పాక్‌లో సంకీర్ణం

Feb 14, 2024 - 14:22
Feb 15, 2024 - 00:31
 0  9
పాక్‌లో సంకీర్ణం

. పార్టీల ముమ్మర కసరత్తు
. ఎంవీఎంతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: పీటీఐ
. స్వతంత్రులు మెజారిటీ నిరూపించుకుంటే విపక్షంగా ఉంటాం: పీఎంఎల్‌`ఎన్‌
. నాల్గోసారి ప్రధానిగా నవాజ్‌ షరీఫ్‌ : షెహబాజ్‌

ఇస్లామాబాద్‌/లాహోర్‌ : పాకిస్థాన్‌లో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఐక్యరాజ్య సమితితో పాటు ప్రపంచ దేశాలన్నీ ఈ దేశ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి. ఆర్థిక సంక్షోభంతో పాటు అనేక సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న పాకిస్థాన్‌ భవిష్యత్‌ ఏమిటన్న ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది. అక్కడి పార్టీలు ఎవరికి వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తుండటం చర్చనీయాంశమైంది. ఈ పరిస్థితుల్లో సంకీర్ణం ఏర్పడుతుందా లేక స్వతంత్రులు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా అన్న ప్రశ్న తెరపైకొచ్చింది. దీంతో రాజకీయ అనిశ్చితి, అస్పష్టత నెలకొన్నాయి. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అతిపెద్ద పార్టీగా పీఎంఎల్‌ఎన్‌ ఆవిర్భవించినట్లు ఎన్నిక సంఘం ప్రకటించింది కానీ రిగ్గింగ్‌ జరిగిందని పీటీఐ తీవ్రంగా ఆరోపించింది. ‘మెజారిటీ సాధించాం కాబట్టి మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. కేంద్రంలోనే కాకుండా పంజాబ్‌లోనూ’ అంటూ పీటీఐ ప్రకటించింది. మజ్లిస్‌ వహదత్‌ ఏ ముస్లిమీన్‌ (ఎంవీఎం) పార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పీటీఐ అధికార ప్రతినిధి రౌఫ్‌ హసన్‌ మంగళవారం ప్రకటించారు. ఇస్లామాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పీటీఐ వ్యవస్థాపకుడు ఇమ్రాన్‌ ఖాన్‌ ఆమోదంతోనే ఎంవీఎంతో అవగాహన కుదిరినట్లు తెలిపారు. ఖైబర్‌ పక్తుంఖ్వాలో రిజర్వ్‌డ్‌ స్థానాల కోసం జమాత్‌ ఏ ఇస్లామీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు చెప్పారు. ఎవరు గెలిస్తే వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి... అది వారి హక్కు అని ఇమ్రాన్‌ ఖాన్‌ సందేశమిచ్చారని హసన్‌ అన్నారు. ప్రక్రియను ప్రభావితం చేయాలని చూసే వారు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. పీఎంఎల్‌ఎన్‌ లేక పీపీపీని తమ పొత్తు ప్రసక్తేల లేదని, ఆ పార్టీలంటే తమకు గిట్టదని పీటీఐ అధ్యక్షుడు గోహర్‌ అలీ ఖాన్‌ తేల్చిచెప్పారు. ఆ రెండు పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కంటే ప్రతిపక్షంగా ఉండటం ఎంతో మేలన్నారు. మెజారిటీ ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అలీ ఖాన్‌ తెలిపారు. పీటీఐ నాయకుల వ్యాఖ్యలపై పీఎంఎల్‌ఎన్‌ అధ్యక్షుడు షెహబాజ్‌ షరీఫ్‌ స్పందించారు. లాహోర్‌లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించి తమది అతిపెద్ద పార్టీ అని ప్రకటించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని స్వతంత్ర అభ్యర్థులు భావిస్తే అభ్యంతరం లేదని, తాము ప్రతిపక్ష పార్టీగా ఉంటామని అన్నారు. ‘గెలిచిన స్వతంత్ర అభ్యర్థుల సంఖ్య ఎక్కువగానే ఉందన్నది వాస్తవం. దీనిని తిరస్కరించలేం కానీ పార్టీల్లో పీఎంఎల్‌ఎన్‌ నంబర్‌ వన్‌గా ఉంది. ఆ తర్వాత స్థానంలో పీపీపీ నిలిచింది. ఫలితాలు వచ్చాయి కాబట్టి కొత్త దశలోకి అడుగుపెట్టాల్సిన సమయం ఆశన్నమైంది. పీటీఐ లేక పీటీఐ యేతరుల మద్దతున్న స్వతంత్రులు ఒకవేళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తే అధ్యక్షుడి నుంచి ఆహ్వానం అందదు. మెజారిటీని నిరూపించుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగితే సరే… అభ్యంతరం లేదు. రాజ్యాంగబద్ధ పాత్ర పోషిస్తూ ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం. అలా జరగని పక్షంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే హక్కు ఇతర పార్టీలకు ఉంది. న్యాయబద్ధ, ప్రజాస్వామ్యబద్ధమైన పద్ధతి ప్రకారం ప్రభుత్వం ఏర్పాటు దిశగా ముందుకెళ్లి తదుపరి దశను ఖరారు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రాజకీయ పక్షాలు తమ విభేదాలను మర్చి… సవాళ్లను అధిగమించేందుకు కలిసి రావాలి’ అని షెహబాజ్‌ అన్నారు. పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ నవాజ్‌ (పీఎంఎల్‌ఎన్‌) అధ్యక్షుడు నవాజ్‌ షరీఫ్‌ దేశానికి నాల్గోసారి ప్రధాని అవుతారని దీమాగా చెప్పారు. ప్రధాని పగ్గాలను నవాజ్‌ చేపడతారన్న మాటలకు కట్టుబడి ఉన్నానన్నారు. ‘రిగ్గింగ్‌ ఆరోపణలు రాని ఎన్నికలు ఏమైనా ఉన్నాయా? ఖైబర్‌ ఫక్తుంఖ్వాలో స్వతంత్రులు మెజారిటీ సాధించారు. అంటే అక్కడ రిగ్గింగ్‌ జరినట్టా? సింధ్‌, బలోచిస్థాన్‌లో స్వతంత్రలు ఎవరూ గెలవలేదు. 2018లో మా పార్టీ ఓడిపోయినప్పుడు నల్ల బ్యాండ్లతో పార్లమెంటుకు వెళ్లామే తప్ప ఎవరినీ నిందించలేదు, ధర్నాలు చేయలేదు (పీటీఐ నిరసనలనుద్దేశించి). స్వతంత్రులు గెలుస్తున్నారు... పార్టీలు ఓడిపోతున్నాయన్న ప్రచారం తగదు’ అని షెహబాజ్‌ అన్నారు.అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌)తో కొత్త ఒప్పందంపై ప్రశ్నకు ‘నిస్పందేహంగా’ అంటూ ఆయన బదులిచ్చారు. దేశ ఆర్థిక స్థితి దృష్ట్యా ఐఎంఎఫ్‌ ప్యాకేజి అనివార్యమన్నారు. పీఎంఎల్‌ఎన్‌లోకి నేతల ఫిరాయింపులపై ప్రశ్నకు అందులో తప్పేముందని షెహబాజ్‌ ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారమప్పుడు తమ పార్టీపై పీటీఐ తీవ్రస్థాయిలో విమర్శించినప్పటికీ పీటీఐ మద్దతున్న స్వతంత్రులు కోరుకుంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని నవాజ్‌ షరీఫ్‌ అన్నారని చెప్పారు. మేము మా పాఠాన్ని నేర్చుకున్నామని ప్రపంచానికి తెలియజేయాలి… ఇక్బాల్‌, క్వైద్‌ ఆకాంక్షించిన పాకిస్థాన్‌ను నిర్మించుకోవాలి అని షెహబాజ్‌ అన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333