అల్పాదాయ ప్రజలు అత్యల్ప వేతన జీవులు అర్ధాకలితో బ్రతకాల్సిందేనా
అవకాశాలు సౌకర్యాలు సుఖవంతమైన జీవితo వారికి అందని ద్రాక్ష నా?
ఆదాయం, సంపదలో అసమానతలు జనాన్ని నిట్ట నిలువునా చీల్చడం రాజ్యాంగబద్ధమా?
కానప్పుడు ఈ వివక్షత , కు0 గుబాటును అంతం చేయలేమా?
కొందరిది వడ్డించిన విస్తరి అయితే మరికొందరు ఆకలితో అలమటించి, ఉపాధి అవకాశాలు లేక, వివక్షతకు గురై దుఃఖ భారంతో కృంగిపోవాల్సిందేనా?
అనేక సందర్భాలలో జన జీవితాన్ని చిద్రం చేస్తూ ఆందోళన కు గురి చేస్తున్న అల్పాదాయ వర్గాల, అత్యల్ప వేతనం పొందే వేతన జీవుల, చిరు వ్యాపారులు, వీధి వ్యాపారుల దయనీయ స్థితిని సభ్య సమాజం గుర్తించడం చాలా అవసరం. "తన కడుపు నిండితే ఇక దేశంలో దరిద్రమే లేదు అనుకునే సామాజిక స్పృహ లేని తన వరకు మాత్రమే ఆలోచించే వ్యక్తులు ఉన్న ఈ సమాజంలో నెలకొన్న అసమానతలు అంతరాలు దోపిడీ, పీడన వివక్షతను ఏనాడు గుర్తిస్తారో ఇప్పటికీ అనుమానమే !.లేని వాళ్ళ బాధలు కష్టాలు కన్నీళ్లను అంగీకరించడానికి ఉన్నవర్గాలు ముందుగా సిద్ధంగా లేరు . ఎక్కడైనా మానవత్వం ప్రదర్శించి కష్టాలు కన్నీళ్లు తుడిచి స్వచ్ఛంద సేవలో పాల్గొనే వాళ్ళు ఉంటే కాదనలేము కానీ వారి శాతం ఎంత? ప్రభుత్వాలు మాట వరసకు పేద ప్రజల కోసం పనిచేస్తున్నామని, సామాన్య ప్రజానీకమే తమకు దైవంతో సమానమని , ప్రజలకు పాలకులం కాదని సేవకులం మాత్రమేనని నమ్మబలికే ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఆచరణలో మాత్రం 90 శాతం ఉన్నటువంటి అట్టడుగు ఆదివాసి పేద బలహీన వర్గాలకు ఈ దేశ బడ్జెట్లో కేటాయిస్తూ పంపిణీ చేస్తున్నది మాత్రం 10 శాతం దాటడం లేదని గణాంకాలు అనుభవజ్ఞులు చెబుతూ ఉంటే పేద వర్గాల జీవితం వడ్డించిన విస్తరి ఎలా అవుతుంది? నా అనే వాళ్ళు లేక, ఆదాయం సమకూరే మార్గాలు కానరాక, అత్యంత దయనీయ స్థాయిలో వేతనాలు కూలీ నాలి చిరు వ్యాపారులుగా, వీధి వ్యాపారులుగా, సంచార జీవితం గడుపుతూ కాయలు గడ్డలు వేర్లు, పండ్లు, బొమ్మలు ఏదో ఒకటి అమ్ముకుంటూ పొట్ట పోసుకునే సామాన్యులను మాత్రం సంపన్నులు రెండవ శ్రేణి పౌరులుగానే చూస్తున్నారు . మరొక్క అడుగు ముందుకు వేసి పేద వాళ్ళ పిల్లలు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లడం అవసరమా? ఉన్నంతలో గడుపుకోవాలి సొంత ఇల్లు కావాలంటే ఎలా వస్తుంది? పని చేయకుండా ఆదాయం సమకూర్చుకోకుండా సుఖ పడాలి అంటే ఎలా? ఉన్నత వర్గాలు సంపన్నులతో పోటీ పడడానికి సిద్ధపడితే సమంజసమా? అంటూ అనేక రకాల ఆడిపోసుకునే ప్రయత్నం చేస్తున్నారు కూడా. ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలు మనం లోతుగా వెళ్ళినప్పుడు మాత్రమే అర్థం చేసుకోగలము.
సమానత్వ సాధన కోసం పోరాడాల్సిందే
***********
ఇండ్లలో పని చేసేవాళ్లు, నిర్మాణాల దగ్గర తాపీ మేస్త్రీలు కూలీలు సహాయకులు, వీధుల్లో అలసి సొలసి సొమ్మసిల్లి కలో, గంజో తాగి అమ్ముకునే చిరు వ్యాపారులు, సొంత ఇల్లు లేక అమ్ముకోవడానికి అంగట్లో అవకాశం లేక గే 0టి వేస్తే ఎక్కడ అమ్ముకోవాలో తెలువక ఇల్లిళ్ళు తిరిగి సొమ్ము చేసుకునే సంచార జీవులు, కంకులు కాల్చే వాళ్ళు, పల్లీలు అమ్మేవాళ్లు, ఛాయా చిరుతిండ్లు,జావా వీధుల్లో విక్రయించేవాళ్లు, పారిశుద్ధ్య కార్మికులు, ప్రకృతి విపత్తుల్లో పనిచేసే వాళ్లు, పొలాలలో కూలీ నాలీలు చేసేవాళ్ళు, తట్టా బుట్టా పారా పట్టి కూలినాలే చేసేవాళ్లంతా తమ పొట్ట గడుపుకోవడానికి పిల్లలను పోషించుకోవడానికి రోగాల బారి నుండి కాపాడుకోవడానికి మాత్రమే తమ ఆదాయం సరిపోవడం లేదని ఆందోళన చెందుతున్నారు. ఈ సమాజ ఉనికిని కాపాడడానికి , గమనాన్ని నిర్ణయించి గమ్యాన్ని చేరుకోవడానికి , అన్ని రంగాలలో క్రింది స్థాయిలో పనులు చేస్తూ సేవ చేసి కుటుంబాలకు ఆసరాగా ఉండి వృద్ధులను చేరదీసి పోషించే పనిలో నిమగ్నం అవుతున్నది కూడా పేదవాళ్లే. అయితే వాళ్లంతా అడుక్కు తినే స్థాయిలోనే ఇంతకాలం జీవించడం అమానుషం.
"మన చెప్పులు కుట్టినవాల్లు , బోలు తొమిన వాళ్లు, ఇల్లు వాకిలి ఊడ్చి పా చి పని చేసిన వాళ్లు, ఇంటి నిర్మాణంలో కూలీనాలీలు చేసి పస్తులున్న ఇండ్లను నిర్మిస్తున్న వాళ్లు, పంటలను మన ఇండ్లకు చేరుస్తున్న వాళ్లు మనకు సేవ చేసిన వాళ్లు కూడా తోటి మనుషులే అనే మానవత్వం లేనటువంటి సభ్య సమాజం మనది . పేదలను, సేవకులను ,కార్మికులను, కష్టజీవులను, కాయకష్టం చేసుకుని బ్రతికే వాళ్లను ఎక్కడా గౌరవించిన సందర్భాలు లేవు. ఎందుకంటే సంపన్నులకు శ్రమ విలువ తెలియదు కనుక! పైగా నిందలు నేరాలు మోపడం, చాడీలు చెప్పడం,
అవమానించడంతోనే సరిపెట్టుకుంటున్న ఈ సభ్య సమాజంలోనీ సంపన్నులకు నిజమైన ఉత్పత్తిదారుల మీద జాలి ప్రేమ దయ వుంటుందా ? సొమ్మొకడిది శోకు మరొకరిది, శ్రమ ఒకరిది సిరి ఇంకొకరిది, ఇంకానా ఇకపై సాగదు. ఈ వివక్షత అలసివేత పేదరికం అవమానాలు పోరాటాలు చేయవలసిన సమయం ఆసన్నమైనది."
అసమానతలు రాజ్యాంగబద్ధమా ?
*****
సమానత్వాన్ని సాధించడం సౌబ్రాతృత్వాన్ని పెంపొందించడం న్యాయాన్ని సమకూర్చడం సమానత్వానికి ప్రాతిపదిక అయిన సామ్యవాద వ్యవస్థను రూపొందించడం ద్వారా సమ సమాజాన్ని నిర్మాణం చేయాలని రాజ్యాంగ పీఠిక తో పాటు భారత సార్వభౌమాధికార వ్యవస్థ ఆశిస్తూ ఉంటే ఆ రాజ్యాంగ పలాలను అనుభవించడానికి దేశంలోని అందరికీ స్వేచ్చా స్వాతంత్రాలు సమానంగా ఉన్నాయని ఘోషిస్తుంటే ఈ వివక్షత ఎందుకు? అసమానతలు అంతరాలు ఇంకెందుకు? దేశ సంపద కొద్దిమంది చేతుల్లోనే ఉంటే పాలకులకు కళ్ళు కనిపించడం లేదా? పాలకులే పెట్టుబడిదారీ వర్గానికి కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేస్తుంటే న్యాయ వ్యవస్థ చూస్తూ ఎందుకు ఊ రుకుంటున్నాది? "సంపద ఈ రకంగా కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం అయినప్పుడు,
వివక్షతకు గురవుతున్న పేద వర్గాలకు ఆదాయ మార్గాలను కల్పించనప్పుడు, ప్రైవేట్ రంగంలో అరకొర వేతనాలతో పని చేస్తూ అప్పుల పాలవుతూ తమ పిల్లలను పెంచి పోషించుకోలేక పాఠశాలల్లో భారీ ఫీజులను మోయలేక రోగాల బారిన పడితే దవాఖానాల్లో డబ్బులు చెల్లించలేక ఎన్ని కుటుంబాలు దిగాలు పడిపోతున్నాయో! మరే న్ని కుటుంబాలు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నాయో! ఈ దేశ న్యాయవ్యవస్థ, పాలకులు దృష్టి సారించిన నాడు మాత్రమే ఈ అసమానతలు నిర్మూలించబడతాయి. అందరికీ ఉద్యోగాలు కల్పించలేకపోవచ్చు కానీ అసమ సమాజంలో సంపద పేద వర్గాలకు పంచకుండా రాజ్యాంగబద్ధంగా రావలసిన అవకాశాలకు అడ్డుకట్ట వేస్తే పక్షవాతంతో శరీరంలో ఒక భాగం పని చేయకుండా పోతే ఎలా ఉంటుందో ఈ భారత వ్యవస్థ కూడా అంతే. "శ్రమచేసి ఉత్పత్తిలో భాగస్వాములు అవుతున్నటువంటి మెజారిటీ పేద వర్గాలు సంపదను అనుభవించడంలో మాత్రం ఆందోళనకు గురవుతున్నారు . పెట్టుబడిదారీ వర్గం, పాలకులు , సంపన్నులతో వెలివేయబడుతున్నారు . రెండవ శ్రేణి పౌరులుగా బహిష్కరించబడుతున్నారు. ఇక అడవులు చెట్లు , గుట్టల్లో జీవించే ఆదివాసీల సంగతి చెప్పనలవి కాదు. వాళ్లు ఈ దేశ పౌరులు కాదా? అనే అనుమానం రాక మానదు, అభివృద్ధి పలాలు వాళ్ల దరికి చేరలేదు, రోగాలు నొప్పులు ప్రమాదాలు పాము క్రూర మృగాల కాటులకు బలవుతుంటే వాళ్లకు సంక్షేమ ఫలాలను ఇప్పటికీ సకాలంలో సవ్యంగా అందించలేకపోవడం ఈ దేశంలో పాలనా వ్యవస్థ ఎంత అవిటిదో అర్థం చేసుకోవచ్చు ."
పాలకులు ఒకవైపు సంపన్నులు మరొకవైపు పేదరికం వివక్షత అసమానతలు ఇప్పటికీ కొ
నసాగడానికి కారణం అవుతుంటే మౌలిక సమస్యల పరిష్కారం అటుకెక్కిన సందర్భంలో ప్రజల పక్షాన గొంతు విప్పడానికి ఉన్నటువంటి ప్రజా సంఘాలు , మేధావులు, బుద్ధి జీవులు, హక్కుల కార్యకర్తలు పాలకులపై నిత్యం ఘర్షణ పడుతూ ప్రశ్నిస్తూ ఉంటే కూడా పేద వర్గాలకు న్యాయం జరగడం లేదంటే పాలన వ్యవస్థలో సంపన్నులు ఎంత బలంగా పాతుకుపోయినారు అర్థం చేసుకోవచ్చు. వివక్షత అసమానతలు అంతరాలు రాజ్యాంగబద్ధం కాదు సమానత్వ సాధన కోసం పనిచేస్తున్నామని పాలకులు అప్పుడప్పుడు సమాధానం ఇచ్చినప్పటికీ గుర్తించదగిన స్థాయిలో ఆ మార్పు కనిపించడం లేదు. అందుకే ఎక్కడైతే అన్యాయం ఉంటుందో అక్కడే న్యాయం కోసం పోరాటం చేయాలి, ఏ వర్గానికి అయితే అన్యాయం జరుగుతుందో ఆ వర్గమే ముందు వరుసలో నిలబడాలి తెగబడాలి. ఏ అవయవానికి ఇబ్బంది ఉంటుందో అక్కడే చికిత్స జరగాలి అలాగే అట్టడుగు వర్గాలకు అన్యాయం జరిగినప్పుడు ఆ వర్గాలు ప్రజలు పోరుబాట పట్టక తప్పదు . రాజ్యాంగము, న్యాయవ్యవస్థ ,రాజకీయ యంత్రాంగం విఫలమైనప్పుడు మాత్రమే ఈ అసమానతలు నిరంతరం కొనసాగుతాయి అసమాన తలను అంతం చేసి సమానత్వాన్ని సాధించడానికి అట్టడుగు పేద వర్గాలు పోరుబాట పట్టినప్పుడు న్యాయ వ్యవస్థ రాజకీయ యంత్రాంగం కూడా తమ గమనాన్ని మార్చుకోక తప్పదు . అయితే అనేక సందర్భాలలో న్యాయ వ్యవస్థ ప్రజల జీనస్థితిని గురించి ప్రభుత్వాలను హెచ్చరించిన సందర్భంలో కూడా ప్రభుత్వాలు తమ మొద్దు నిద్ర వదలని పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి . అందుకే న్యాయ వ్యవస్థ పునాదిగా మన కార్యక్రమాలు ఉన్నప్పుడు పాలకులకు కొంతవరకైనా జ్ఞానోదయం కలుగుతుంది. శాప గ్రస్తులుగా మారినటువంటి పేద వర్గాలు అల్పాదాయ వేతన జీవులకు కొంతైనా ఊరట లభిస్తుంది, ఆత్మవిశ్వాసం ఆత్మగౌరవం దక్కుతుంది.
,,(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు జేఏసీ నాయకులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ ) జీ