సిద్ధాంతము నుండి ఆచరణ వరకు అలుపెరుగని బాటసారిగా కొనసాగితేనే ప్రజా కవి కాగలిగేది.
ఆత్మవిశ్వాసం ఆత్మగౌరవం సమాంతరంగా సాగాలి.
అహంకారం దరిచేరనిస్తే పతనం ఆరంభమైనట్లే .
వడ్డేపల్లి మల్లేశం
సిద్ధాంతం నుండి వైదొలగకుండా ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించే క్రమంలో గమ్యం ఎంత ప్రధానమో గమనం కూడా అంతే నిబద్ధతగా కొనసాగినప్పుడు మాత్రమే ఆశించిన ఫలితాలు కొంతవరకైనా సమకూరుతాయి . అది కూడా నిరంతరం కొనసాగినప్పుడే . వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొంత అటు ఇటుగా ఈ ఫలితాలు ఉన్నప్పటికీ సామాజిక స్పృహతో బాధ్యతగా సమాజము పట్ల నిబద్ధతగా పనిచేసే రంగాలలో మాత్రం సిద్ధాంతానికి అనుగుణమైన ఆచరణ కొనసాగినప్పుడే
రేఖామాత్రంగా నైనా ఫలితాలు కనిపించడం ప్రారంభమవుతుంది. ఆత్మవిశ్వాసం ఆత్మగౌరవం ఆలంబనగా ఆ ప్రయాణాన్ని నిరంతరం కొనసాగిస్తే కష్టాలు కన్నీళ్లు ఎదురైనప్పటికీ కొన్నిసార్లు విపలమైనా సాధ్యం కాని పరిస్థితులను తట్టుకున్న క్రమంలో మాత్రమే ఒక స్థాయికి చేరుకుంటాము ఆత్మ తృప్తి లభిస్తుంది . ఈ గమనం ఈ జీవనం కవికి, ప్రజాకవికి అనివార్యం . నిరంతరం సమాజాన్ని సందర్శిస్తూ, పరిశీలిస్తూ, పరిశోధిస్తూ, ప్రశ్నిస్తూ, అంచనా వేస్తూ, చర్చించినప్పుడు మాత్రమే ప్రజా సమస్యలు కవికి దృష్టికి వస్తాయి. ఊహ జగత్తులో ఊరేగి , కఠిన పదాలతో కవిత లల్లి, దీర్ఘ సమాసాలు వాక్యాలతో దీర్ఘము తీసి మాట్లాడినా, ప్రజలకు సంబంధం లేని, ప్రజలకు అర్థము కాని, ప్రజా జీవితము నుండి వెలివేయబడ్డ అంశాలు వల్లించినా అదే సాహిత్యం అనుకుంటే పొరపాటు .అందులో మనం మాట్లాడుకునేది ప్రజాసాహిత్యం. మరొక రకంగా " అభ్యుదయ భావజాలంతో కూడిన, సామాజిక మార్పుకు దోహదపడే, విప్లవాత్మక మార్పులతో, సమ సమాజాన్ని స్థాపించే దిశలో, సామాజిక ప్రయాణాన్ని కొనసాగించే సాహిత్యమే ప్రజా సాహిత్యం అని నిర్వచించుకున్నప్పుడు మాత్రమే ఆ వైపుగా అడుగులు పడతాయి. ఆచరణ కొనసాగుతుంది, ప్రశ్నలు ప్రతిఘటనలు చిక్కబడతాయి."
" సంక్షోభంలోకి నెట్టబడిన ప్రజా జీవితాన్ని వర్ణించడం, వ్యాఖ్యానించడం, కారణాలను విశ్లేషించడం, పరిష్కారాలను వెతకడం, బాధ్యులకు తగిన శిక్షను కూడా ఖరారు చేసే నైతిక ధైర్యము అర్హత ప్రజా కవికి ఉంటుంది. పొడి మాటలను తడి చేస్తే కవిత్వం అవుతుంది అనుకుంటే, అదే సాహిత్యమని భ్రమ పడితే, భ్రమల్లో జీవించే కవి ప్రజాకవి కాలేడు , సామాజిక బాధ్యతను మోయలేడు. సామాన్యుల జీవితాలకు అనుబంధంగా ఆరాటం పోరాటం ఉoడి, చాలీ చాలని కనీస అవసరాల మధ్యన నికృష్టంగా కాలం గడిపే వారి బతుకు చిత్రాన్ని వర్ణించకపోతే, కారకులను ప్రశ్నించకపోతే, ప్రజా క్షేత్రములో నిలదీయకపోతే ఇక మిగతా కవులకు ప్రజా కవులకు తేడా ఏముంటుంది ?"
పద లాలిత్యము మాత్రమే కాదు అర్గగా0 బిర్యం కూడా సాహిత్యానికి అవసరం . పదాల పొందిక మాత్రమే కాదు పరిష్కారాలు కూడా ముఖ్యం . ప్రజలకు ప్రతినిధిగా వ్యవహరించినప్పటికీ మొత్తం బాధ్యత తన భుజానికి వేసుకుంటే ప్రజా ఉద్యమం నీ రుగారిపోతుంది. కష్టపడేవాళ్ళు, దోపిడికి గురయ్యే వాళ్ళు, అవమానాల బారిన పడి అద్వాన్న జీవితం గడుపుతున్న వాళ్ళ నుండి కొంత ప్రతిఘటన వచ్చేలా చేసేది నిజమైన ప్రజా కవిత్వం. రాస్తున్న కవిత్వం పాలకుల దృష్టిలో పక్కదారి పట్టిందని, ఎదిరించే ధోరణితో ఆకాశాన్ని ఎరుపెక్కించే పదాలతో ఉద్యమ భావజాలంతో రథచక్రాలను పరుగెత్తిస్తున్నారని , మొదటికే మోసం వస్తుందని, ఎక్కడో ఒకచోట ఆపకపోతే ఉనికికే ప్రమాదమని, ప్రజలకు ద్రోహం తలపెట్టే పెట్టుబడిదారులు భూస్వాములు పారిశ్రామికవేత్తలు సంపన్న వర్గాలు రాజకీయ వర్గాలతో పాటు ప్రభుత్వాలు ఎప్పుడూ ప్రజా సాహిత్యం పైన ఆడిపోసుకుంటారు . కానీ ప్రజలకు కావాల్సింది మాత్రం నిర్లక్ష్యంగా దాటవేస్తూ, ప్రలోభాలు వాగ్దానాలు ఉచితాల పేరుతో తమ చేతిలో ఉంచుకుంటారు . యాచకులుగా అనాధలుగా మారుతున్న ప్రజానీకం రాజ్యాంగంలో హామీ ఇచ్చిన హక్కులు రక్షణలు ఎందుకు పొందలేకపోతున్నారనే సోయి పాలకులకు లేకపోవచ్చు కానీ ప్రజా కవులకు మాత్రం తప్పనిసరి. మాట్లాడిన ప్రతిచోట, చర్చించిన ప్రతి సందర్భంలో మనం కోల్పోతున్న హక్కులు ఏమిటి? ఎవరు దౌర్జన్యంగా దొంగలిస్తున్నారు? దానికి మన వైపున తీసుకోవలసిన ఆచరణను తప్పక కవి నిర్దేశించాలి. అదే సందర్భంలో వ్యవస్థను శాసించాలి. ఇంత ధైర్యం ఎలా వస్తుంది అనే వాళ్ళు లేకపోలేదు ఏమైనా జరిగితే రాజ్యం బలమత్తరమైనది, పెట్టుబడిదారీ వర్గం మరింత మోసపూరితమైనది, భూస్వామ్య వర్గం ప్రతిఘటన కు అయినా వెనుకాడనది కొండతో ఢీకొనడం అంటే అసంభవం అంటూ మన ప్రయాణాన్ని రద్దు చేయించి , వాయిదా వేసి , ఆ వైపు ఆలోచన లేకుండా చేసే వాళ్లు కూడా లేకపోలేదు . ఇలాంటి ఆటుపోట్లను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది ప్రజాకవి .
నిరంతరం స్ఫురించే ఆలోచనలో సమస్య సమాధానం, చిక్కుముడి పరిష్కారం తప్పకుండా చోటు చేసుకోవాలి. కాగితంలో రాసి దాచుకునేది కాదు సాహిత్యం ప్రజల కోసం పరితపించే, ప్రజా సంక్షేమాన్ని అభివృద్ధిని విశ్వసించే నిండైన ఉద్యమ ప్రవాహం, అభ్యుదయ భావజాలం. అభివృద్ధిని ఏ వ్యవస్థలోనైనా ఆకాంక్షించిన వాళ్లే ఎక్కువ అందుకే భారత సర్వోన్నత న్యాయస్థానం కూడా అభ్యుదయ భావజాలాన్ని, సమ సమాజ స్థాపన వైపుగా మనిషి ఆలోచన సరళిని, సామాజిక స్పృహను, సామాజిక బాధ్యతను మానవ సమూహం కలిగి ఉండడం ఆలోచించడం ఆచరించడం నేరం కాదు అని అనేక సందర్భాలలో పేర్కొన్నట్లు మనకు చరిత్ర చెబుతుంది. అదే సందర్భంలో వ్యక్తుల శరీరాలను నాశనం చేయగలరేమో కానీ భావాలను అభిప్రాయాలను ఆధునిక ధోరణులను కాదు అని స్వతంత్ర పోరాటంలో ఉవ్వెత్తున లేచిన కడలి తరంగం భగత్ సింగ్ తో పాటు విప్లవో ద్యమంలో పనిచేసిన వాళ్లంతా విశ్వసించిన అభిప్రాయం ప్రజా సాహిత్యానికి పునాది కావాలి .
తన ఆలోచన, ఆచరణ, ధోరణులు , ప్రతిభ పట్ల విశ్వాసం ఎంత ముఖ్యమో తన పట్ల తనకు గౌరవం కూడా అంతే ముఖ్యంగా కొనసాగినప్పుడు మాత్రమే వ్యక్తిగాను శక్తిగాను ప్రజాకవిగా రాణించగలరు. అదే సందర్భంలో అహంకారం మాత్రం కవులకు పనికిరాదు. తనకు తెలియని విషయాన్ని తెలుసుకునే క్రమంలో తెలిసింది చాలా తక్కువ అని భావించినప్పుడే అనేక కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కానీ తన ప్రతిభను చాటవలసిన సందర్భంలో పరీక్షలో పాల్గొన్న వేళ ఎదుర్కొంటున్న అన్ని ప్రశ్నలను కూడా సమయోచితంగా చదివి అన్నింటికీ సమాధానము తనకు తెలుసుననే ఆత్మ విశ్వాసంతో ముందుకెళ్ళినప్పుడు ఎక్కువ మొత్తంలో ప్రశ్నలకు సమాధానం రాసే అవకాశం ఉంటుంది . సానుకూల దృక్పథం సకల విజయాలకు మూలమనీ మానసిక వేత్తలు కూడా చెబుతున్న విషయం ప్రజాకవికి అనుసరణీయం. "ఆత్మస్థైర్యాన్ని ప్రదర్శిస్తే తనలో దాగివున్న అపారమైన శక్తి తట్టి లేపబడుతుంది . అహంకారంతో విర్రవీగితే తనలోని ప్రతిభ విషతుల్యమవుతుంది చివరికి తన పతనానికి నాంది అవుతోంది. సమాజంలోని భిన్న వర్గాలు తాడితాపీ డిత ప్రజానీకం కవులను తమకు ప్రతినిధులుగా ఎంచుకున్నారంటేనే అందులో ఎనలేని గౌరవం దాగి ఉన్నది. ఆ గౌరవాన్ని ప్రజల విశ్వాసాలను కాపాడడం ద్వారా సంస్కారాన్ని ప్రదర్శించి సమాజం ముందు వినయ విధేయతలతో వ్యవహరించడంతోపాటు అవసరమైన చోట తన పంజా విసిరి సామాజిక రుగ్మతలపై సమరభేరి మ్రోగించడం ప్రజాకవి యొక్క బాధ్యత .. ఆ వైపుగా కవులు కళాకారులు రచయితలు తమ కార్యాచరణను ప్రకటించుకోవడం, పరిశీలించుకోవడం, పరీక్షించుకోవడం చాలా అవసరం. .
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యు
దయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)