ప్రభుత్వ విద్యారంగ బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి
వూర రామ్మూర్తి యాదవ్ 18వ వార్డ్ కౌన్సిలర్.
ప్రభుత్వ విద్యారంగ బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి. వూర రామ్మూర్తి యాదవ్ 18వ వార్డ్ కౌన్సిలర్.
విద్యతోనే ఏదైనా సాధ్యం.
జంక్ ఫుడ్ కు పిల్లలను దూరంగా ఉంచాలి.
సొంత ఖర్చులతో ప్రైవేట్ పాఠశాలలు దీటుగా విద్యార్థులకు ఉచితంగా షూ, టై,బెల్టు అందజేస్తా.
త్వరలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత కంటి దంత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తా.
సూర్యాపేట టౌన్, 20 జూన్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్ :- ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని ప్రముఖ డాక్టర్ 18 వ వార్డు కౌన్సిలర్ వూర రామ్మూర్తి యాదవ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని 18 వ వార్డు విజయ కాలనీలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ పంపిణీ చేసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం 250 కోట్లకు పైగా వ్యయంతో ఇంటిగ్రేటెడ్ స్కూలు ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తుందని తెలిపారు. అదేవిధంగా రాష్ట్రప్రభుత్వం వైద్యాన్ని కూడా పెద్దపీట వేస్తుందన్నారు. విద్యతోనే ఏదైనా సాధ్యమని విద్యార్థులు గ్రహించి ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని ఆ దిశగా క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలన్నారు. తల్లిదండ్రులు విద్యార్థుల ఆహార నియమాలు సైతం జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా జంక్ ఫుడ్ ను దూరంగా ఉంచాలని తెలిపారు.
బాల్యంలోనే దీర్ఘకాలిక రోగాలకు కారణమైన కూల్ డ్రింక్స్ బేకరీ ఫుడ్ స్వీట్స్ పిల్లల చేత తినిపించవద్దని తెలిపారు. విద్యార్థుల జ్ఞాపక శక్తికి, ఎదుగుదలకు అవసరమైన ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని ముఖ్యంగా కోడిగుడ్డు, జావా వంటి వాటిలో అధిక పోషకాలు ఉంటాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల లో ప్రస్తుతం విద్యార్థులకు మెరుగైన వసతులు ఉన్నాయని తల్లిదండ్రులు తలకు మించిన భారంతో కార్పొరేట్ స్కూళ్లకు పరిగెత్తకుండా ప్రభుత్వ బడులు చేర్పించి విద్యార్థుల భవిష్యత్తును బంగారంల తీర్చిదిద్దాలన్నారు. తన వంతు సహాయంగా కార్పొరేట్ పాఠశాలల్లోని విద్యార్థులకు దీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు త్వరలోనే టై బెల్ట్ షూ అందిస్తానని తెలిపారు.
విద్యార్థుల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఉచితంగా వైద్య శిబిరం నిర్వహించి కంటి, దంత పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో సైతం అడ్మిషన్ల కోసం క్యూ కట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన సౌకర్యాలు ఉత్తమ బోధన అందిస్తుందన్నారు. విజయ కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీ ప్రైమరీ క్లాసెస్ ఏర్పాటు చేయడం జరిగిందని తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలన్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ చంద్రు నాయక్ పాఠశాల హెచ్ఎం కొంపెల్లి సుశీల వార్డ్ అధికారి నాగార్జున నాయకులు కరుణాకర్ రెడ్డి, ధరావత్ నిఖిల్, వంశీ, ప్రేమ్ కుమార్, పుష్ప,రమేష్,చాంప్ల, సైదులు ఆర్పి శైలజ పాల్గొన్నారు.