ఆహార కేంద్రాల్లో తనిఖీలు పెంచాలి.

Mar 30, 2026 - 17:15
Mar 30, 2026 - 17:16
 0  0
ఆహార కేంద్రాల్లో తనిఖీలు పెంచాలి.

జోగులాంబ గద్వాల 30 మార్చి 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- జిల్లాలోని హోటల్స్, రెస్టారెంట్స్, తదితర ఆహార కేంద్రాల్లో సంబంధిత అధికారులు ఆహార పదార్థాలు మంచిగా ఉన్నాయో,లేదో తరచూ తనిఖీలు చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు.

సోమవారం ఐడిఓసీ సమావేశపు మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఆహార సలహా కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.  గ్రామస్థాయిలో ఉండే హోటల్స్ సైతం సంబంధిత గ్రామపంచాయతీ, ఫుడ్ సేఫ్టీ విభాగం నుంచి హోటల్స్ నిర్వహించేందుకు అనుమతులు తీసుకోవడం, రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి చేయాలన్నారు. జిల్లాలోని హోటల్స్ లో ఆహారాన్ని తయారు చేసేందుకు వినియోగించే నూనెలు, ఇతర సరుకులు నాణ్యతతో ఉన్నాయో లేదో సంబంధిత అధికారులు తరచు పరిశీలించాలన్నారు. ఆహార కేంద్రాల వంట గదులు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలన్నారు. అక్కడ వినియోగించే పాత్రలు, నీళ్లు శుభ్రంగా లేకుంటే ఆహారం కల్తీ అయ్యే ప్రమాదం ఉన్నందున సంబంధిత అధికారులు తరచూ పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. వంట చేసే మాస్టర్లు, ఇతర సిబ్బంది నిబంధనల ప్రకారం జాగ్రత్తలు పాటిస్తూ శుచి, శుభ్రతతో వంటలు చేసేలా ఆదేశించాలన్నారు. ఒక నెలలో హోటల్స్ నుంచి సేకరించిన ఆహార పదార్థాల శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపించి రిపోర్టును ఎప్పటికప్పుడు తమకు పంపించాలన్నారు. హోటల్ ల యజమానులు నిబంధనల ప్రకారం ఆయా ఆహార కేంద్రాలను నిర్వహించాలని, కల్తీ ఆహార పదార్థాలను విక్రయించే యాజమాన్యాలపై కేసులు బుక్ చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఈ సందర్భంగా ఆదేశించారు. 

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు,ఆర్డీవో శ్రీనివాసరావు, ఇతర జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State