చట్టబద్ధమైన హత్యలు, ముఠా తగాదాలు, దోపిడీ వ్యవస్థ

Jul 15, 2026 - 02:34
 0  4

మానవతా విలువల కనుమరుగుతో  శితిల మవుతున్న సమాజం.

అదుపు చేయలేని వ్యవస్థతో   సర్వత్రా కన్నీరు.పాలనా వైఫల్యం కాదా

---వడ్డేపల్లి మల్లేశం   

సర్వత్రా అనర్థాలు అగచాట్లు  ఆందోళనలు  అసహనం  నిరాశ నిస్పృహలు  ఈ లక్షణాలున్న పాలనా వ్యవస్థలో  ఏ రంగం కూడా  బతికి బట్ట కట్టే అవకాశం లేదు  ఒక్క పెట్టుబడిదారీ కార్పొరేట్ వ్యవస్థ తప్ప.  ప్రభుత్వాలు ప్రజల పక్షాన పని చేయడం కాకుండా  పెట్టుబడిదారులకు అండగా ఉంటున్నాయని  బుద్ధి జీవులు మేధావులు చేస్తున్న ఆరోపణలకు బలమైనటువంటి సాక్షాధారాలు ఉన్నట్లుగా  గుర్తించవచ్చు. కార్పొరేట్ సంస్థల ప్రతినిధుల  అప్పుల ఎన్నింటినో మాఫీ చేసి  లక్షల కోట్ల రూపాయలను  ప్రజలకు అందకుండా చేసినటువంటి పాలనా వ్యవస్థ మనది. ప్రభుత్వ రంగ సంస్థలను  క్రమంగా నీరుగార్చి ప్రైవేటు సంస్థలను ప్రోత్సహిస్తూ  భద్రత లేని పా లనా వ్యవస్థను సృష్టించే క్రమంలో నేడు  ప్రభుత్వాలు  ముందున్నవి.  ప్రజలను ప్రభువులు గా చూడవలసినటువంటి పాలనా వ్యవస్థ  యాచకులుగా బానిసలుగా  అడుక్కుతినేవారుగా  పరిగణనలోకి తీసుకున్నప్పుడు  అంతే స్థాయిలో ప్రజలు కూడా  ఉచితాలు తాయిలాలు వాగ్దానాలకు  కొంత తలవొగ్గిన పరిస్థితులలో  పాలకులు ప్రజల మీద స్వారీ చేస్తున్నట్లు మనకు అర్థమవుతుంది.  కానీ మాట వరసకు మాత్రం పాలకులు  మేము ప్రజలకు సేవకులమని  ప్రజల ఆస్తిపాస్తులకు కాపలాదారులమని  నమ్మబలికే ప్రయత్నం చేయడం నిత్యం కల్లారా చూస్తూనే ఉన్నాం .ఇదంతా కూడా చట్టబద్ధంగా జరుగుతున్న  దోపిడీ,మోసం, వంచన కాదా?

భిన్న రంగాలలో మోసపోతున్న ప్రజలు.

ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు రైతులు కార్మికులు, చేతి వృత్తుల వాళ్ళు  వ్యవసాయ ఇతర అవసరాల రీత్యా కార్యాలయాలలోకి వెళ్ళినప్పుడు  వాళ్ల బాధ వర్ణాతీతం. లంచం లేకుండా  పనులైన దాఖలా లేదు  కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి  చెప్పులు అరిగినా ఫలితం లేకపోవడంతో విది లేని పరిస్థితులలో  అడిగినంత సొమ్ము  అర్పించి పనులు చేసుకుంటున్నారు ఒక దశలో ప్రతిఘటించిన సందర్భాలు అనేకం. అంటే  ప్రజాస్వామ్యానికి ఇదేనా నిర్వచనం?  ఇదే సందర్భంలో అధికారులు ఉద్యోగులు, ముఖ్యంగా  ప్రజలను వినియోగదారులను   మోసగిస్తూ  లక్షలు కోట్లను కూడబెడుతూ ఇటీవల కాలంలో చట్టానికి చిక్కిన సందర్భాలు అనేకం. అయినా ప్రభుత్వంలో చలనం లేదు  అధికార యంత్రాంగంలో కనీసం పశ్చాత్తాపం కూడా లేదు.  దొరికితే దొంగ లేకపోతే దొర అనే చందంగా ఇస్టా రాజ్యాంగా వ్యవహరిస్తూ ప్రజాధనాన్ని కొల్లగొడుతూ  ప్రభుత్వ రంగంలోనూ అవినీతికి పాల్పడుతూ అక్రమంగా సంపాదిస్తున్న  విధానం అవహేళనకు  అవమానానికి నిదర్శనం అంతకంటే  సిగ్గుచేటు మరొకటి ఉంటుందా? ఇంకా ఉద్యోగులు అధికార యంత్రాంగం  సంఘాలు నాయకత్వం కూడా ఉద్యోగుల యొక్క తప్పిదాలను  ఎక్కడ కూడా మందలించి  అటువైపు వెళ్ళకుండా అడ్డుకున్న దాఖలా మనకు కనిపించదు.  అంటే ఈ అధికార యంత్రాంగం యొక్క అవినీతిలో  అందరూ భాగస్వాములేనా అని అనుమానం రాక మానదు. రాజకీయ యంత్రాంగంలో అవినీతి కొనసాగినంత కాలం  ఉద్యోగ యంత్రాంగంలో అవినీతి కొనసాగుతుందని వాదన ఒకటి బలంగా ఉంది.  రాజకీయ నాయకుల యొక్క అవినీతి పైన అనేక సందర్భాలలో  విచారణ సంస్థలు విచారణ చేపట్టినప్పటికీ మొక్కుబడిగానే కాలయాపనతో  దశాబ్దాలు గడిచిపోయిన సందర్భం మనకు తెలుసు. ఇటీవలి కాలంలో  కార్ల రేస్  కాలేశ్వరం ప్రాజెక్టు కుంభకోణం  ఫోన్ టాపింగ్ అంశాలు భారీగా తెరమీదకి వచ్చినప్పటికీ  అంతే స్థాయిలో కనుమరుగైన విషయాన్ని  గమనిస్తే  పాలకులు ప్రతిపక్షాలు కూడా  ఒకే తానులోని ము క్కలని అర్థమవుతూనే ఉంది.  అంతే స్థాయిలో భారతదేశ వ్యాప్తంగా ప్రతి చోటా అవినీతి రాజ్యమేలుతుంటే  అయోధ్య రాముని యొక్క ఆస్తిపాస్తులను కూడా కొల్లగొట్టడానికి  ఉద్యోగులు వెనుకకు పోలేదంటే ఎంత దుర్మార్గపు వ్యవస్థ కొనసాగుతున్నదో అర్థం చేసుకోవచ్చు. పైగా   జైశ్రీరామ్ అంటూ మంత్రాలు జపించి  ఆ వెనుక  ఇంత కు ట్రలకు పాల్పడుతున్నారంటే  ఈ దేశంలో కొనసాగుతున్న వ్యవస్థ ఏమిటి?  దీనికి బాధ్యులు ఎవరు?  అచేతనమైనటువంటి ప్రజా చైతన్యం, పాలనా వ్యవస్థలోని  నిర్లిప్తత, స్వార్థంతో  సామాన్య ప్రజలకు ద్రోహం చేస్తే  ప్రశ్నించే వాళ్లను  టార్గెట్ చేస్తే  ఎలా ?

మరిన్ని అనర్థాలు .

హత్యలు దోపిడీలు దొంగతనాలు మానభంగాలు  నిరంతరం  కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే  మహిళల జోలికి వెళ్తే ఇదే చివరి రోజు అవుతుందని ఉప ముఖ్యమంత్రి ముఖ్య మంత్రి కూడా అనేక సందర్భాల్లో హెచ్చరించిన విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే లాభం ఏముంది  పోలీసుల సమక్షంలోనే వాళ్ల నియంత్రణలోనే  వ్యక్తులు కనుమరుగవుతూ  విచారణ  నెలల తరబడి చేసినా కూడా కనీసం శవం దొరకలేదంటే ఇది చట్టబద్ధమైనటువంటి  నేరం కాదా?  ఇక కల్తీ  ఇస్తారాజ్యంగా కొనసాగుతుంటే నెలల తరబడిగా నిల్వ ఉన్నటువంటి మాంసాహారాలు ఇతర ఆహార పదార్థాలను  యదేచ్చగా ప్రజలకు సరఫరా  చేస్తూ ఉంటే చోద్యం చూస్తున్న ప్రభుత్వాలను ఏమనాలి? ఇక అనుమతులు లేకుండా  రాజభవనాలను నిర్మిస్తూ ఉంటే చోద్యం చూడడం  సామాన్య ప్రజలకు మాత్రం  అనుమతులు కావాలంటే లక్షలు వేళల్లో డిమాండ్ చేయడం  కనీసం ఒక సొంత ఇల్లు కట్టుకోవడానికి కూడా నోచుకోకపోవడం  నిరంతరం కళ్ళ ముందు జరుగుతున్న కటోర సత్యాలు. ప్రజలను కంటి రెప్పల వలె కాపాడడానికి ఉన్నది మాత్రమే పాలనా వ్యవస్థ కానీ  ఉన్న కంటి రెప్పలనే కాల్చివేసి  కను గుడ్డను పీకి వేసే విధంగా పాలనా వ్యవస్థ కొనసాగితే  ప్రభుత్వ రంగంలో విద్య వైద్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ప్రైవేట్ రంగాలను ప్రోత్సహిస్తూ ఉంటే సామాన్యుల యొక్క కొనుగోలు శక్తి  కనుమరుగు కావాల్సిందేనా ?ఈ రకంగా ప్రభుత్వాలు తమ మనగడ కొనసాగిస్తున్నది  పెట్టుబడిదారీ వ్యవస్థ అవినీతిపరులు  ఆగడాలకు పాల్పడుతున్న వారి కోసమేనా?  వారి అంతం చూడడానికి ప్రభుత్వాలు పని చేయకూడదా? పాలకులు మాత్రం  అవినీతిని ఆకృత్యాలను సహించేది లేదని  ఇది చివరి రోజు అని బాహాటంగా చెబుతున్నప్పటికీ  ఎక్కడ కూడా చివరి రోజు కాలేదు పైగా  నెలలు సంవత్సరాలుగా  అరాచకాలు కొనసాగుతూ ఉంటే మౌనం వహించడం ఇది కావాలని చేస్తున్న  నటనయా? లేక పెట్టుబడుదారి వర్గం యొక్క ఒత్తిడియా అర్థం కావడం లేదు  .అధిక ధరల భారంతో  మరొక దిక్కు వర్షాలు లేక వ్యవసాయదారులు కొనుగోలు చేయలేక  పెట్టుబడికి రుణ సహాయం అందక  వేసిన పంటలు ఎండిపోతూ ఉంటే  కుమిలిపోతున్నారు. పేదలు  అన గారిన వర్గాలు కూడా తమ పిల్లలకు విద్యను వైద్యాన్ని ప్రైవేటు రంగంలో  అందుకోలేక  ప్రభుత్వ రంగంలో సరైనటువంటి నాణ్యమైన విద్య వైద్యం  ఏర్పాటుకు ప్రభుత్వాలు చిత్తశుద్ధిగా లేని కారణంగా ఊ గిసలాట మనస్తత్వంతో పేద వర్గాలు  ప్రైవేటు వైపు కొమ్ము కాస్తూ  అప్పుల పాలవుతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వీటిని  ప్రజలను కొనుగోలు శక్తిని తగ్గించి వారి యొక్క రక్షణను  భద్రతను చూడనటువంటి ప్రభుత్వం యొక్క చట్టబద్ధమైన హత్యలు గానే భావించాలని నిపుణులు మానసిక వేత్తలు సామాజికవేత్తలు అభిప్రాయపడుతున్నప్పుడు  ప్రభుత్వాలపై ఇన్ని అనర్థాలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎంతగానో ఉంది.

( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333