చదువుల తల్లి _ సావిత్రిభాయి పూలే

Jan 3, 2025 - 20:55
 0  10
చదువుల తల్లి _ సావిత్రిభాయి పూలే

సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని మహిళా ఉపాధ్యాయ దినోత్సవం గా  ప్రభుత్వం ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ మహిళా దినోత్సవం గా ప్రకటించాలని ఈ దేశంలో 85% గా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బహుజనులు ముక్తకంఠంతో కోరుతున్నాం.

 భారతదేశ సామాజిక వ్యవస్థలో భాగంగా కులానికి ఉన్న ప్రాముఖ్యత కులానికి ఉన్న బలం కులానికి ఉన్న శక్తి ఏంటో మనందరికీ తెలిసిన విషయమే. మరి ఆ కుల వ్యవస్థ మూలంగానే 10% ఉన్న అగ్రవర్ణ సమాజ ఆధిపత్య ధోరణి వల్ల రెండు వేల సంవత్సరాలుగా భారతదేశంలో 90% ఉన్న అణగారిన సమాజానికి మరియు అగ్రవర్ణ స్త్రీలకు కూడా విద్యనభ్యసించే హక్కు లేకుండా సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా అనగతొక్కబడినారు. భారతదేశానికి స్వాతంత్రం, గణతంత్రం వచ్చిన తదనంతరమే గత 75 ఏళ్ల నుండి మాత్రమే దేశంలోని అణగారిన వర్గాలు మరియు అగ్రవర్ణ స్త్రీలు చదువుకోగలుగుతున్నారు. మరి స్వాతంత్ర దేశంగా అవతరించక ముందే దేశంలో ఉన్న అణగారిన సమాజం కోసం, స్త్రీల హక్కుల కోసం విద్య కోసం మహాత్మా జ్యోతిరావు పూలే దంపతులు దేశ అగ్రవర్ణ పండితులకి అభిముఖంగా అలుపెరగని సామాజిక రాజకీయ సాంస్కృతిక పరివర్తన పోరాటం చేశారు. వారి పోరాట ఫలిత మూలంగానే నేడు అణగారిన సమాజం, అగ్రవర్ణ స్త్రీలు స్వేచ్ఛ సమానత్వ సోదరభావ హక్కులు పొందుతూ చదువుకోగలుగుతున్నారు. అందులో భాగంగానే మహాత్మా జ్యోతిరావు పూలే భార్య ఐన సావిత్రిబాయి పూలే కృషి త్యాగం పోరాటం మూలంగానే నేడు మహిళలు విద్యను అభ్యసించే హక్కును పొందుతున్నారని ఎవరు కాదనలేని చారిత్రక సత్యం. నాడు సావిత్రిబాయి పూలే చేసిన కృషి, త్యాగం మూలంగానే నేడు ఆధునిక భారతదేశ చరిత్రలో తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా చరిత్రకి ఎక్కడమే కాకుండా నిజమైన చదువుల తల్లిగా పిలువబడుతూ మేధావులు చేత, విద్యావంతుల చేత,సామాన్యుల చేత మన్ననలు పొందుతున్నది. మహారాష్ట్రలోని సతారా జిల్లాలో, ఖండాలా తాలూకాలోని నయాగావ్ గ్రామంలో జనవరి 3 న 1831 లో సావిత్రిబాయి జన్మించింది.ఆనాటి సామాజిక కట్టుబాట్ల దృష్ట్యా తన తొమ్మిదవ యేటనే జ్యోతిరావు పూలేతో సావిత్రిబాయికి వివాహం జరిగింది. పూలే దంపతులకి వివాహమైన తదనంతరం సాంప్రదాయక జీవితంలో భాగంగా పిల్లలు కనలని ఆలోచన కలిగి లేకుండా సమాజంలో వెనుకబాటుకి గురవుతున్న పీడితులే తమ బిడ్డలుగా భావించి సొంత బిడ్డల్ని కూడా కలిగి ఉండకుండా అణగారిన సమాజం కోసం,మహిళల అభ్యున్నతి కోసం దేశంలోని అగ్రవర్ణ సమాజ పండితులు,నాయకులకి వ్యతిరేకంగా గొప్పనైన సామాజిక రాజకీయ పోరాటాలు చేశారు. అందులో భాగంగానే నాడు భారత రాజ్యాంగానికి ముందు నుండి ఉన్న మనుధర్మ శాస్త్ర మూలంగా అణగారిన సమాజానికి, మహిళలకి హక్కులు లేని కారణంగా మహిళల సామాజిక రాజకీయ హక్కుల కోసం, మహిళల విద్య కోసం పూలే దంపతులు మనో సంకల్ప బద్ధులై మొట్టమొదటిసారిగా 1848 లో పూణేలో ఒక ఇంట్లో బాలికల పాఠశాలను ప్రారంభించారు. నిరక్షరాస్యులైన సావిత్రిబాయిని మహాత్మా జ్యోతిరావు పూలేనే స్వయంగా విద్యావంతురాలని చేసి తాము స్థాపించిన పాఠశాలకి ప్రధాన మహిళా విద్యావంతురాలని చేశాడు. వారి స్థాపించిన మొదటి పాఠశాలలో 9 మంది విద్యార్థులు చేరగా వారికి సావిత్రిబాయి పూలే గారే ప్రధానోపాధ్యాయురాలు.వీరు స్థాపించిన మొదటి పాఠశాల ఆరు నెలలపాటు కొనసాగి మూతపడింది. కొన్ని నెలల తర్వాత మరొక భవనంలో మళ్లీ పాఠశాలని ప్రారంభించారు, అది నిర్వహిస్తున్నందుకుగాను నాటి సామాజిక పరిస్థితుల దృష్ట్యా అగ్రవర్ణ సమాజం నుండి తీవ్రమైన వ్యతిరేకతని పూలే దంపతులు ఎదుర్కొన్నారు. స్త్రీల విద్యను వ్యతిరేకించే అగ్రవర్ణ ఛాoదాస పురుషులు గుంపుగా నిలబడి సావిత్రిబాయిని అసభ్య పదజాలంతో తిట్టేవారు. ఎన్నో నెలాలపాటు ఆమె ఈ సామాజిక అవరోధాలని ధైర్యంగా ఎదుర్కొన్నది. అగ్రవర్ణ సమాజం నుండి నాయకులుగా చలామణి అవుతున్న పురుష ఛాందసవాదుల తప్పుడు మాటలను, భౌతిక దాడులని తట్టుకోలేక బోధన వృత్తిని నిరాకరిస్తానని జ్యోతిరావు పూలే కి చెప్పడంతో సావిత్రిబాయి జ్యోతిరావు పూలే ఆలోచన మేరకు సామాజిక పరివర్తనకి సంకల్ప బద్ధులై తాను పాఠశాల కి వెళ్లే మార్గంలో పాత వస్త్రాలు ధరించేది. బడుగు బలహీన వర్గాల పిల్లలకి మహిళలకి చదువు చెప్పే క్రమంలో వెళ్లే మార్గమధ్యలో అగ్రవర్ణ పురుషులు సావిత్రిబాయి పై పేడ నీళ్లు పోసేవారు, రాళ్లతో కొట్టేవారు, తప్పుడు మాటలు కూసేవారు. వాటిని అన్నింటిని భరిస్తూ పాఠశాలకు వెళ్లాక అగ్రవర్ణ పురుష చందాసవాదులు కరాబ్ చేసిన బట్టల్ని పాఠశాలకు వెళ్లాక తన సంచిలో తీసుకెళ్లిన మరో వస్త్రాలని ధరించి పిల్లలకి చదువు చెప్పి ఇంటికి వచ్చేది.పూలే దంపతులు సామాజిక పరివర్తన కోసం స్త్రీల విద్యాభివృద్ధి కోసం చేస్తున్న పట్టుదలని జీర్ణించుకోలేని నాటి అగ్రవర్ణ పురుష చాందసవాదులు జ్యోతిరావు పూలే తండ్రి ఐన గోవిందరావు దగ్గరికి వెళ్లి పూలే దంపతులపై లేనిపోని ఆరోపణలు చేస్తూ ఫిర్యాదులు చెప్పేవారు.శూద్ర సమాజం, స్త్రీలు విద్యావంతులు అయితే సమాజం భ్రష్టు పట్టి పోతాది, దేవుళ్ళు కోప పడతారని, మానవ సమాజం కి ముప్పు వస్తుంది అనే ఎన్నో మూఢనమ్మకాలు నాటి అగ్రవర్ణ పురుష ఆదిపత్య పండితులు,నాయకులు చెప్పేవారు.అగ్రవర్ణ పురుష ఆధిపత్య పండితుల చెప్పుడు మాటలు విని గోవిందరావు పూలే మహాత్మా జ్యోతిరావు పూలేని 1849 లో ఇంటి నుండి బహిష్కరిస్తాడు. భర్త యొక్క అడుగుజాడల్లోనే సమసమాజ స్థాపన కోసం, స్త్రీల అభ్యున్నతి కోసం సావిత్రిబాయి కూడా జ్యోతిరావు పూలే తోనే మరణించేవరకు ప్రయాణించింది.
అలా జ్యోతిరావు పూలే ప్రోత్సాహంతో సావిత్రిబాయి 1852లో మహిళా సేవా మండల్ అనే మహిళ సంఘాన్ని స్థాపించింది. దాని ద్వారా మానవ హక్కుల గురించి, మరెన్నో సామాజిక సమస్యల గురించి, సామాజిక విలువల గురించి, స్త్రీల అభ్యున్నతి గురించి,స్త్రీలను చైతన్య పరచడానికి జ్ఞాన బోధ చేస్తూ ఎంతగానో కృషి చేసింది. సావిత్రిబాయి కేవలం ఉపాధ్యాయురాలు,సామాజిక విప్లవకారిణి మాత్రమే కాదు ఆమె గొప్ప రచయిత్రి కూడా.1854లో సావిత్రిబాయి తన కవితా సంపుటి "కావ్యపూలే"ను ప్రచురించింది.ఆనాటి సామాజిక పరిస్థితి ఆమె కవిత్వం అద్దం పడుతుంది. స్త్రీల సాధికారత కోసం, వితంతువుల సంక్షేమం కోసం పూలే దంపతులు ఎంతగానో కృషి చేశారు. నాటి సామాజిక పరిస్థితుల దృష్ట్యా వితంతువులు పునర్వివాహాలు చేసుకోవడానికి అవకాశం లేదు, వితంతువులుగా ఉండి గర్భిణులైన స్త్రీల కోసం స్వేచ్ఛగా బ్రతకడానికి పునర్వివాహం చేసుకొని కుటుంబ జీవితాన్ని గడపడానికి 1853లో శరణాలయాలు స్థాపించింది. సత్యం అనే ఆదర్శాన్ని కేంద్రంగా చేసుకొని పూలే దంపతులు 1873 సెప్టెంబర్ 24 న "సత్యశోధక్ సమాజ్" అనే సామాజిక ఆధ్యాత్మిక సంస్థని ప్రారంభించారు. ఆ సంస్థ ముఖ్య ఉద్దేశం సత్యాన్ని బోధించడమే అంతేకాకుండా ఆ సంస్థ ద్వారా బ్రాహ్మణ పురోహితులు లేకుండా అనేక మంది నూతన దంపతులకు పూలే దంపతులు దగ్గరుండి వివాహం జరిపించారు. పూలే  దంపతులు ఒక్క స్త్రీల విద్య కోసం మాత్రమే కాకుండా, నాడు సామాన్య రైతులను అగ్రవర్ణ వడ్డీ వ్యాపారస్తులు పెట్టే ఇబ్బందులకి వ్యతిరేకంగా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. జ్యోతిరావు పూలే మరణాంతరం సావిత్రిబాయి ఒక్కతే సత్యశోధక్ సమాజ్ సంస్థని తన భుజస్కందాలపై వేసుకొని విజయవంతంగా నడిపించింది. జ్యోతిరావు పూలే మరణాంతరం పూలే ఆస్తికోసం వరసకి సోదరుడైన వ్యక్తి వచ్చి పూలే దంపతులు దత్తతగా తీసుకున్న బ్రాహ్మణ వితంతువుకి పుట్టిన యశ్వంతరావు తో గొడవ పడుతుంటే అట్టి పరిస్థితుల్లో ఎంతో సమయస్ఫూర్తి ప్రదర్శించి సావిత్రిబాయినే జ్యోతిరావు పూలే చితికి నిప్పు పెట్టింది. ఈ సంఘటన భారతదేశ చరిత్రలోనే చాలా అరుదైనది చారిత్రకమైనది ఎందుకంటే నాడు సామాజిక పరిస్థితుల దృష్ట్యా భర్త చితికి భార్యలు నిప్పు పెట్టే అవకాశం లేకుండే కాబట్టి తప్పుడు సామాజిక కట్టుబాట్లని, మూఢనమ్మకాలని సావిత్రిబాయి ధైర్యంగా ఎదుర్కొని పోరాడింది. 1896 లో మరాఠ ప్రాంతంలో తీవ్రమైన కరువు సంభవించగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి అభాగ్యుల తరపున పోరాడి నిధులు మంజూరు చేయించి తనలో ఉన్న సామాజిక సేవా గుణాన్ని, మాతృత్వాన్ని చాటుకున్నది.1897లో పూణే పరిసర ప్రాంతాల్లో భయంకరమైన అంటూ వ్యాధులు వచ్చాయి అలాంటి పరిస్థితుల్లో రోగులకి సేవ చేయడంలో భాగంగా సావిత్రిబాయి ప్లేగు వ్యాధికి గురై 1897 మార్చి 10 న తుది శ్వాశ విడిచి అమరత్వం పొందింది. అయితే నేటి ఆధునిక స్వాతంత్ర భారతంలో స్త్రీలు విద్యావంతులు కావడానికి నాడు మహాత్మా జ్యోతిరావు పూలే దంపతులు చేసిన అసాధారణ పోరాటమే ఫలితమే. అంతేకానీ భారతదేశంలో ఏ మత దేవుళ్ళు కూడా అణగారిన వర్గ సమాజం కోసం, స్త్రీల విద్య కోసం స్వయంగా పోరాడినట్లు చారిత్రకంగా, శాస్త్రీయబద్దంగా నిరూపితం కాలేదు.! కాబట్టి ఒక అణగారిన సమాజానికి, స్త్రీలకె కాదు భారతదేశంలో చదువుల తల్లి అంటే ఒక్క సావిత్రిభాయి పూలే అనే అనేకమంది మేధావుల, విద్యావంతుల,సామాన్య ప్రజల అభిప్రాయం. వాస్తవానికి బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం, మహిళల విద్య కోసం,వారి అభ్యున్నతి కోసం ఏ దేవుళ్ళు పాటుబడినట్లు భౌతిక వాస్తవ చరిత్ర లేదు కాబట్టి కళ్ళ ముందు జరిగిన శాస్త్రీయంగా నిరూపితమవుతున్న సావిత్రిబాయిని చదువుల తల్లిగా కొలవడం ఆరాధించడం చేస్తున్నారు.కాబట్టి సావిత్రిబాయి పూలే గారినికి కేంద్ర ప్రభుత్వం అత్యున్నత "భారత రత్న" పురస్కారం ఇచ్చి, చదువుల తల్లిగా అధికారికంగా గుర్తించాలని అదే వారికి ఇచ్చే నిజమైన గౌరవమని,అదే సామాజిక విలువలకి, నైతిక విలువలకి,మానవత్వానికి నిదర్శనమని ఎందరో తాత్వికులలైన మేధావుల,విద్యావంతుల అభిప్రాయం.

 డాక్టర్ కృష్ణ బంటు 
 గోల్డ్ మెడల్ లిస్ట్... సీనియర్ జర్నలిస్ట్

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333