ట్రంపు...! ఆపు నీ కుట్రాజకీయపు కంపు..!

Mar 2, 2026 - 00:25
Mar 2, 2026 - 00:43
 0  3
ట్రంపు...! ఆపు నీ కుట్రాజకీయపు కంపు..!

ప్రపంచ నియంతలు హిట్లర్... ముస్సోలీని... కాలగర్భంలో కలిసిపోయారు... ప్రపంచ దేశాలపై నీ పెత్తనం ఎన్నాళ్ళు ట్రంప్...!! నీకు కూడా తప్పదు నియంతల గతి... పడుతుంది ఎప్పుడో ఒకసారి ట్రంప్ కార్డు

ఎనిమిది యుద్దాల ను ఆపిన అని బీరాలు పలికిన అమెరికా అధ్యక్షా... సాటి దేశాలపై నీ ప్రతాపమేంది...?

నోబెల్ శాంతి బహుమతి రాలేదనా, ఇరాన్ ఇజ్రాయిల్ మధ్యన చిచ్చు పెట్టిన యుద్ధ పిపాసి....?*మీ ఆయుధాలు అమ్ముకోవడానికి దేశాల మధ్య చిచ్చు పెట్టి, మానవజాతిని నాశనం చేసి మరణ మృదంగం మోగిస్తావా...?

యుద్ధం ఓ మరణ మృదంగం... మానవజాతి మనుగడకే కష్టం....యుద్ధం... ఏ దేశానికి మంచిది కాదు...!

మూడో ప్రపంచ యుద్ధం ముంచుకు రానుందా...?

✍️ డాక్టర్ కృష్ణ బంటు, సీనియర్ జర్నలిస్ట్, హ్యూమనిస్ట్, సామాజిక, ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు

యుద్ధం... యుద్ధం... యుద్ధం... ఈ మాటలు వింటేనే మానవజాతి మనుగడ ఉంటుందా లేదా అన్న సందేహాలు వ్యక్తం అవుతుంటాయి. యుద్ధం అంటేనే మనిషిని మనిషిని చంపుకోవడం. ఆర్థిక వనరులపై దెబ్బతీయటం. దేశాల సంపదపై వేటు వేయడం. దేశంలో నివసిస్తున్న పౌరుల ప్రాణాలను హరించటం. యుద్ధం మొదలైంది అంటే చాలు కంటిమీద కునుకు లేకుండా మానవజాతి మొత్తం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని, పట్టుకొని బతకాల్సిన పరిస్థితులు. పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్టుగా ఉంటుంది యుద్ధం చేసే దేశాల పరిస్థితి. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా ఉంటుంది ఇరుదేశాలకు మద్దతు పలుకుతూ, యుద్ధ విరమణకు నచ్చ చెప్పే మిత్ర దేశాల స్థితి. ప్రపంచ దేశాలన్నీ ఏదో ఒక దేశానికి మద్దతు ఇవ్వకుండా తప్పని పరిస్థితి. ప్రపంచ దేశాలన్నీ రెండు కూటములుగా ఏర్పడి తమ తమ మిత్ర దేశాన్ని కాపాడుకోవడానికి అవసరమైతే రంగంలోకి దిగి యుద్ధం చేయాల్సిన వాతావరణం నెలకొని ఉంటుంది. ఇలా ఒక చిన్న విషయంలో ఘర్షణ లాగా మొదలైన తగాదా చిన్న చిన్నగా పెరిగి పెద్దదై యుద్ధానికి దారి తీసి దేశాల మధ్య చిచ్చుపెట్టే స్థాయికి వెళ్ళిపోతుంది. ఒకప్పుడు అంటే యుద్ధాలు చేయడానికి గుర్రాల మీద వెళ్లేవారు. కత్తులు బట్టి, కర్ర సాము చేస్తూ సాంప్రదాయ పద్ధతిలో ఇరువురు తలపడుతూ యుద్ధం చేసేవారు. ఇప్పుడు అలాంటి రాజులు లేరు, రాజ్యాలు లేవు, కత్తులు, కటార్లు అసలే లేవు. ఇప్పుడు అంతా ఆటంబాంబుల యుగం. మిస్సైల్స్, డ్రోన్స్, రాకెట్ లాంచర్లు, ప్రత్యేక యుద్ధ విమానాలతో, అవసరమైతే రసాయనిక బాంబులతో, అణువిస్పోటలను చిందిస్తూ మానవజాతి అంతా క్షణంలో తుడిచిపెట్టుకుపోయే విధ్వంసకరయుద్ధం. ఎవరు ఎక్కడ ఉంటారో తెలియదు, ఏ బాంబు ఎక్కడ పడుతుందో తెలియదు, ఎక్కడ నుంచి ఏమి ప్రయోగిస్తారో తెలియదు, ఎక్కడి నుంచి రాకెట్ సర్రున దూసుకు వస్తుందో, ఎన్ని వేల, లక్షల మంది ప్రాణాలు గాల్లో కలుస్తాయో తెలియని అయోమయ పరిస్థితి. అలాగా ఆధునిక టెక్నాలజీతో,శాస్త్ర సాంకేతిక రంగాలలో సాధించిన ప్రగతితో మంచికే కాకుండా చెడుకు కూడా యుద్ధం కూడా తన రూట్ ని మార్చుకుంది. ఇప్పటికే రెండు ప్రపంచ యుద్ధాలతో మానవజాతి అతలాకుతలం అయిన పరిస్థితుల్లో మూడో ప్రపంచ యుద్ధానికి నాంది ప్రస్తావనగా ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం నిలుస్తుందా అన్న సందేహాలు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్నాయి.

పశ్చిమ ఆసియా దేశాలలో ఒక్కసారిగా యుద్ధ జ్వాలలు రగిలాయి. గత కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా రాకెట్ లాంచర్లు, వైమానిక దాడులు, డ్రోన్ ప్రయోగాలతో దద్దరిల్లింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా కుమేని నీ మట్టు పెట్టడమే లక్ష్యంగా శనివారం నుంచి ఇజ్రాయిల్, అమెరికా సహాయంతో ప్రయోగించిన క్షిపణులు, వైమానిక దాడుల్లో విజయం సాధించామని, కుమేని అంతమయ్యా డని ఇజ్రాయిల్ చెప్తుండగా, సురక్షిత ప్రదేశంలోనే ఉన్నాడని ఇరాన్ పేర్కొంటుంది. ఎవరు ఏమి చెప్పినా, పరిస్థితులు ఎలా ఉన్నా యుద్ధం ఏ దేశానికి మంచిది కాదు.

అమెరికా సామ్రాజ్య వాదానికి అంతం లేదా...?

ప్రపంచ పెద్దన్నగా పేరుగాంచి ప్రపంచంలోనే నెంబర్వన్ అగ్రరాజ్యంగా తానే ఉండాలని గత కొన్ని సంవత్సరాలుగా ఉరకలు వేస్తూ ఉవ్విళ్లు ఊరుతున్న అగ్రరాజ్యం అమెరికా ప్రపంచంలో ఏ దేశాన్ని కబలించాలన్నా ముందుగా ఒక ఎత్తుగడతో ఆ దేశంలో తన స్థావరాలను ఏర్పాటు చేస్తుంది. ఆయా దేశాలను పరిపాలిస్తున్న అధ్యక్షులు, ప్రజల మధ్య చిచ్చు తానే పెట్టి, తిరిగి తానే పరిష్కారం చూపుతున్నట్లు నటిస్తూ, ఆయా దేశాలపై యుద్ధం ప్రకటిస్తూ చిన్న చిన్న దేశాలను గడగడ వణికివణికించడం, తను చెప్పినట్లు వినేలా, నడుచుకునేలా చేయడం అమెరికాకు కొత్త ఏమీ కాదు. శాంతిభద్రతలు క్షీణించాయని, ప్రపంచ శాంతి కోసం అమెరికా పలు దేశాలలో బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకొని, చిన్నచిన్నగా రాజకీయాల్లో జోక్యం చేసుకొని, చివరికి ఆయా దేశాల అధ్యక్షులను సైతం పదవిని ఊడగొట్టి తాము చెప్పినట్టు వినే తాబేదారులను అధ్యక్ష స్థానంలో ఉంచడం అమెరికాకు కొత్త ఏమి కాదు. ఒక యుద్ధ కాంక్ష, ఒక యుద్ధ పిపాసి, అమితమైన రాజ్య కాంక్ష కలిగిన ది అమెరికా దేశం. ఒక దేశ పరిపాలన విషయంలో అమెరికా జోక్యం ఎందుకో, ఎవరికీ అర్థం కాదు. చిన్న చిన్న దేశాల మధ్య విద్వేషాలు రగిలించి, వాటికి చిచ్చుపెట్టి, యుద్ధం చేసుకునేలా ప్రోత్సహించి తిరిగి ఆదేశాలకు తానే ఆయుధాలను అమ్ముకునే ఒక గొప్ప గుణం అమెరికాది. ఒక్కో దేశాన్ని మెల్లమెల్లగా కబళిస్తూ తన రాజ్య కాంక్ష విస్తరణకు ఎన్నో కుట్రలు చేస్తూ తలతిక్క నిర్ణయాలతో ప్రజలను పిచ్చోళ్లను చేయటం అమెరికా ఏ అధ్యక్షుడికైనా చిన్ననాటి నుంచే పిజ్జా, బర్గర్లతో పెట్టిన విద్య. గతంలో ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేను కూడా మట్టుపెట్టిన తీరు అమెరికా అహంకారానికి ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. క్యూబా, వెనిజులా దేశాలపై కూడా అమెరికా తన పెత్తనాన్ని చూపించింది. కమ్యూనిస్టు దేశాలన్నిటిని ఒక్కొక్కటిగా విచ్ఛిన్నం చేస్తూ, పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ, అమెరికా అధ్యక్ష పదవి అనేది పిచ్చోడి చేతిలో రాయిలా మారింది. ఎప్పుడు ఏ దేశం పై దండయాత్ర చేస్తారో, ఏ దేశానికి లోపాయకారి మద్దతు అందిస్తారో, ఏ దేశం పై విరుచుకుపడతారో తెలియని గజిబిజి, గందరగోళ పరిస్థితులు ప్రపంచంలో నెలకొన్నాయి. 8 యుద్దాలను ఆపిన శాంతి దూత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరి ఈ యుద్ధాన్ని ఎందుకు ఆపలేదో, తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వనందుకు కక్షతో ఇలాంటి యుద్ధాలను ప్రేరేపించి నడిపిస్తున్నాడా. ఏ రెండు దేశాలు మిత్ర దేశంగా ఉంటే చూసి సహించలేక కుట్రలు చేసే దుష్ట సంస్కృతి అమెరికా రాజ్యాని దని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

*మూడో ప్రపంచ యుద్ధం ముంచుకు రానుందా...!*

ఇరాన్ ఇజ్రాయిల్ దేశాల మధ్యన రగిలిన యుద్ధ జ్వాల ప్రపంచ దేశాలను రెండు కూటములుగా మారేలా చేస్తుందా... మూడో ప్రపంచ యుద్ధం రానుందా... శాంతి నెలకొన నుందా... ఐక్యరాజ్యసమితి ఏ నిర్ణయం తీసుకోనుంది... ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయిల్ ప్రతినిధి చేసిన ప్రసంగానికి మద్దతు ఇచ్చే దేశాలు ఎన్ని, వ్యతిరేకించే దేశాలు ఎన్ని, ఇజ్రాయిల్ వెనక అమెరికా నుండి చేస్తున్న యుద్ధ తంత్రానికి కారణమేమిటి, తన జలసందిని ఇరాన్ మూసివేస్తే ప్రపంచంలో ఆయిల్ సంక్షోభం రానుందా, తిరిగి ఇరాన్ ఇజ్రాయిల్ ల మధ్య శాంతి చర్చలు జరిగి యుద్ధం లేని పరిస్థితులు తిరిగి ఏర్పడతాయా, తనపై ఇజ్రాయిల్, అమెరికా చేసిన దాడిని ఇరాన్ తిప్పికొడుతూ దుబాయ్, యూకే, సౌదీ అరేబియా దేశాలపై కూడా డ్రోన్ దాడులు చేయడం సమంజసమా, కాదా, ఇరాన్ పై యుద్ధాన్ని ఇప్పటికే రష్యా, చైనా ఖండించగా భారత్ తన వైఖరిని స్పష్టం చేయకపోవడంలోని కారణాలు ఏమిటి, కొరియా ఏ దేశం పక్షాన నిలవనుంది, మూడో ప్రపంచ యుద్ధమే వస్తే మానవజాతి మనుగడ పరిస్థితి ఏమిటి ఇలా ఎన్నో సందేహాలకు సమాధానాలు అందించలేక పోతుంది ఇరాన్ ఇజ్రాయిల్ మధ్యన నెలకొన్న దాడుల యుద్ధం. ఆధిపత్య పోరు కోసం దేశాల మధ్యన యుద్ధాలు చేసుకుంటారు. కానీ పౌరులు, ఏమీ తెలియని అమాయకులు, బాల బాలికలు, యువత చనిపోతుంటే వారి ప్రాణాలకు రక్షణ ఎవరు. మేము ఈ దేశాలలో పుట్టినందుకు మమ్మల్ని చంపే హక్కు ఎవరు ఇచ్చారని ఆ దేశ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ దేశాలకు బతుకుదెరువు కోసం వలస వచ్చిన వివిధ దేశాలకు చెందిన ప్రజలు బతుకుతున్నందున ప్రాణాలు పోతే ఎవరు బాధ్యులు. ఏది ఏమైనా యుద్ధం చేస్తే ఒక దేశం గెలవచ్చు, ఒక దేశం ఓడవచ్చు, ఒక కూటమి బాధపడవచ్చు, మరోకూటమి సంతోషంగా ఉండవచ్చు, కానీ యుద్ధంలో పాల్గొన్న ఏ దేశ ఆర్థిక పరిస్థితి అయినా అతలాకుతలం మానదు. జరిగిన ఆర్థిక రాష్ట్రాన్ని పూడ్చుకుని తిరిగి ఎప్పటి లాగా దేశంలో ఆర్థిక స్థితి ఉంచుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. కూలిపోయిన బిల్డింగులను, ధ్వంసమైన ప్రకృతిని, కార్యాలయాలను, దెబ్బతిన్న రోడ్లను తిరిగి పునరుద్ధరించాలంటే ఏ దేశానికైనా సంవత్సరాలు పడుతుంది. తిరిగి తీసుకురాలేని విలువైన పోయిన ప్రాణాలు ఎలాగూ తీసుకురాలేము. ఈ విధంగా యుద్ధం అంటేనే వనరుల నష్టం, మానవజాతికి నష్టం. అందుకే ఎంతటి పెద్ద సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కరించుకోవడమే ప్రస్తుత కాలంలో అనుసరించాల్సిన వ్యూహం. ఆ దిశగా అన్ని దేశాలు ఆలోచించాలని, యుద్ధరహిత ప్రపంచాన్ని మనమూ కోరుకుందాం.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333