ప్రజాస్వామ్య విజయానికి క్రమశిక్షనతో కూడిన చైతన్యం, జాగరూకత చాలా అవసరం.

Feb 18, 2025 - 12:26
Feb 21, 2025 - 17:04
 0  1

ప్రజాస్వామ్య విజయానికి క్రమశిక్షనతో కూడిన చైతన్యం, జాగరూకత చాలా అవసరం.

విద్య అన్ని రంగాలలో మార్పుకు ప్రేరణ అయితే......

సామాజిక పరిణామ క్రమానికి ఉపాధ్యాయులే దారి దీపాలు అంటున్న న్యాయనిపుణులు

!"నానీపాల్కివాలా!"* అదెలానో చూద్దాం!

--- వడ్డేపల్లి మల్లేశం 

భిన్నత్వంలో ఏకత్వం అనే పేరుతో విభిన్న జాతులు సంస్కృతులు, మతాలు అంతకుమించిన కులాల నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా అనుసరిస్తున్న ప్రజాస్వామిక పాలన విజయవంతం కావడం అనేది నిజంగా పాలకులకు సవాల్ అనక తప్పదు.అయితే పాలకుల యొక్క చిత్తశుద్ధి, ప్రజలను ప్రభువులుగా చూచే నేర్పు ఓర్పు, ప్రజా సంపదకు కాపలాదారులమనే భావన ఉన్నప్పుడు మాత్రమే ప్రభుత్వాలు ప్రజాస్వామ్యంలో మన గలుగుతాయి. .స్వార్థ ప్రయోజనాలతో పెట్టుబడిదారీ వర్గానికి వంతపడే ధోరణి కనబరిస్తే మాత్రం ప్రజా ఉద్యమాలను అంతకుమించిన విప్లవాలను ఎదుర్కోనక తప్పదు. అధికారం మత్తులో, ప్రశ్నించే తత్వం పట్ల అసహనంతో ఉన్మాద వైఖరి అవలంబిస్తే కూడా దీర్ఘకాలికంగా ప్రమాదమే.

ఇ న్ని రకాల సంఘర్షణలు సందిగ్దతల మధ్య ప్రజాస్వామ్యం విజయవంతం కావడానికి చైతన్యముతో కూడిన జాగరూకత ప్రజలకు చాలా అవసరం. రాజ్యాంగం యొక్క విశిష్ట లక్షణాలలో ఈ అంశం ప్రత్యేకంగా చెప్పబడింది. కారణం ఏమిటంటే నాయకత్వంలో ఉన్న తెగించిన కొందరు చట్టాన్ని చేతిలోకి తీసుకొని, రాజ్యాంగ విలువలను ఖూనీ చేసి, హక్కులను ప్రజల ఆకాంక్షలను అపహాస్యం చేసే అవకాశం ఉన్నది కనుక ప్రజలు నిరంతరము జాగ్రత్తగా పాలకులను గమనించాలి అని దాని అర్థం. చైతన్యముతో, విజ్ఞతతో, విరోచితంగా పోరాడడం ద్వారా ప్రభుత్వాలు దారి తప్పకుండా చూసుకోవలసిన బాధ్యత ప్రజలదే అని చెప్పకనే చెప్పినట్లు అవుతున్నది. అందుకే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ " పాలకులు దారి తప్పి ప్రజలను బలి పశువుల చేస్తే ప్రజలు విప్లవోద్యమాలతో తమకు అనుకూలమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి ఉన్న వ్యవస్థను చెదిమి వేస్తారు అది చరిత్ర చెప్పిన సత్యం" అని ఆనాడే హెచ్చరించడం గమనార్హం. అయితే చైతన్యం, ప్రశ్నించే తత్వం, ప్రతిఘటించే నేర్పు, నిలదీసి నిగ్గు తేల్చే ప్రతిభ గల ప్రజలను తయారు చేసుకోవలసిన అవసరం వ్యవస్థ మీద ఉన్నది. అందుకు అక్షరాస్యత కొలమానం కాకపోవచ్చు కానీ విద్య ద్వారా వివేకవంతులను, సమస్యల మూలాలు వెతికే విజ్ఞలను తయారు చేసుకునే అవకాశం ఉన్నది కను క భారత ప్రముఖ న్యాయ నిపుణులు న్యాయ శాస్త్రవేత్త నాని పాల్కివాలా గారు వివేకవంతులను మాత్రం ఫ్యాక్టరీలలో తయారు చేయలేము అందుకు చదివే పరిష్కారం అని చెప్పడం మౌలికమైన అంశం. అనియత విద్య, నియత విద్య, రాత్రి పాఠశాలలు, పొలంబడి వంటి అనేక రూపాలలో ఈనాడు ప్రజలను చైతన్యం చేయడానికి బోధనా అభ్యసన ప్రక్రియ కొనసాగడం ద్వారా కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే శక్తి యు తులను తయారు చేసుకునే వీలున్నది. ఫ్యాక్టరీలు కర్మాగారాలలో అనేక రకాల వస్తువులు ఉత్పత్తులను తయారు చేసుకుంటున్నాం అవసరానికి మించితే ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ విదేశీ మారకద్రవ్యాన్ని పొందుతున్నాం. ఇక్కడ ప్రతి చోట ఉత్పత్తి రంగంలో ప్రజలే కీలకంగా వ్యవహరించడాన్ని కూడా గమనించినప్పుడు కార్మిక సంఘాలు రైతు సంఘాల రూపంలో చైతన్య విజ్ఞానదాయకమైనటువంటి అనేక విషయాలను తెలుసుకునే అవకాశం వాళ్లకు ఉన్నది. ఇదంతా కూడా చదువు బోధించేవాళ్లు చెప్పేవాళ్లు హెచ్చరించేవాళ్లు తయారు చేసేవాళ్లు తీర్చిదిద్దే వాళ్లంతా ఉపాధ్యాయులే కదా!

ఉపాధ్యాయులు సామాజిక మార్పుకు దారి దీపాలు అవునా ?అయితే ఎలా?

నాని పాల్కివాలా సామాజిక దృక్పథంతో పరిణామ క్రమంలో ప్రజాస్వామ్యం యొక్క పరిణతిని విస్తరింప చేసే ఉద్దేశంతో ప్రజలు చైతన్యవంతులు కావాలని కోరుకోవడం అభినందనీయం. అంతేకాదు ప్రజా చైతన్యానికి,చదువుకు, దీర్ఘకాలిక విద్యకు, దానికి ప్రతినిధులైన ఉపాధ్యాయులకు పెట్టిన లెంక చాలా అద్వితీయమైనది. అందుకే వారి అభిప్రాయంలో ఉపాధ్యాయులు సామాజిక మార్పుకు దారి దీపాలు అనడం ఉపాధ్యాయుల యొక్క బాధ్యతను రెట్టింపు చేయడమే కాదు సమాజంలోని అన్ని వర్గాలు కూడా ఉపాధ్యాయుల వైపు చూసేలా నిర్దేశించినారు అనడంలో అతిశయోక్తి లేదు. బుద్ధి జీవులు మేధావులు కవులు రచయితలు కళాకారులు అంతకుమించి సామాజిక పరిణతికి దారి చూపే దారి దీపాలలో ఉపాధ్యాయులు అగ్రస్థానం అనే అంశం ప్రపంచవ్యాప్తంగా తేటతెల్లమైనది. ఒక అధ్యయనం ప్రకారంగా సామాజిక మార్పుకు దోహదపడే రంగంలో మొదటిది ఉపాధ్యాయ రంగమని

తేలిన విషయాన్ని మర్చిపోకూడదు .ఇక్కడ బాధ్యతను గుర్తింప చేయడం, పాత్ర ఔచిత్యాన్ని ప్రశంసించడం, అంతేకాదు నిజంగా ప్రత్యామ్నాయం వేరే ఎవరు లేరు అని సవాల్ విసరవలసిన అవసరం కూడా ఉంది అంటే మరేంతో సామాజిక స్ఫూర్తితో ఉపాధ్యాయులు పనిచేయవలసిన అవసరం ఉన్నది. అనితర సాధ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్న ఉపాధ్యాయులు చీకట్లో చిరు దివ్వల వలె వెలుగుతూ దారిని చూపగలిగినటువంటి దీపాలు అని సమర్థించడం అభినందించడం, ప్రశంసించడం, ఎలుగెత్తి చాటడం ఉపాధ్యాయుల యొక్క శక్తి సామర్థ్యాలను ప్రతిభను మరింత పెంచుకోవడానికి సందర్బచితంగా చేసిన హెచ్చరికగా భావించాలి అనేది నా అభిప్రాయం.

    సమాజాన్ని పాఠశాలలోకి పాఠశాలను అవసరమైనప్పుడు సమాజంలోకి తీసుకు వెళ్లగలిగిన సమర్థులు ఉపాధ్యాయులు అందుకే పాఠశాల సమాజానికి దర్పణం వంటిది అనే మాట అక్షర సత్యం. భిన్న మనస్తత్వాలు, వాతావరణం, వైవిధ్యం, సమాజంలో ఉన్నంత విస్తృత వ్యక్తిత్వాలు పాఠశాలలో ఉంటాయి కనుక రెండింటిని సమన్వయం చేస్తూ భావి సవాళ్లను అధిగమించే విధంగా శక్తిపరులుగా మార్చే ప్రక్రియలో ఉపాధ్యాయుని పాత్ర అగ్రస్థానం. ఇందుకు తన అనుభవాలు, జ్ఞాపకాలు, పాఠ్యాంశాలతో పాటు సహ పాఠ్య కార్యక్రమాలు, అధ్యయన పరిశీలన అంశాలు చాలా తోడ్పడుతాయి. కేవలం అక్షరాస్యులుగా మార్చి విద్యావంతులు చైతన్యవంతులని అంటే సరిపోదు ఉపాధ్యాయులు ప్రశ్నించలేని వాళ్లయితే తమ పిల్లలను ప్రశ్నించే వాళ్ళుగా తీర్చిదిద్దలేరు. ఉపాధ్యాయులు స్తబ్దతగా ఉంటే పిల్లలు కూడా అదే స్థితిలో ఉంటారు. అందుకే ఉపాధ్యాయ వృత్తి అనేది కేవలం ఉపాధి అని భావించకుండా ప్రత్యేకమైన కళ గా, సామాజిక మార్పుకు ఒక పనిముట్టుగా భావించినప్పుడు మాత్రమే లక్ష్యాలు నెరవేరుతాయి, ఆకాంక్షలు అమలవుతాయి, ప్రజాస్వామ్యం పదిలo గా నిలబడుతుంది,

 ప్రజలే నిజమైన ప్రభువులుగా పాలకులకు హెచ్చరిక చేయగలుగుతారు కూడా. అందుకే 1966లో తన నివేదికను సమర్పించినటువంటి కమిషన్ చైర్మన్ డిఎస్ కొఠారి దేశ భవిష్యత్తు తరగతి గదిలో తీర్చిదిద్దబడుతుంది అని చెప్పడం లో ఎంత విజ్ఞత దాగి ఉందో ప్రతి వాళ్లు అర్థం చేసుకోవాలి.. భిన్నత్వం, మతాలు, కులాలతో ముడివడి ఉన్న ప్రత్యేకంగా భారతదేశంలో ఏకత్వాన్ని సాధించడానికి సమానత్వాన్ని సాధించి పదిల పరచడానికి సంఘర్షణలు సవాళ్లను నివారించి సమ భావన ఏర్పరచడానికి కామన్ స్కూల్ విధానాన్ని కూడా సిఫారసు చేయడం మనకు తెలిసిందే.కానీ 77 ఏళ్ల పాలనలో ఇప్పటికీ కనీసం ఏ రాష్ట్రంలో కూడా కామన్ స్కూల్ విధానం అమలు చేయలేదు. "తరగతి గది దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుంది" అనే మాట పట్ల పాలకులకు ఏనాడు విశ్వాసం లేకపోవడం కూడా నేడు దేశం ఎదుర్కొంటున్న సకల సమస్యలకు కారణం. ఈ క్రమంలో ఉపాధ్యాయురంగం చైతన్యం చేయడానికి ఒకవైపు ప్రయత్నం చేస్తూ ఉంటే స్వార్థపర శక్తులు విద్యారంగాన్ని వైద్య రంగాన్ని ఎదగకుండా ప్రైవేటుపరం చేసి ప్రభుత్వ రంగంలో కొనసాగించకుండా నిర్లక్ష్యం చేస్తూ ప్రజల మీద పెను భారం మోపడం వలన ఆశించిన ఫలితాలు చేకూరడం లేదు. ప్రజల్లో చైతన్యం వెల్లువెత్తిన మాట కూడా వాస్తవం ఆయినా ప్రజా వ్యతిరేక విధానాలకు అలవాటు పడినటువంటి పాలకుల శక్తి, అధికారం ముందు ప్రజా చైతన్యం మూగబోతున్నది. నిలదీసి నిగ్గు తేల్చిన బుద్ధి జీవులు మేధావులు మానవ హక్కుల కార్యకర్తలు ఉపాధ్యాయులు జర్నలిస్టులు సంపాదకులు ఎందరో బలైతే మరెందరో జైళ్లలో మగ్గుతున్న విషయం తెలుసు. అయినా ఉపాధ్యాయ బాధ్యతలు, వృత్తి మీద ఉన్నటువంటి అభిమానం, శాస్త్రీయంగా ఉన్నటువంటి ప్రాతిపదికను ఆధారంగా చేసుకొని నాని పాల్కి వాలా గారు ఉపాధ్యాయులను దారి దీపాలుగా ఎలుగెత్తి చాటడం ఇప్పటికైనా పాలకులకు కనువిప్పు కలిగించాలి. పాఠశాలలు కళాశాలలు విద్యాసంస్థలు ఉపాధ్యాయ రంగం విద్యా వ్యవస్థ పట్ల గౌరవాన్ని పెంచుకునే విధంగా పాలకులను మారుస్తుందని ఆశిద్దాం. అప్పుడే కొటారి సూచించినట్టుగా రాష్ట్రాలు 30% కేంద్ర ప్రభుత్వం 10% బడ్జెట్లో విద్యకు నిధులు కేటాయించగలిగితే మన అందరి కలలు సాకారం అయినట్లే! నిజంగా ఉపాధ్యాయులు దారి దీపాలు అందులో ఎలాంటి సందేహం లేదు ఇక మిగిలింది బాధ్యత మరింత వెలిగిపోయే విధంగా ఉపాధ్యాయులు తమను తాము తీర్చిదిద్దుకోవడమే...

( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు అరసం రాష్ట్ర కమిటీ సభ్యులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333