అక్రమ కట్టడాలపై కమిషనర్‌కు ఫిర్యాదు
గద్వాల 27 జూన్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : ఐజ మున్సిపాలిటీపరిధిలోని ప్రభుత్వ మరియు నాలా భూముల ఆక్రమణలపై భీమ్ ఆర్మీ ఆగ్రహం రూ.5 కోట్ల విలువైన స్థలాన్ని కాపాడాలన్న మాచర్ల ప్రకాష్ అయిజ పురపాలక సంఘం పరిధిలో ప్రభుత్వ మరియు నాలా భూములను ఆక్రమించి చేపడుతున్న అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ రావుకు వినతిపత్రం అందజేశారు. భీమ్ ఆర్మీ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఇంచార్జ్ మాచర్ల ప్రకాష్ ఆధ్వర్యంలో ఈ ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అయిజ మున్సిపల్ కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్ సమీపంలో, గద్వాల రహదారి పక్కన గల మార్కెట్ స్థలంలో కొందరు అక్రమార్కులు ప్రభుత్వ మరియు నాలా భూములను ఆక్రమించుకున్నారని మండిపడ్డారు. సుమారు ఐదు కోట్ల రూపాయల విలువైన ఈ ప్రభుత్వ భూమిలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం సరికాదన్నారు. తక్షణమే మున్సిపల్ యంత్రాంగం స్పందించి ఆ అక్రమ కట్టడాలను కూల్చివేయాలని, ప్రభుత్వ ఆస్తులను రక్షించాలని డిమాండ్ చేశారు. ఆక్రమణదారులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోకపోతే భీమ్ ఆర్మీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ యుగేందర్, మల్దకల్, వడ్డే రాము, రాజు, శ్రీకాంత్ మరియు భీమ్ ఆర్మీ నాయకులు పాల్గొన్నారు.