ఉపాధి హామీ సిబ్బంది బదిలీలకు గ్రీన్ సిగ్నల్ జిల్లాల్లో బదిలీలు డ్వామా పీడీలకు అప్పగింత

ఉపాధి సిబ్బంది బదిలీలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ కృష్ణతేజ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉపాధి హామీ పథకం డైరెక్టర్ బదిలీలకు మార్గదర్శకాలు విడుదల చేశారు. జిల్లాల్లో బదిలీలు చేపట్టేందుకు డ్వామా పీడీలకు అనుమతి మంజూరు చేశారు. ఈ నెల 15 నుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభించి 20లోపు పూర్తిచేసి, కొత్త ప్రదేశాల్లో 22 నాటికి విధుల్లో చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న ఉపాధి హామీ పథకంలోని ఎఫ్.టి.ఈ, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాల్లో పనిచేసే సిబ్బందికి ఆయా జిల్లాల్లో అంతర్గత బదిలీలకు అవకాశం కల్పించారు. డ్వామా కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది ఒకే సీటులో మూడేళ్లు సర్వీసు పూర్తి చేసి ఉంటే వారిని వేరే సీట్లకు బదిలీ చేయాలని పేర్కొన్నారు. సెప్టెంబరు 30 నాటికి రిటైర్ కాబోయే సిబ్బందిని మాత్రం బదిలీల నుంచి మినహాయించారు.