పురస్కారాల ప్రధానం అర్హతతో ముడి పడినది
కులం మతం పేరుతో అందరికీ ఇస్తే అర్థమేమి ఉంటుంది?
అర్హత లేని వాడు పురస్కారాలు ఇస్తున్న సందర్భం ఏడవాలో నవ్వాలో అర్థం కాని వింత పరిస్థితి.
పురస్కారం ప్రేరణగా కార్యోన్ముకుల చేయగలగాలి.
---- వడ్డేపల్లి మల్లేశం
ఇటీవలి కాలంలో సంస్థలను ఏర్పాటు చేసుకోవడంతో పాటు పురస్కారాల ప్రధానం పేరుతో ఉనికిలో ఉండే ప్రయత్నం చేస్తున్న నూతన ఒ రవడిని మనం పరిశీలిస్తే అర్థమవుతుంది. ఆర్థికంగా లేనివాడు నాయకత్వం వహిస్తూ వేలు లక్షల సంఖ్యలో ఖర్చు చేస్తున్నాడు ఎలా సాధ్యం? ఏ రంగంలో పరిచయం లేకుండానే కార్యక్రమ నిర్వహణ, సభా అధ్యక్షత, కార్యక్రమం రూపకల్పన కొనసాగిస్తున్న వాళ్లను కూడా మనం చూడవచ్చు. భాషా, సాహిత్యము, సమాజంతో సంబంధం లేని వాళ్ళు సాహిత్య సభలకు అధ్యక్షత వహిస్తు అవార్డులను ప్రధానం చేస్తున్నారు పత్రికల్లో రాణిస్తున్నారు. చివరికి సాహిత్యం యొక్క,పత్రికల యొక్క స్థాయిని తగ్గిస్తూ ప్రతిభను మంట కలుపుతూ ఉనికిలో ఉండాలని కోరుకునే వాళ్ళ సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉంటే మానవీయ విలువలు మృగ్యం కాక మరేం అవుతాయి.
సామాన్య ప్రజలు కార్మికులు, చేతివృత్తుల వాళ్ళు ఇతరత్రా కాయకష్టం చేసుకుని బ్రతికే వాళ్ళు రైతులు కూలీలు అక్షరాస్యత ఉండవచ్చు లేక ఆల్ఫ అక్షరాస్య తోనే జీవిస్తున్నారు కావచ్చు కానీ వారికి నిర్మాణ పరిజ్ఞానం, ఉత్పత్తిలో భాగస్వాములవుతూ క్రియాశీలకంగా నమ్మిన మెచ్చిన నచ్చినటువంటి రంగంలో రాణిస్తూ కృషి చేస్తూ ఉత్పత్తులను పెంచుతూ దేశాభివృద్ధిలో పాలుపంచుకుంటున్న సందర్భాన్ని గమనించినప్పుడు వాళ్లు అన్ని రకాల అర్హులే అని చెప్పక తప్పదు. వాళ్ళు ఏనాడై నా గౌరవించబడతారా? డబ్బున్న వాళ్లు, పలుకుబడి గల వాళ్లు, పరిచయాలు ఉన్నవాళ్లు, ఖర్చు పెద్ద స్థాయిలో పెట్టగలిగిన వాళ్లకు ఇలాంటి వేదికల్లో స్థానం కల్పించి పెట్టుబడులను స్వీకరించి పురస్కారం యొక్క ప్రాధాన్యత ఏమిటో ఆ లక్ష్యం యొక్క స్థాయి పురస్కారాల నే పద్యం తద్వారా సమాజానికి వనగోరే ప్రయోజనం గురించి ఇసుమంత కూడా ఆలోచించకుండా ఆ ఆలోచన ఏమాత్రం లేకుండానే వేదికల మీద కూసుంటున్నారు. సభా అధ్యక్షత వహిస్తున్నారు, ప్రవచనాలు అందిస్తున్నారు, పత్రికల్లో రాణిస్తున్నారు, పురస్కారాలు అo దుకుంటున్నారు.
ఈ రకంగా అర్హతలు లేనటువంటి సంబంధం లేని వాళ్ళు కార్యక్రమాలను నిర్వహించడం వలన ఏ సంకేతాన్ని సమాజానికి ఇవ్వగలరు? వాళ్లేo అర్థం చేసుకోవాలి. "కార్యక్రమం యొక్క ప్రయోజనం, సామాజిక పరివర్తన, దుర్ వ్యసనాలను మానుకోవడం, శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆస్వాదించడం, సమానత్వం అంతరాలు లేని వ్యవస్థను ఆశించడం, ఆ వైపుగా పయనించే విధంగా ప్రోత్సహించడం, ప్రశ్నించే తత్వాన్ని పెంచడం, పాలకులు అధికార యంత్రాంగం యాజమాన్యాల యొక్క బాధ్యతలను గుర్తింప చేయడంతో పాటు ప్రభుత్వాల యొక్క ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను కూడా ప్రతిఘటించే చైతన్యాన్ని సమాజంలో ప్రజల్లో ప్రజాస్వామ్యవాదులలో ఇలాంటి సభలు సమావేశాలకు హాజరైన ప్రతినిధులలో కల్పించవలసిన అవసరం ఉంది. ఇవే నిజంగా అందించే పురస్కారాలు, సభల లక్ష్యం కావాలి".
Ex.. ఇక మరికొన్నిచోట్ల ఒక ఆదర్శ ఉపాధ్యాయునిగా ఏనాడు కొనసాగని ఆ రంగం మీద సదభిప్రాయం లేని కేవలం ఆకర్షణ పథకాలతో సమాజంలోని కొంతమంది పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయంతో ఉనికిలో ఉంటూ సంస్థలను ఏర్పాటు చేసి తద్వారా పురస్కారాలను ప్రధానం చేయడం అంటే నేల విడిచి సాము చేయడమే. తనకు అర్హత లేకుండా ఇతరులకు పురస్కారాలను ఇవ్వడం అంటే నైతికత ఏ పాటిదో తనకు తానే ప్రశ్నించుకోవాల్సి ఉంటుంది. ఇక గమ్మత్తయిన విషయం ఏమిటంటే పురస్కారాలు సన్మానాలను వేరువేరుగా చూడాల్సిన బదులు ఏ రంగంలో రాణించకపోయినా ప్రత్యేకతను కనపరచకపోయినా అదే వేదికల మీద జ్ఞాపికలు శాలువాలతో సత్కరించడం పురస్కారాల ప్రధానం అని ప్రకటించడం ఏ రకంగా సబబుగా ఉంటుంది? కుల సంఘాలు మత సంఘాలు ఎవరిని పక్కన పెడితే ఏమనుకుంటారో అనే ఉద్దేశంతో హాజరైన వ్యక్తులలో పలుకుబడి గల వాళ్లను, తెల్ల బట్టల వా ల్లను ఏ రంగంలో నిష్ణాతులు కాకపోయినా ఆ సభా వేదిక లక్ష్యానికి సంబంధించిన పరిజ్ఞానం లేకపోయినా జ్ఞాపికలు చేతిలో పెట్టి, మెడలో శాలువా చుట్టి, పెద్దగా ఫోటోలు దిగి, సామాజిక మాధ్యమాలలో పెట్టుకొని ప్రచారం చేసుకుంటారు. కాని ఆయా రంగాలలో కొద్దో గొప్పో ప్రావీణ్యత ప్రవేశం ఉన్నటువంటి నిపుణులను ఆహ్వానించకుండా వారిని గుర్తించకుండా నిర్వాహకులు తమ అధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న సందర్భాలను తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది ."ఇచ్చే సంస్థకు అర్హత ఉండాలి తీసుకునే వ్యక్తికి సంబంధించి ఆయా ఎంపిక చేసిన రంగంలో ప్రవేశము ప్రావీణ్యత ఉండాలి.
వాళ్లు కూడా ఆ పురస్కారాన్ని తీసుకోవడం ద్వారా తోటి సమాజానికి ఆయా రంగాలలో కొంతైనా ప్రేరణ కల్పించగలగాలి.తద్వారా ప్రేరణ పొందడానికి ప్రజలు ప్రజాస్వామ్యవాదులు సిద్ధంగా ఉండడానికి మాత్రమే పురస్కారాలు తోడ్పడాలి. కానీ హాజరైన వాళ్లందరికీ ఇచ్చేవి పురస్కారాలు కానే కావు. అది కేవలం మభ్యపెట్టడం అలిగి పోకుండా చూసుకొని అందలం ఎక్కడానికి అవకాశాన్ని వినియోగించుకోవడమే అవుతుంది. స్థాన కాల పరిస్థితులకు అతీతంగా ప్రతి ప్రాంతంలో కొనసాగుతున్నటువంటి ఈ విధానం ఏ రకంగాను సమాజానికి,భవిష్యత్తుకు,మనం ఎంచుకున్న అభివృద్ధి నైపుణ్యంతో కూడుకున్నటువంటి దేశాభివృద్ధికి సూచికలు కానేకావు. "సభ ఉద్దేశం తెలియనివాడు సభాధ్యక్షుత వహిస్తాడు. కార్యక్రమం యొక్క అర్థం తెలియని వాళ్ళు కామెంట్ చేస్తారు. పలుకుబడి గల వాళ్లు వేదిక మీద పురస్కారాల పేరు చెప్పి మెమొంటోళ్లు శాలువాలు కప్పుకుంటారు. సన్మానం అంటే ఆ రంగంలో లేదా సంస్థకు కష్టపడి కృషిచేసి ప్రోత్సహించిన వారికి సన్మానం చేస్తే అందులో అభ్యంతరం లేదు కానీ పురస్కారాల పేరుతో ప్రకటించినప్పుడు వాళ్లు ఏ రంగంలో నిష్ణాతులో ప్రకటించి అందుకు సంబంధించిన ఆనవాళ్లను పరిశీలించకుండా గుర్తింపు ఇవ్వడం ద్వారా ఎవరికి కూడా ఒరిగేది ఏమీ లేదు. ఆ వ్యక్తి ఎవరిని కూడా మోటివేట్ చేయలేడు. సమాజానికి తన యొక్క అనుభవాలను పంచలేడు. ఎందుకంటే ఆ రంగంలో ఎలాంటి అనుభవాలు లేవు కనుక
పురస్కార గ్రహీతల సామాజిక బాధ్యత
"ఎంచుకున్న రంగంలో దశాబ్దాలు కొన్ని కొన్ని ఏళ్ల పాటు చేసినటువంటి కృషి, సాధించిన ఫలితము, ప్రయోగము, అనుభవము, ప్రతిపాదించిన సిద్ధాంతము, సామాజిక చింతన తో రాసినటువంటి సాహిత్యము, సామాజిక ఉద్యమనేపధ్యం, తమ తమ అనుభవాలలో గడించినటువంటి అనేక రకాల నైపుణ్యాలు సన్నివేశాల ఆధారంగా ఈ వ్యవస్థ యొక్క మార్పు కోసం కష్టపడాల్సి ఉంటుందని ప్రేరణగా పని చేయాలని జనాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మాత్రమే సంస్థలు లేదా ప్రభుత్వాలు పురస్కారాలను ఇస్తూ ఉంటాయి. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే భారతదేశంలో అత్యంత అరుదైన ప్రతిష్టాత్మకమైనటువంటి భారతరత్న పురస్కారాన్ని కేవలం క్రికెట్ రంగంలో కొంతకాలంలో చేసిన సెంచరీలను గుర్తించి సచిన్ టెండూల్కర్ గారికి ఇవ్వడం జరిగింది. ఇందుకోసం అవసరమైనటువంటి రాజ్యాంగ సవరణ కూడా చేశారు మరి తద్వారా ఏ రకమైనటువంటి సామాజిక పరిణతికి దారి తీసింది పాలకులు తెలియజేయాలి. అదే సామాజిక సిద్ధాంతాలు, శాస్త్రీయ పరిశోధనలు, నూతన ఆవిష్కరణలు చేసినటువంటి వారికి కనీస మైనటువంటి గుర్తింపు కూడా లేదు. అలాగే వేదికల మీద జరుగుతున్నటువంటి ఈ పురస్కారాలు సన్మానాల తంతు కూడా పలుకుబడి కోసం మాత్రమే కొనసాగుతున్నది.ఆ రకమైనటువంటి ధోరణిని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. తద్వారా వ్యవస్థకు మేలు జరగకపోగా స్వార్థం పెరిగి, ఆధిపత్యం ఆవరించి, అసమానతలు అంతరాలు మరింతగా చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. "జాతీయ అంతర్జాతీయ పురస్కారాలతో పాటు స్థానిక పురస్కారాల వరకు కూడా ఒక లక్ష్యం, ఆ రంగంలో నైపుణ్యం ఆధారంగా చేసుకుని మాత్రమే ప్రకటించి ప్రధానం చేయాలి. కానీ పదవి, పేరు, పరిచయం కోసం, ఏమనుకుంటారో అనే ముభావంతో ప్రకటిస్తే ప్రధానం చేస్తే అంతకుమించినటువంటి సామాజిక ద్రోహం మరొకటి ఉండదు. ఎందుకంటే వారి వల్ల ఏ రకమైన ప్రయోజనం సమాజానికి జరగదు."
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )