పోషకాహారం చిన్నారుల ఆరోగ్యానికి పునాది: జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి
హనుమకొండ:17 ఏప్రిల్ 2026 :- పోషకాహారం చిన్నారుల ఆరోగ్యానికి పునాదియని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు. శనివారం హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ రైతు వేదికలో పోషణ్ పక్వాడ వారోత్సవాలలో భాగంగా మండల స్థాయి పోషణ్ మేళా కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి హాజరై పలు కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన పూర్వ ప్రాథమిక విద్యార్థుల ఎగ్జిబిషన్, స్థానికంగా లభించే వనరులతో తయారు చేసే పోషకాహార పదార్థాల స్టాల్స్, చిరుధాన్యాలతో కూడిన ఆహార ప్రదర్శనలను కలెక్టర్ సందర్శించారు.
పలు అంగన్వాడీ కేంద్రాలకు చెందిన చిన్నారులకు కలెక్టర్ సమక్షంలో అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. కొత్తగా చేరిన చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం కూడా చేపట్టారు. పూర్వ ప్రాథమిక విద్యార్థులకు కలెక్టర్ చేతుల మీదుగా దుస్తులు పంపిణీ చేశారు. విద్యార్థుల ప్రగతి రికార్డులను పరిశీలించి, వారి అభివృద్ధిపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు యోగా శిక్షణ ఇవ్వాలని సూచించారు. ప్రతి రోజు కరెక్యులంలో భాగంగా కనీసం 15 నిమిషాల పాటు యోగా చేయించాలని సూచించారు. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను గర్భిణీలు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా అందిస్తున్న పౌష్టికాహారాన్ని వినియోగించడంతో పాటు ఇంటి వద్ద కూడా పౌష్టికాహారం తీసుకోవాలని తెలిపారు. మహిళలు రక్తహీనత సమస్యకు గురికాకుండా ఉండేందుకు ప్రోటీన్లు, ఫైబర్, ఐరన్ సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవాలని సూచించారు. గర్భిణీలు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని పేర్కొన్నారు. అంగన్వాడీ సిబ్బంది ఎర్లీ చైల్డ్ హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించి, స్థానికులు ఈ సేవలను వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కడిపికొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ భజన్ లాల్, కాజీపేట తహసీల్దార్ రాజు, ఎంఈఓ మనోజ్ కుమార్, ఆయుష్ విభాగం జిల్లా ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ భాను ప్రకాష్, అంగన్వాడీ సూపర్వైజర్లు సృజన, రజిత, కవిత, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, గర్భిణీలు, బాలింతలు, పూర్వ ప్రాథమిక విద్యార్థులు మరియు వారి తల్లులు పాల్గొన్నారు.