారాయణ, రేణుక దేవి, పూలన్, వెంకటేశ్వర్లు, మండల విద్యాధికారులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మరియు విద్యాశాఖ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.