ఫార్మర్ రిజిస్ట్రీని వేగవంతం చేయాలి.
రైతుల శ్రేయస్సుకు చిత్తశుద్ధితో పనిచేయాలి.
నకిలీ విత్తనాలు అమ్మే డీలర్లపై కఠిన చర్యలు.
జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.
జోగులాంబ గద్వాల 9జూన్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి :- రైతుల శ్రేయస్సుకు పెస్టిసైడ్స్ డీలర్లు కట్టుబడి ఉండాలని, వ్యవసాయశాఖ అధికారులు ఫార్మర్ రిజిస్ట్రీని వేగవంతం చేసేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. మంగళవారం ఐడిఓసి సమావేశపు మందిరంలో జిల్లాలోని పెస్టిసైడ్ దుకాణాల డీలర్లు, సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులతో కలెక్టర్ సమావేశమై మాట్లాడారు. ప్రభుత్వం వ్యవసాయ శాఖకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని, డీలర్లు, అధికారుల కారణంగా రైతులకు ఏ చిన్న సమస్య వచ్చినా సహించేది లేదన్నారు. ఫెయిల్ అయిన, విడిగా ఉండే, గడువు ముగిసిన విత్తనాలను విక్రయించకూడదన్నారు. ప్రతి పెస్టిసైడ్ దుకాణాల వద్ద సంబంధిత డీలర్లు స్టాక్, ధరల పట్టిక, తదితర వివరాలను విధిగా ప్రదర్శించాలన్నారు. విత్తనాలు, ఎరువులు అమ్మేందుకు కొత్తగా లైసెన్సు తీసుకునేవారు, రెన్యువల్ చేసుకోవాల్సిన డీలర్లు నిబంధనలను పాటించాలన్నారు. యూరియా కొరత, కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరిగినందున అన్నదాతలు నానో యూరియాపై దృష్టి సారించేలా సహకరించాలన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు తరచూ పెస్టిసైడ్స్ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించాలని, నిబంధనలు పాటించని సంబంధిత దుకాణాల డీలర్ల పై తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై మాట్లాడారు. ఫార్మర్ రిజిస్ట్రీలో జోగులాంబ గద్వాల జిల్లా ప్రస్తుతం 68 శాతంతో రాష్ట్రంలో 28వ స్థానంలో ఉందని, వంద శాతం పూర్తి చేసేందుకు ఏఈవోలు నిబద్ధతతో పనిచేయాలన్నారు. మండల వ్యవసాయ శాఖ అధికారులు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని ఫార్మర్ రిజిస్ట్రీ వేగవంతం అయ్యేందుకు రెండు రోజులకోసారి తమ పరిధిలోని ఏఈవో లపై పర్యవేక్షణ చేస్తుండాలన్నారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని, వారికి అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తూ అన్నదాతల సంక్షేమానికి కృషి చేయాలన్నారు. పిఎండిడికేవై కు జోగులాంబ గద్వాల జిల్లా ఎంపికవడంతో వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల్లో రైతులు సాంకేతికతను వినియోగిస్తూ ఆర్థికంగా ఎదిగేలా చూడాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ పలువురు ఏఈఓ లతో వారి క్లస్టర్ పరిధిలోని గ్రామాల రైతుల ఫార్మర్ రిజిస్ట్రీ గురించి మాట్లాడారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరప్ప, అదనపు ఎస్పీ శంకర్, ఆత్మ డిప్యూటీ పిడి జగ్గు నాయక్, ఏడిఏ సంగీతలక్ష్మి, ఆయా మండలాల వ్యవసాయ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.