అంగన్వాడీ కేంద్రాలను సమర్ధవంతంగా నిర్వహించాలి
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి.
చిన్నారులతో ముచ్చటించిన జిల్లా కలెక్టర్.
జోగులాంబ గద్వాల 18 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి :- అంగన్వాడి కేంద్రాల ద్వారా సరఫరా చేసే పౌష్టికాహారాన్ని లబ్ధిదారులకు సక్రమంగా అందజేస్తూ సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. శనివారం గట్టు మండలం చమన్ ఖాన్ దొడ్డి గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడి చిన్నారులతో కలెక్టర్ ముచ్చటించారు. పాఠశాల విద్యార్థులతో వారు నేర్చుకున్న అంశాలను చదివించి ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గట్టు మండలం ఆస్పిరషనల్ బ్లాక్ గా ఉందని, సంపూర్ణత అభియాన్ కార్యక్రమం లో ఉన్న 7 అంశాలను 100% జరిగేలా చూడాలని, అంగన్వాడి కేంద్రాలకు వచ్చే గుడ్ల పరిమాణం తక్కువగా ఉంటే వాపస్ పంపించాలని అక్కడి అధికారులను ఆదేశించారు. పలువురు చిన్నారుల ఎత్తు, బరువు కొలతలను పరిశీలించి తగు సూచనలు చేశారు. వండిన ఆహారాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో వివిధ పాఠ్యాంశాలను చదివించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు గురించి మాట్లాడారు. అంతకుముందు గ్రామంలో నిర్మాణంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. మరుగుదొడ్లను నాణ్యతతో నిర్మించాలని, నిబంధనలను ఉల్లంఘిస్తే తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా కలెక్టర్ సంబంధిత అధికారులను హెచ్చరించారు.
ఈ పర్యటనలో ఐసిడిఎస్ సిడిపిఓ హేమలత, సూపర్వైజర్ కృష్ణవేణి, పంచాయతీరాజ్ ఏఈ రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.