విద్య, వైద్యం పై జిల్లా కలెక్టర్ తేజస్ స్పెషల్ ఫోకస్
విద్య, వైద్యం పై జిల్లా కలెక్టర్ తేజస్ స్పెషల్ ఫోకస్
పేదోడి కి చదువు, వైద్యం కలెక్టర్ లక్ష్యం
సర్కార్ బడి బలోపేతం... సర్కార్ దవాఖానకు భరోసా
విద్యార్థుల భవిష్యత్తు... ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్...!
సూర్యాపేట జిల్లాలో విద్య, వైద్య రంగాలలో సమూల మార్పులు...!
ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, గురుకుల కళాశాలలు,ఆసుపత్రులపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి...!
సర్కారు బడిలోనే కార్పొరేట్ స్థాయివిద్య...!
సర్కారు ఆసుపత్రిలోనే కార్పొరేట్ స్థాయి వైద్యం...!
విద్యార్థులకు,వారి తల్లిదండ్రులకు, ప్రజలకు విద్య, వైద్యంపై కలెక్టర్ భరోసా... విద్య, వైద్యానికి మహర్దశ...!
కలెక్టర్ రూట్ మార్చారు...!*స్కూల్ , కళాశాల, ఆసుపత్రి బాటపట్టారు...!
✍️ డాక్టర్ కృష్ణ బంటు, పీహెచ్డీ & గోల్డ్ మెడలిస్ట్ ఇన్ జర్నలిజం, సీనియర్ ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్, రాష్ట్ర ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత...!
మానవ జీవితంలో చదువుకు, ఆరోగ్యానికి ఉన్న ప్రాధాన్యత మన అందరికీ తెలిసిందే. చదువు ద్వారా ఏ మనిషి అయినా తన జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు. "విద్య లేనివాడు వింత పశువు"అనే సామెత మనందరం వాడుతూనే ఉన్నాం. దొంగలు దోచుకుపోలేనిది, దొరలు ఎత్తుకు పోలేనిది, ఇతరులకు పంచేకొద్దీ పెరిగేది విద్య (విజ్ఞానం) మాత్రమే. విద్య ద్వారా జ్ఞానాన్ని సముపార్జించిన ప్రతిభావంతుడికి ఈ సమాజం ఎంతో గౌరవం అందిస్తుంది. డబ్బు ద్వారా వచ్చే డాబు,దర్పం, బడాయి,లడాయి అన్ని ఆశాశ్వతాలు. చక్కని విద్యను అభ్యసించి మంచి చదువరిగా మారి విజ్ఞానవంతుడిగా తయారయ్యే మనిషికి ఉన్న సభ్యత సంస్కారం విలువైనది, వెలకట్టలేనిది, నైతికతకు నిదర్శనంగా నిలుస్తుంది. విద్యకు జీవితంలో ఎంత ప్రాధాన్యత ఉందో అంతే స్థాయిలో ఆరోగ్యానికి కూడా అంతే విలువ ఉంది. ఒకసారి కోల్పోతే తిరిగి రావడం చాలా కష్టం అనేది ఆరోగ్యం విషయంలో అందరికీ తెలిసిందే. ఆరోగ్య వంతులు అంటే కేవలం శారీరకంగానే కాకుండా మానసిక ఆరోగ్యం, ఆర్థిక ఆరోగ్యం, సామాజిక ఆరోగ్యం ఒక మనిషిని పరిపూర్ణ మానవుడిగా మారుస్తాయి. ముఖ్యంగా ప్రతివారు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటేనే జీవితంలో తాము అనుకున్నా లక్ష్యాలను ఛేదిస్తూ గమ్యాన్ని చేరుకుంటారు." ఏ సౌండ్ మైండ్ ఇన్ , ఏ సౌండ్ బాడీ" అన్న నానుడి జగద్విథితం.,"ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్"అన్న ప్రకారం ఏదైనా వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స పొందడం కంటే వ్యాధి రాకుండా నివారించుకోవడం చాలా మేలు. ఈ విధంగా ప్రతి వారికి అత్యవసర విషయాలుగా ఉన్న విద్య, వైద్యం ప్రజలకు ముఖ్యంగా పేద విద్యార్థులకు, ప్రజలకు అందాలనే లక్ష్యంతో సూర్యాపేట జిల్లా యంగ్ అండ్ డైనమిక్ కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ విద్య, వైద్య రంగాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ తేజ సుడిగాలి పర్యటన చేస్తూ విద్య వైద్య రంగాలను కొత్త పుంతలు తొక్కిస్తున్న విషయంపై ప్రత్యేక స్టోరీ.
ఆకస్మిక తనిఖీలు, అత్యవసర సమీక్షలు, సమగ్ర విచారణలు, సత్వర పరిష్కారాలు, సమూల మార్పులతో విద్య, వైద్య రంగాల ప్రక్షాళన
ఉపాధ్యాయులు, వైద్యులు క్షేత్రస్థాయిలో ఉండాలి...! గీత దాటితే వేటు తప్పదన్న జిల్లా కలెక్టర్...!
కలెక్టర్ మిషన్... విద్యా ప్లస్ వైద్యం...!
రెండే లక్ష్యాలు.. చదువు... ఆరోగ్యం...! విద్యా వైద్యానికి కాయకల్ప చికిత్స...!
ప్రభుత్వం బడి ప్రభుత్వ దావకాన బలోపేతానికి కలెక్టర్ ప్రత్యేక కార్యాచరణ
విద్య, వైద్యం విలువ తెలిసిన సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ విద్య, వైద్యం బలోపేతానికి ప్రత్యేక కార్యచరణ చేపట్టారు. ప్రతివారం సమీక్ష చేయడమే కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటనలు విరివిగా చేస్తున్నారు. జిల్లా మొత్తం సుడిగాలి పర్యటనలు చేస్తూ ఆకస్మికంగా పాఠశాలలు, గురుకుల కళాశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులను సందర్శిస్తూ ఉపాధ్యాయులను, డాక్టర్లను, సిబ్బందిని ఎప్పటికప్పుడు తమ విధుల పట్ల బాధ్యతాయుతంగా మెలగాలని అప్రమత్తం చేస్తున్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన వారిపై చట్టపరమైన చర్యలకు వెనుకాడడం లేదు. అంతేకాకుండా జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో ఎప్పటికప్పుడు విద్య వైద్య రంగాలపై సమీక్షలు నిర్వహిస్తూ, తక్షణం అవసరమైన చర్యలను తీసుకుంటూ, భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తూ అందుకు అనుగుణంగా ముందుకు సాగుతున్నారు.
తాను టీచరుగా మారి బ్లాక్ బోర్డ్ పై లెక్కలు చెబుతూ... పుస్తకాలలో పాఠాలు బోధిస్తూ... హాస్టల్లో విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ...!
ఏ పాఠశాలకు, ఏ గురుకుల కళాశాలకు కలెక్టర్ వెళ్లిన ఆయా తరగతి గదులను సందర్శించి, విద్యార్థులతో స్వయంగా మాట్లాడి వారికి కావలసిన సౌకర్యాల గురించి అడిగి వెంటనే ఉపాధ్యాయుడిగా మారిపోతున్నారు. అక్కడికక్కడే పాఠ్యపుస్తకాలను తీసుకొని, బ్లాక్ బోర్డును ఉపయోగిస్తూ, చాక్ పీస్ పట్టి రాస్తూ, పుస్తకాలను తిరగేస్తూ విద్యార్థులకు పాఠాలు చెబుతూ విద్య విలువను వివరిస్తూ, విద్య ద్వారా జీవితాలలో వచ్చే మార్పుల గురించి చెబుతూ, మంచి విద్యను నేర్చుకొని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరాలని ఉద్బోధిస్తున్నారు. విద్యార్థులు భోజనాలు చేసే సమయంలో ఆయా పాఠశాలల, కళాశాలల వసతి గృహాలను కూడా తనిఖీ చేస్తూ మంచి ఆహారం అందించడానికి కావలసిన సలహాలు, సూచనలు అందిస్తూ, ఆదేశాలు ఆ జారీ చేస్తూ, పలు రకాల చర్యలు మెనూ పాటించేలా తీసుకుంటున్నారు. అంతేకాకుండా తాను కూడా ఒక విద్యార్థి లాగా ఎలాంటి బేశజాలకు పోకుండా విద్యార్థుల మధ్యలో కూర్చుని భోజనం చేస్తూ, విద్యార్థులతో ముచ్చటిస్తూ, వారి బంగారు భవిష్యత్తుకు కావలసిన విలువైన సూచనలు అందిస్తున్నారు. చదువు విలువను తెలియచెప్తూ, గొప్ప గొప్ప స్థాయికి చేరుకోవాలని మనస్పూర్తిగా కలెక్టర్ కోరుకుంటున్నారు. చదువులలో చురుకుగా ఉంటూ టాపర్లుగా ఉన్న విద్యార్థులను అభినందిస్తూ ప్రోత్సకాలు అందిస్తున్నారు. విద్యార్థుల సంక్షేమం, అభివృద్ధి విషయాలకు అంకితమైన ఉపాధ్యాయులను గుర్తించి వారికి అవార్డులు ఇస్తున్నారు. విద్యార్థులకు విలువైన జీవిత పాఠాలను బోధిస్తూ, మహనీయుల త్యాగాలను గుర్తు చేసుకోవాలని, ఎన్ని కష్టాలు వచ్చినా చదువులో వెనకంజ వేయవద్దని, టాపర్లుగా నిలవాలని కలెక్టర్ కోరుతున్నారు. కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని, సంకల్పబలం, ఆశయ సిద్ధి, ఆత్మవిశ్వాసంతో గొప్ప లక్ష్యాలను ఎంచుకొని వాటిని చేరుకోవాలని,చదువు ద్వారా జీవితంలో గొప్పవారుగా స్థిరపడాలని, తమను కన్న తల్లిదండ్రులకు, పుట్టిన ఊరుకు మంచి పేరు తేవాలని, ఇతరులకు ఆదర్శప్రాయులుగా ఉండాలని, శాస్త్రీయ విద్యా విధానానికి అలవాటు పడాలంటూ విలువైన తదితర విషయాలను కలెక్టర్ విద్యార్థులకు వివరిస్తున్నారు.
హాస్పటల్ ఆకస్మిక తనిఖీలు... డాక్టర్లు సిబ్బంది అప్రమత్తం... అవసరమైన మందుల నిల్వలు.. పేషంట్లకు కావలసిన సౌకర్యాలు, మెరుగైన చికిత్సలు
ఆరోగ్యంపై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టిన జిల్లా కలెక్టర్ జిల్లాలో ఉన్న అన్ని ఆసుపత్రులను ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారు. సకాలంలో డ్యూటీకి డాక్టర్లు, సిబ్బంది వస్తున్నారా, పేషెంట్లకు తగువిధంగా చికిత్సలు అందిస్తున్నారా, రోగులకు అవసరమైన మందులు సరిపడా నిల్వలు ఉన్నాయా, పరిశుభ్రత ఏ విధంగా ఉంది అన్న విషయాలపై కలెక్టర్ దృష్టిసారించి ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తి దావకానాలు మాత్రమే కాకుండా జిల్లాలోని ప్రాంతీయ ఆసుపత్రులు అన్నింటిని కూడా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి, ఆయా ఆసుపత్రుల్లో రోగులకు చికిత్సలు ఎలా అందిస్తున్నారు అన్న విషయాలపై ఆరా తీస్తూ, ఏమైనా నిర్లక్ష్యం వహిస్తే అక్కడికక్కడే చర్యలు తీసుకుంటున్నారు. గ్రామీణులకు, ముఖ్యంగా పేదలకు, అతి సామాన్యులకు ఆరోగ్య విషయాల్లో చికిత్సలు ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా అందించాలని, విలువైన ప్రాణాలను కాపాడడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తున్నారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ విద్య, వైద్యంపై స్పెషల్ ఫోకస్ పెట్టి ప్రత్యేక కార్యచరణ ద్వారా ముందుకు వెళ్తుండడంతో జిల్లా ప్రజలు హర్ష వ్యక్తం చేస్తున్నారు.