నాంపల్లి పరిసరాల్లో ట్రాఫిక్ డైవర్శన్: సీపీ సజ్జనార్
హైదరాబాద్‌లో చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమానికి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఈ రోజు రాత్రి 9 గంటల నుంచి చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం కానుండగా, ఇప్పటికే దేశం నలుమూలల నుంచి వేలాది మంది తరలివచ్చారు.
చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేసినట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఈ రోజు రాత్రి 9 గంటల నుంచి చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం కానుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి సంబంధించి మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్ ఏర్పాట్లను పరిశీలించినట్లు తెలిపారు. ఇప్పటికే దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 25 వేల మంది హైదరాబాద్‌కు చేరుకున్నారని వెల్లడించారు.
భద్రతా ఏర్పాట్లు
చేప ప్రసాదం పంపిణీ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వెయ్యి మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సీపీ తెలిపారు. భద్రతా చర్యలను గోల్కొండ డీసీపీ చంద్ర మోహన్ పర్యవేక్షిస్తారని చెప్పారు. అలాగే ట్రాఫిక్ సమస్యలు రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని, నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేస్తున్నామని వెల్లడించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఐదు అంబులెన్సులను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి వివిధ భాషల్లో సూచనలు, సమాచారాన్ని అందిస్తున్నామని చెప్పారు.
రూమర్స్ నమ్మొద్దు
హైదరాబాద్‌లో నివసించే వారు రద్దీని దృష్టిలో ఉంచుకుని వీలైతే రేపు వచ్చి చేప ప్రసాదం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ సరిపడా చేప ప్రసాదం అందుబాటులో ఉందని, ఎలాంటి పుకార్లను నమ్మవద్దని సూచించారు. ఎన్జీవో సంస్థల వద్ద కూడా పోలీసు భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. షీ టీమ్స్, మఫ్టీ పోలీసులు, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తారని పేర్కొన్నారు. గతంలో జరిగిన కొన్ని ఆరోగ్య అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈసారి మరింత కట్టుదిట్టమైన భద్రత, వైద్య సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. రాత్రి వేళల్లో కార్యక్రమం జరుగనున్న నేపథ్యంలో భక్తులు పోలీసుల సూచనలు పాటించి సహకరించాలని సీపీ సజ్జనార్ కోరారు.