ఇంటర్మీడియట్ - 2026 వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి.. జిల్లా కలెక్టర్
జోగులంబ గద్వాల 17 ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అధికారులను ఆదేశించారు.
మంగళవారం ఐడిఓసి కాన్ఫరెన్స్ హాల్ నందు ఇంటర్ విద్య, పాఠశాల విద్య,రెవెన్యూ,పోలీసు, రవాణా,వైద్య ఆరోగ్యం,విద్యుత్ తదితర శాఖల అధికారులతో ఇంటర్ పరీక్షల నిర్వహణపై జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 25 నుండి మార్చ్ 16 వరకు జరిగే ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పరీక్షా కేంద్రాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో 14 పరీక్షా కేంద్రాల్లో 8,471 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు. వీరిలో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్లు 4,366 సెకండ్ ఇయర్ 4,105 మంది ఉన్నారన్నారు. పరీక్షలను నిష్పాక్షికంగా నిర్వహించేందుకు చీఫ్ సూపరిడెంట్స్, ఫ్లయింగ్ స్క్వాడ్లు,డిపార్ట్మెంట్ అధికారులు, సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసి కఠినమైన నిఘా పెట్టాలని తెలిపారు.స్ట్రాంగ్ రూము ను పోలీస్ స్టేషన్ లోనే ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.ప్రశ్నాపత్రాల రవాణాకు పోలీస్ ఎస్కార్ట్ ఇవ్వడంతో పాటు పరీక్షల పర్యవేక్షణ కోసం ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించాలని పోలీసు అధికారులను ఆదేశించారు.అన్ని పరీక్షా కేంద్రాల్లో ముందుగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశిస్తూ,పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ ఉన్నందున జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని సూచించారు.పరీక్షా కేంద్రాల్లోకి ఎవరు సెల్‌ఫోన్ తీసుకురావడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా అవసరమైన మార్గాల్లో బస్సు సర్వీసులు నడిపేలా ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్ కిట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు,తగిన మందులతో ఆశాలను అందుబాటులో ఉంచాలని వైద్య శాఖ అధికారులను సూచించారు. పరీక్షా సమయంలో ఎటువంటి విద్యుత్ అంతరాయం లేకుండా విద్యుత్ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ రావు,ఆర్డీఓ శ్రీనివాస రావు,అడిషనల్ ఎస్పీ శంకర్,జిల్లా ఇంటర్మీడియట్ అధికారి హృదయ రాజు,విద్యుత్ శాఖ అధికారి రమేష్ బాబు,ఆర్టీసీ అధికారి సునీత,విద్యా శాఖ సహాయ అధికారి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
…………………………................................