నేరాల నియంత్రణపై దృష్టి సారించాలి, ప్రతి కేసులో నాణ్యమైన ధర్యాప్తు చేసి, బాధితులకు అండగా నిలవండి
➤ బక్రీద్ పండగ నేపథ్యంలో చెక్ పోస్ట్ ల ద్వారా పశువుల అక్రమ రవాణాకు చెక్, సోషల్ మీడియా పై ప్రత్యేక దృష్టి.
➤ రోడ్డు ప్రమాదాలు, ఆర్ధిక నేరాలు, ఆన్లైన్ మోసాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి.
➤మంత్లీ క్రైమ్ రివ్యు మీటింగ్ లో భాగంగా అధికారులకు పలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ. శ్రీ టి శ్రీనివాసరావు, ఐపియస్.,
జోగులాంబ గద్వాల 15 మే 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి.
* గద్వాల.
నేరాల నియంత్రణలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ, ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు జరిపి బాధితులకు పూర్తి న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు, ఐపీఎస్ అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ పోలీస్ అధికారులతో మంత్లీ క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ... రోడ్డు ప్రమాదాలు, ఆర్థిక నేరాలు, ఆన్‌లైన్ మోసాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. రానున్న బక్రీద్ పండగ సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిడ్డమైన చర్యలు తీసుకోవాలని చెక్పోస్టులలో 24 X 7 పూర్తి నిఘా పెట్టీ ఇతర రాష్ట్రాల నుంచి వడ్లు, మొక్కజొన్న లు రాకుండా అలాగే పశువుల అక్రమ రవాణా జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
జిల్లాలోని అన్ని సర్కిల్స్, పోలీస్ స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న కేసులు, దర్యాప్తు నాణ్యత, నేరాల నియంత్రణ అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించి, ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉండేలా చూసి నేరస్తులకు తప్పనిసరిగా శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయడం పోలీసుల ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. కేసుల విచారణలో జాప్యం లేదా నిర్లక్ష్యం అసలు సహించబోమని హెచ్చరిస్తూ, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించేందుకు పెట్రోలింగ్‌ను మరింత బలోపేతం చేసి, బ్లూ కోల్ట్స్ వాహనాల ద్వారా ఎల్లప్పుడూ విజిబుల్ పోలీసింగ్ ఉండేలా చూడాలని ఆదేశించారు.
అలాగే రోడ్డు ప్రమాదాలు, ఆర్థిక నేరాలు, ఆన్‌లైన్ మోసాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని, ముఖ్యంగా సైబర్ నేరాల నివారణకు గ్రామ స్థాయి వరకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అక్రమ గంజాయి రవాణా, మట్కా, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాల వ్యవస్థను విస్తరించి అవి నిరంతరం పనిచేసేలా పర్యవేక్షించాలన్నారు. దొంగతనాల కేసుల్లో ఆధునిక సాంకేతికతను వినియోగించి లాంగ్ పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి, దొంగిలించిన సొత్తును బాధితులకు అందించేందుకు కృషి చేయాలని సూచించారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువ ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించి, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ తగిన చర్యలు చేపట్టాలని తెలిపారు. మండల కేంద్రాల్లో ట్రాఫిక్ నియంత్రణను మెరుగుపరచి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని, మద్యం సేవించి వాహనం నడిపే వారిపై కఠినంగా కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. గ్రామ స్థాయిలో పోలీసింగ్‌ను బలోపేతం చేస్తూ విలేజ్ పోలీస్ అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలతో మమేకమై సామాజిక సమస్యలను తెలుసుకోవాలని, ముందస్తు సమాచారాన్ని సేకరించాలని సూచించారు. ఎస్‌హెచ్‌ఓలు తమ పరిధిలోని ప్రతి గ్రామాన్ని సందర్శించి స్థానిక సమస్యలను గుర్తించాలని, గ్రామ సభల తీర్మానాల అమలును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు.
మే 27న బక్రీద్ పండగ జరగనున్న నేపథంలో అన్ని మండలాల ఎస్సైలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జాగ్రత్తలు తీసుకుంటూ, మండలం లెవెల్లో సోషల్ మీడియాపై ప్రత్యేక నిగా ఉంచాలని, అలాగే చెక్ పోస్టులలో పశువుల అక్రమ రవాణాకు చెక్ పెట్టాలని, అంటే కాకుండా వరి, మొక్కజొన్న ధాన్యాలు ఇతర రాష్ట్రాల నుంచి మన జిల్లాలోకి రవాణా జరగకుండా చూడాలని తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు ఎస్పీ కె. శంకర్ గారు, డీఎస్పీ గద్వాల వై. మొగిలయ్య , ఏ.ఆర్. డీఎస్పీ. టి నరేందర్ రావు, ఆర్ఐ లు, అన్ని సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ట్రాఫిక్ వింగ్ ఆర్.ఐ., జిల్లాలోని అన్ని పి.ఎస్.ల ఎస్సైలు మరియు ఇతర విభాగాలలో పనిచేసే ఎస్సైలు పాల్గొన్నారు.
.....