పేరు గొప్ప ఊరు దిబ్బ రోడ్లపైనే ప్రయాణికుల పడిగాపులు

తిరుమలగిరి 29 మే 2025 తెలంగాణ వార్త రిపోర్టర్ :
ఏళ్ల తరబడి నుండి ప్రయాణికుల ఇబ్బందులు వర్ణనాతీతం....
దిన దిన అభివృద్ధిలో దూసుకుపోతున్న తిరుమలగిరి....
మున్సిపాలిటీ కేంద్రం నాలుగు మహా నగరాలకు కేంద్ర బిందువుగా..
రెండు జాతీయ రహదారులను కలిగి ప్రధాన కూడలిగా ఎక్స్ రోడ్డు కేంద్రంగా ఉంటుంది.ఇక్కడ బస్టాండ్ ఉండదు.జనగాం, వరంగల్,సిద్దిపేట రూట్ లో వెళ్లేవారికి బస్సు ఫిల్టర్ లేక రోడ్డే శరణ్యం.అదేవిధంగా తొర్రూర్,మహబూబాద్ రూట్లో వెళ్లే ప్రయాణికులు నిలువ నీడ ఉండదు.సూర్యాపేట రూట్లో,హైదరాబాద్,వలిగొండ రూట్ లో వెళ్లే ప్రయాణికులకు సైతం ప్రయాణ ప్రాంగణం ఉండదు,ఈ నాలుగు ప్రధాన మార్గాల్లో బస్సుల కోసం ఎదురుచూసే ప్రయాణికులకు ఎలాంటి బస్సు షెల్టర్ సౌకర్యాలు ఉండవు,ప్రభుత్వాలు మారాయి..పాలకులు మారారు..కానీ ప్రయాణికుల బాధలు ఎవరూ చూడలేదు.ఏళ్ల తరబడి బస్టాండ్ కోసం,ఇటీవల బస్సు డిపో కోసం అనేక ఉద్యమాలు జరిగిన ప్రభుత్వం తరఫున ఎలాంటి హామీ రాలేదు.ఎండ,వాన,చలి కాలాలలో ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ రోడ్లపైనే పడిగాపులు కాస్తూ..బస్సుల కోసం ఎదురు చూస్తుంటారు.మహిళా ప్రయాణికుల బాధలు మాత్రం మాటల్లో చెప్పలేం. కనీసం మూత్ర విసర్జనకు కూడా సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్న పరిస్థితి.మూత్రశాలల కోసం కూడా ఇక్కడ అఖిలపక్ష ఆధ్వర్యంలో ఉద్యమాలు జరిగాయి..కానీ పరిష్కారం చూపలేకపోయాయి.వాన వస్తే షాపుల ముందు ఏర్పాటుచేసిన రేకుల షెడ్ల కిందకు వెళితే దుకాణుల యజమానులు ఈసడించుకున్న, చీదరించుకొని వెళ్లగొట్టిన గత్యంతరం లేక బస్సుల కోసం ఎదురుచూసే పరిస్థితి ఇక్కడి ప్రయాణికులది.మార్కెట్ పరంగా జిల్లాలోనే రెండవ స్థానంలో ఉన్న తిరుమలగిరికి ప్రయాణికులు తలదాచుకునే చోటు కరువైందని చెప్పొచ్చు.నిత్యం అవసరాల కోసం వచ్చే వినియోగదారులు,విద్యార్థులు,కార్మికులు, ప్రయాణికులతో రద్దీగా ఉండే తిరుమలగిరి ఎక్స్ రోడ్డు ప్రాంతం నిలువ నీడ లేక ప్రయాణికుల రాకపోకలతో హడావుడిగా ఉంటుంది. తుంగతుర్తి నియోజకవర్గానికే గుండెకాయలా ఉన్న తిరుమలగిరి కేంద్రంలో బస్టాండ్ లేకపోవడం ప్రయాణికుల ఇబ్బందికి నిదర్శనం అని చెప్పవచ్చు.ఏ నాయకుడు కరుణిస్తాడో.,ప్రభుత్వం ఎప్పుడు స్పందిస్తుందో.,ప్రయాణికులకు మోక్షం ఎప్పుడు కలుగుతుందో..వేచి చూడాల్సిందే.