విధి వచించిన...వెన్ను చూపని పోరాటం
అనారోగ్యంతో అల్లాడుతున్న 'పంచర్' సైదులు...
రెక్కాడితే గానీ డొక్కాడని స్థితి.. ఆదుకోవాలని ప్రభుత్వంపై ఆశలు...
తిరుమలగిరి 01 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:
తిరుమలగిరి మున్సిపాలిటీ లో వంగూరు సైదులు తన కాళ్లు సహకరించకపోయినా చేతులతోనే తన భవిష్యత్తును వెతుక్కున్నాడు.. పోలియో మహమ్మారి శరీరాన్ని కట్టడి చేసినా, కష్టపడే తత్వాన్ని మాత్రం ఆపలేకపోయింది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలానికి చెందిన వంగాల సైదులు కథ ఇది. చిన్నతనంలోనే రెండు కాళ్లు చచ్చుబడిపోయినా, ఎవరికీ భారం కాకూడదని చిన్న 'పంచర్' షాపును ఏర్పాటు చేసుకున్నాడు. ఎండనక, వాననక చక్రాల మధ్యే గడుపుతూ కుటుంబాన్ని సాకుతున్నాడు. అయితే, ప్రస్తుతం ఆయనను అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో ఆ కుటుంబం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది.
కష్టాన్ని నమ్ముకున్నా.. కాలం సహకరించడం లేదు
రోజంతా టైర్లు విప్పుతూ, పంచర్లు వేస్తూ వచ్చే కొద్దిపాటి ఆదాయంతోనే సైదులు తన భార్యాపిల్లలను పోషిస్తున్నాడు. శారీరక వైకల్యం ఉన్నప్పటికీ పట్టుదలతో పని చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచాడు. కానీ, గత కొంతకాలంగా ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో పని చేయడం భారంగా మారింది. చేతిలో చిల్లిగవ్వ లేక, సరైన వైద్యం చేయించుకోలేక ఆవేదన చెందుతున్నాడు. "ఒకప్పుడు నా కష్టంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చాను, ఇప్పుడు నా శరీరమే నాకు సహకరించడం లేదు" అని ఆయన కన్నీటి పర్యంతమవుతున్నారు.
ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూపు
తన దీన స్థితిని చూసి ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నాడు. వైద్య ఖర్చుల కోసం మరియు కుటుంబ పోషణ కోసం ప్రభుత్వం లేదా దాతలు ఉదారతతో ముందుకు వచ్చి ఆదుకోవాలని వేడుకుంటున్నాడు. జిల్లా యంత్రాంగం స్పందించి తమ కుటుంబానికి భరోసా కల్పించాలని తిరుమలగిరి గ్రామస్తులు కూడా కోరుతున్నారు.