డిగ్రీ పట్టా ఉంటే పి.ఎల్.ఐ పాలసీ
తక్కువ ప్రిమియంతో, ఎక్కువ బోనస్
గద్వాల్ తపాలా శాఖ సహాయ పర్యవేక్షకులు ఎల్ సైదా నాయక్
జోగులాంబ గద్వాల ఐదు ఫిబ్రవరి 2025 తెలంగాణ వార్త ప్రతినిధి:- డిగ్రీ పట్టా ఉంటే పి.ఎల్.ఐ (పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్) పథకం వర్తిస్తుందని, తపాలా జీవిత బీమాతో ధీమాగా ఉండవచ్చని గద్వాల అసిస్టెంట్ పోస్టల్ సూపరింటెండెంట్ ఎల్. సైదా నాయక్ ఈ సందర్భంగా డిగ్రీ పట్టా బద్రులకి తెలిపారు. బుధవారం ఆయన పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పథకానికి సంబంధించిన అంశాలపై మాట్లాడారు. 19 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల వయసు మధ్య గల ప్రతి పట్టభద్రుడు తపాలా జీవిత బీమా పాలసీని పొందవచ్చు అని అన్నారు. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ 141 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో, రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులతో పాటుగా పట్టభద్రులు కూడా పి.ఎల్.ఐ పాలసీని పొందవచ్చు అని అన్నారు. పి.ఎల్.ఐ పాలసీ ప్రారంభ సమయంలో ఆర్మీ వారితో మొదలై కేంద్ర, రాష్ట్ర ఉద్యోగులతో పాటుగా ఎయిడెడ్ ఉద్యోగులు మాత్రమే పాలసీలు చేసే వీలున్నది. కానీ ఇప్పుడు డిగ్రీ పట్టభద్రులకు కూడా ఈ అవకాశం వచ్చిందన్నారు. తక్కువ ప్రీమియంతో ఎక్కువ బోనస్ పొందవచ్చు అని అన్నారు. డిగ్రీ పట్టభద్రులు మినిమం పాలసీ వ్యాల్యూ రూ. 20,000/- నుంచి గరిష్టంగా రూ. 50,00,000/- వరకు పాలసీ పొందవచ్చు అని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండి కనీస విద్యార్హత ఉన్నవారు కూడా గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ 10 లక్షల రూపాయల వరకు పాలసీ చేసుకోవచ్చని అన్నారు. సహజ సిద్ధంగా మరియు ప్రమాదవశాత్తు సంభవించే ఎటువంటి మరణాలకైనా ఈ తపాలా శాఖ పాలసీ సేవలు వర్తిస్తాయన్నారు. పూర్తి సమాచారం కోసం దగ్గరలో గల తపాలా శాఖ కార్యాలయం వారిని సంప్రదించవచ్చున్నారు. గద్వాల జిల్లా పరిధిలోగల పట్టభద్రులు (డిగ్రీ హెూల్డర్స్) మరియు గ్రామీణులు పోస్టల్ శాఖ వారి ఈ పథకాలు సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు...