పోషకాహార లోపం ప్రజలను పట్టిపీడిస్తుంటే గొప్ప ఆర్థిక వ్యవస్థ ఎలా అవుతుంది ?

వలస కూలీలు పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న వారి పరిస్థితి మరీ దయనీయం.
కోవిడ్ నేపథ్యంలోనైనా ప్రభుత్వాలు సామాజిక ,ఆర్థిక బాధ్యతగా ఈ లోపాన్ని సరి చేయాలి.
కొన్ని గణాంకాలు భయంకరంగా ఉన్న మాట నిజం కాదా?
---- వడ్డేపల్లి మల్లేశం
పోషకాహారం సరైన స్థాయిలో అందకపోవడం వల్ల ప్రజానీకానికి 54 శాతానికి పైగా రోగాలు సంక్రమిస్తున్నట్టు జాతీయ పోషకాహార సంస్థ నిపుణులు చేసిన హెచ్చరిక ఈ దేశంలో రోగాల బారిన పడుతున్న ప్రజల అవస్థలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు . సమతుల ఆహారమే పోషకాహారం అని నిర్వచి స్తున్న సందర్భంగా విటమిన్లు ఖనిజలవణాలు ఇతర అంశాలతో కూడుకున్న ఆహారానికి నోచుకోని అనేకమంది చిన్నారులు మహిళలు ముఖ్యంగా శక్తిని కోల్పోయి రోగాల బారిన పడడంతో పాటు అనేకమంది మృత్యువాత పడడాన్నీ గమనించవచ్చు. సరైన ఆలోచన, పనిలో ఉత్సాహం, నీరసం లేకుండా ఉండడం వంటి లక్షణాలతో ఆరోగ్యంగా జీవించాలంటే పోషక పదార్థాలు చాలా అవసరం. చిరుధాన్యాలు పప్పు దినుసులు నూనెలు కూరగాయలు ఆకుకూరలు పాలు పండ్లు గుడ్లు మాంసం డ్రై ఫ్రూట్స్ తగిన స్థాయిలో తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది . అయితే ఇన్ని రకాల ఆహార పదార్థాలను సరైన మోతాదులో తీసుకోగలిగిన ఆర్థిక స్తోమత ఎంత మందికి ఉందని అంచనా వేసుకున్నప్పుడు ఆశ్చర్యం కలగక మానదు. ఐక్యరాజ్యసమితి తో పాటు భారత వ్యవసాయ సంస్థ అధ్యయనం మేరకు భారతదేశంలో సుమారు 74 శాతం మంది పోషకాహారాన్ని పొందలేని స్థితిలో ఉన్నారనే చేదు వాస్తవాన్ని తెలియజేస్తుంటే, 6 నుండి 23 నెలల వయస్సులోని చిన్నారులలో 77% సరైన పోషకాహారానికి నోచుకోవడం లేదని మరో అధ్యయనం హెచ్చరిస్తున్నది . పోషకాహారం సరిపడా దొరకనప్పుడు నీరసం పెరిగి, మెదడు చురుకుదనం తగ్గిపోయి,స్పృహ కోల్పోయి.
చదువులో వెనుకబడతారు. ఆలోచనలో ఆచరణలో శారీరకమైన అనేక సమస్యలకు గురికావలసి వస్తుంది .తద్వారా మానసిక వైఫల్యం కూడా ఏర్పడవచ్చు. ఇలాంటి భారతదేశాన్ని మనం కోరుకున్నామా? అని ప్రశ్నించుకున్నప్పుడు మాత్రమే కారణాలను అన్వేషించడం ప్రభుత్వాల యొక్క వైఫల్యాన్ని ఎండగ ట్టడం ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలను ప్రశ్నించి డిమాండ్ చేయడానికి అవకాశం ఉంటుంది . అయితే ప్రధానంగా ఎన్నికల సమయంలో ప్రలోభాలు వాగ్దానాలు, రాయితీల పేరున ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకునే క్రమంలో డబ్బులు కుమ్మరించి మద్యాన్ని పంపిణీ చేసి ప్రజలను బానిసలుగా చేస్తున్నారు ప్రజలు ప్రశ్నించకుండా చూస్తున్నారు.
దయనీయస్థితిలో బాలభారతం:-
1960 దశకంలో హరిత విప్లవం ప్రారంభమైన తర్వాత ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది కానీ ఇందుకు పురుగు మందులు రసాయనాలు ఎరువుల వాడకం అమితంగా వినియోగించడంతో పండించిన పంటల్లో పోషక విలువలు నశించి పోయినాయి . అంతే కాదు భూమి కూడా నిస్సారమై పంటలు పంట లేని స్థితికి చేరడంతో పాటు ఎరువులు వేస్తే తప్ప పంటలు పండ నటువంటి దుర్భర స్థితిలోకి నెట్టివేసిన హరిత విప్లవం కూడా పోషకాహార లోపానికి ప్రధాన కారణం అని చెప్పవచ్చు. 6 నుంచి 23 నెలల పసివాళ్లలో మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ తో పాటు మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లో 80 శాతానికి పైగా చిన్నారులకు నిర్దేశించిన స్థాయిలో పోషకాహారం కరవవుతుందని ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో సహా మరో 12 రాష్ట్రాల్లో అలాంటి లోపం ఉన్న పిల్లల సంఖ్య 70 నుండి 80 శాతం ఉన్నట్లు ఎయిమ్స్ ఆధ్వర్యంలోని జాతీయ వైద్య జర్నల్లో ప్రచురితమైన పరిశోధన పత్రం బాలల స్థితిగతుల పైన హెచ్చరించడం పాలకులకు కనిపించడం లేదా? ఇటీవల 15వ ఆర్థిక సంఘం కూడా దేశ ప్రగతికి పిల్లలకు పోషకాహార లోపం ప్రతిబంధకమని హెచ్చరించడం కూడా ఈ దేశంలో పాలకుల నిర్లక్ష్యానికి మచ్చుతునకగా భావించాలి . ప్రస్తుతం ఐదవ ఆర్థిక వ్యవస్థగా ఇండియా ఉన్నదని 2030 నాటికి మూడవ ఆర్థిక వ్యవస్థగా మారుతుందని అనేక ప్రకటనలు ప్రభుత్వం పక్షాన వెలువడుతుంటే 2024 ప్రపంచ స్థాయి ఆకలి సూచీలో మాత్రం 127 దేశాలకు భారతదేశ 105వ స్థానంలో నిలిచి మన పాలకులను వెక్కిరిస్తున్నది . శిశు మరణాలు, పిల్లలలో ఎదుగుదల లోపాలు, పోషకాహార లోపం, అన్ ఆర్థిక పరిస్థితుల ఆధారంగా ఈ ఆకలి సూచిని నిర్ణయిస్తున్నట్లుగా తెలుస్తున్నది. ఈ ఆకలి సూచిలో భారతదేశం ప్రతి సంవత్సరం కూడా మరింత వెనుక పడుతుంటే వ్యవసాయ దేశమైన భారత్లో నే ఇంత దుర్భర పరిస్థితులు ఉన్నాయంటే ఇది ప్రభుత్వం యొక్క బాధ్యతారాహిత్యం అని చెప్పక తప్పదు. ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడక ఉపాధి పథకాలకు సరైన ప్రోత్సాహం లేని కారణంగా అనేకమంది గ్రామాల నుండి పట్టణాలకు తరలిపోతున్న సందర్భంలో వ్యవసాయం కూడా వెనుకబడిపోవడంతో పాటు చాలీచాలని ఆదాయము వల్ల వలస జీవులు కార్మికులు చేతివృత్తుల వాళ్ళు వీధి వ్యాపారులు దారిద్రరే క దిగువన ఉన్న అన్ని వర్గాల వారు పిడికెడు మెతుకులు సంపాదించడమే గగనం అవుతుంటే ఇక పోషకాహారానికి నోచుకునే అవకాశం ఎక్కడిది ?
ఉద్యోగ ఉపాధి స్వయం పోషకత్వాన్ని సాధించే విషయంలో ప్రభుత్వాలు మెరుగైన ఆదాయాన్ని కల్పించే వసతులు ప్రజలకు అందరికీ కల్పించాలి . కనీస అవసరాలు, ఇంటి అద్దె ,పిల్లల చదువులు , వైద్య ఖర్చులు భారీగా పెరగడంతో చాలీచాలని సంపాదన కూడా పోషకాహారాన్ని కొనుక్కోలేని దయనీయ స్థితికి నెట్టుతున్నది . తలసరి ఆదాయాన్ని పెంచడం, ఆర్థిక ఆహార ద్రవ్యో ల్బణాన్ని కూడా కట్టడి చేయడం, సమగ్ర శిశు అభివృద్ధి పథకం ద్వారా మరింత పోషక విలువలు ఉన్న ఆహారాన్ని సరఫరా చేయడంతో పాటు ప్రతినెలా ఉచితంగా పంపిణీ చేసే బియ్యంతో పప్పు దినుసులు నూనెలు డ్రై ఫ్రూట్స్ ఇతర పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను భారీగా సరఫరా చేయడం ద్వారా మాత్రమే కోట్లాది పేద ప్రజానీకానికి పోషకారo దూరం కా కుండా అందించే అవకాశం ఉంటుంది . పాలకులు పట్టించుకోకుంటే ప్రజల గురించి ఆలోచించే వాళ్లే ఉండరు కనుక ఇది సామాజిక రాజకీయ బాధ్యతగా ప్రభుత్వాలు భావించి కట్టుదిట్టంగా సరఫరా చేయడంతో పాటు నిర్వహించాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది. పోషకాహారం గగనం అనే మాటను అబద్ధం చేసి చూపాల్సిన బాధ్యత రాజకీయ యంత్రాంగానిదే .
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)