పని మనుషుల నియామకం పట్ల అప్రమత్తం ఎస్సై వెంకట్ రెడ్డి

May 15, 2026 - 20:45
 0  4
పని మనుషుల నియామకం పట్ల అప్రమత్తం  ఎస్సై వెంకట్ రెడ్డి

తిరుమలగిరి 16 మే 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

ఇంట్లో పనిమనుషులు, వాచ్‌మెన్‌లు, కేర్‌టేకర్‌లు, కుక్‌లను నియమించుకునే సమయంలో ప్రజలు తప్పనిసరిగా అప్రమత్తంగా వ్యవహరించాలని తిరుమలగిరి ఎస్సై గుత్త వెంకటరెడ్డి అన్నారు. గురువారం విలేకరులతో మాట్లాడారు. సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ ప్రజల భద్రత దృష్ట్యా విడుదల చేసిన అవగాహన సూచనలను ఆయన వివరించారు. పనిమనుషులను నియమించే ముందు వారి పూర్తి వివరాలు, ఆధార్, ఫోటో, శాశ్వత చిరునామా, మొబైల్ నంబర్లు సేకరించి ధృవీకరించుకోవాలని తెలిపారు. ఇతర రాష్ట్రాలు లేదా ప్రాంతాల నుంచి వచ్చిన వారిని నియమించే సందర్భంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సమీప పోలీస్ స్టేషన్‌లో వెరిఫికేషన్ చేయించుకోవడం మంచిదన్నారు.ఇళ్లలోని నగదు, బంగారం, విలువైన వస్తువుల సమాచారం అపరిచితులతో పంచుకోవద్దని హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, అనుమానాస్పద కదలికలు గమనించినా వెంటనే డయల్ 100 లేదా 112కు సమాచారం అందించాలని కోరారు.ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం, పొరుగువారితో పరస్పర సమాచారాన్ని కొనసాగించడం ద్వారా నేరాలను అరికట్టవచ్చని పేర్కొన్నారు. ప్రజల అప్రమత్తతే కుటుంబ భద్రతకు ప్రధాన ఆధారమని, పోలీస్ శాఖకు సహకరించాలని ఎస్సై వెంకట్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి