రోడ్డు ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి – జైళ్ల శాఖ డీజి సౌమ్య మిశ్రా
అజాగ్రత్తగా ప్రయానంతో ప్రాణాలకు ముప్పు
రోడ్డు ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్యమిశ్రా పిలుపునిచ్చారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అరైవ్ – అలైవ్ కార్యక్రమంలో ముఖ్య అతిదిగా పాల్గొన్నారు. ముందుగా స్థానిక కల్నల్ సంతోష్ బాబు చౌరస్తా నుండి రోడ్డు భద్రత పై నిర్వహించిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం పిల్లలమర్రి వద్ద బ్లాక్ స్పాట్స్ లను పరిశీలించిన తదుపరి రుద్ర౦గి కన్వెన్షన్ హాల్ నందు పోలీస్ శాఖ ఆద్వర్యంలో విద్యార్దులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో కోదాడ శాసన సభ్యురాలు నలమద పద్మావతి రెడ్డి, కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ కె. నరసింహ కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఏడాది రోడ్డు ప్రమాదలతో ఎంతో మంది ప్రాణాలను కోల్పోతున్నారని, ఈ నేపద్యంలో రోడ్డు భద్రత ను గుర్తించి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత కల్పిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణ కొరకై అవగాహన కార్యక్రమాలను చేపట్టిందని తెలిపారు. రోడ్డు మీద అజాగ్రత్తగా ప్రయాణం చేస్తే ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని, ఓవర్ స్పీడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం, సిట్ బెల్ట్ లేకుండా నిర్లక్ష్యంగా వాహనాలను నడపడంతో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని, దేశంలో 2023లో రోడ్డు ప్రమాదలలో 4.5లక్షల మంది మృత్యువాత పడ్డారని వివరించారు. ముఖ్యంగా యువత ఓవర్ స్పీడ్ తో వాహనాలను నడుపుతూ ప్రమాదలకు గురవుతున్నారని, ఓవర్ స్పీడ్ వెళ్లకుండా జాగ్రత్తగా వాహనం నడిపితే దాదాపు 50శాతం రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. అదే విదంగా సెల్ ఫోన్ నడుపుతూ వాహనాలను డ్రైవింగ్ చేయరాదని, సీట్ బెల్ట్ ధరిస్తే ఆక్సిడెంట్ సమయంలో ప్రాణాలను నిలిచే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాద రహిత జిల్లాగా మార్చేందుకు వీటిని ఆచరణ చేస్తే చాలని వీటితోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ప్రయాణ సమయంలో ట్రాఫిక్ రూల్స్ పాటిస్స్తు జాగ్రత్తగా ప్రమాద నివారణ చర్యలు తీసుకుంటే రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పడతాయని తెలిపారు. ప్రతి ఒక్కరు బాధ్యత గా ఉంటూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ప్రాణాలను నిలుపుకోవలని, ముఖ్యంగా డ్రైవర్లు ట్రాఫిక్ రూల్స్, రోడ్డు నియమ నిబందనలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ సూర్యాపేట జిల్లాకు రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ ప్రాణాలకు కాపాడాలని సంకల్పం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
భద్రతగా గమ్యస్థానాలకు చేరడమే అరైవ్ అలైవ్ లక్ష్యం – జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మాట్లాడుతూ రోడ్డు ప్రయాణ సమయంలో భద్రతగా గమ్య స్థానాలకు చేరుకోవాడమే అరైవ్ – అలైవ్ లక్ష్యమని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. జిల్లాలో దాదాపు 200కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు, 3600కిలో మీటర్ల మేరకు గ్రామీణ రోడ్లు విస్తరించి ఉన్నాయని, ప్రతి ఒక్కరూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునేల సూర్యాపేట జిల్లాలో రోడ్డు భద్రతపై వివిధ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదలతో అనేక మంది చనిపోతున్నారని 2023 సంవత్సరంలో 257 మంది, 2024 లో 278 మంది, 2025లో 230మంది, 2026 ఏప్రిల్ వరకు 78 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించినట్లు తెలిపారు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రోడ్ సేఫ్టీ పై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి కోల్పోతే కుటుంబం అంత రోడ్డు మీద పడుతుందని కావున రోడ్డు ప్రయాణ సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. జిల్లా స్థాయీలో డిస్ట్రిక్ రోడ్డు సేఫ్టీ కమిటీ, మండల స్థాయీలవ మండల రోడ్ స్టేఫ్టీ కమిటీ ఏర్పాటు చేసుకొని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, జిల్లా వ్యాప్తంగా 45 బ్లాక్ స్పాట్ లను గుర్తించి ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్రామాలలోని రోడ్ల పై లోపాలను గుర్తిస్తే ప్రతి ఒక్కరూ భాద్యతగా వాటి సమాచారం అందించాలని కోరారు. సిట్ బెల్ట్, హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయకూడదని గ్రామాలలో తీర్మానం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
అరైవ్ – అలైవ్ అద్బుతమైన కార్యక్రమం – కోదాడ శాసన సభ్యురాలు ఉత్తం పద్మావతి
జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాద గణాంకాలు పరిశీలిస్తే ఆవేదన కలుగుతుందని, అరైవ్ అలైవ్ అనే రోడ్డు భద్రత కార్యక్రమం అద్భుతమైనదని దీని ద్వారా ప్రజలు మరింత చైతన్యమంత అవుతున్నారని కోదాడ శాసన సభ్యురాలు ఉత్తమ్ పద్మావతి అన్నారు. ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర పోలీస్ శాఖ కు అభినందనలు తెలియజేస్తున్నారని తెలిపారు. అరైవ్ అలైవ్ అనేది ఒక పదం కాదు ఇది ఒక మహా ఉద్యమం అన్నారు. వాహనదారులు ప్రజలు యువత ప్రతి ఒక్కరూ ప్రయాణ సమయంలో రహదారి నియమాలు పాటించాలని పోలీసు వారి సూచనలు పాటించాలని ట్రాఫిక్ నియమయ నిబంధనలు పాటించాలని కోరారు. ముందస్తు జాగ్రత్తలు పాటించడం ద్వారానే రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని ప్రమాదం మరణాలను నివారించవచ్చని తెలిపారు. ప్రమాద సంఘటనలు జరిగినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు స్పందించి క్షతగాత్రులకు సహకారాలు అందించాలని త్వరితగతిన ఆసుపత్రులకు తరలించాలని తెలిపారు.
రోడ్డు భద్రత పై విస్తృత కార్యక్రమాలు – ఎస్పీ కె. నరసింహ మాట్లాడుతూ
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు రోడ్డు భద్రత నియమాల పట్ల విస్తృత అవగాహన కల్పిస్తున్నామని జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. అరైవ్ అలైవ్ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా ఇతర శాఖలతో సమన్వయంగా పనిచేస్తూ ముందుకు పోతున్నామన్నారు. దేశంలో ప్రతి సంవత్సరం నాలుగు లక్షల పైగా రోడ్డు ప్రమాదాల సంభవిస్తున్నాయని, సూర్యాపేట జిల్లాలో గత సంవత్సరం 600 పైగా రోడ్డు ప్రమాదాలు సంభవించగా 230 మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. రోడ్డు ప్రమాద సమయంలో ప్రమాదాలు సంభవించకుండా ప్రతి ఒక్కరు సురక్షితంగా గమ్యం చేరడం లక్ష్యంగా పోలీస్ శాఖ కృషి చేస్తుందని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ముందస్తు జాగ్రత్తలు పాటించడం ద్వారానే రోడ్డు ప్రమాదాలను నివారించడం సాధ్యమైతుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రమాద సంఘటనలో బాధితులకు సహాయ సహకారాలు అందించాలని అలాంటివారిని రహదారి హీరోగా గుర్తించి ప్రోత్సాహం అందించడం జరుగుతుందన్నారు.
రోడ్డు భద్రతపై గ్రామాలు, మహిళా సంఘాలు తీర్మాన పత్రాలను అధికారులు అందించారు.
అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాల ద్వారా గ్రామాలలో ప్రజలు, మహిళా సంఘాలు చైతన్యవంతం అవుతున్నాయి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ గ్రామాల సర్పంచులు వివిధ గ్రామాలకు చెందిన మహిళా సంఘాలు రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తగా వాహనాలు నడుపుతామని, మా కుటుంబ సభ్యులు, మా గ్రామ ప్రజలు హెల్మెట్ సీట్ బెల్ట్ దరిస్తారని తీర్మానాలు చేసి తీర్మాన పత్రాలను జిల్లా అధికారులకు అందించారు.
రోడ్డు ప్రమాద ఘటనలో సహాయ సహకారాలు అందించిన వ్యక్తికి సన్మానం. చివ్వెంల మండల పరిధి జాతీయ రహదారి 65 ఏచర్ల ముత్యాలమ్మ గుడి వద్ద ఏసీ డీసీఎం, టాటా ఏసీ రోడ్డు ప్రమాదం సంభవించగా సంఘటనలు క్షతగాత్రులకు సహాయ సహకారాలు అందించి 108 కి, పోలీసు వారికి వేగంగా సమాచారం అందించిన వాళ్లభాపురం గ్రామానికి చెందిన రవీందర్ అనే వ్యక్తిని ఈ సందర్భంగా అధికారులు సన్మానించారు. రోడ్డు ప్రమాద సంఘటనల్లో స్పందించి సహకారాలు అందించే వారిని రహదారి హీరోగా కీర్తించడం జరుగుతుంది.
ఆకట్టుకున్న పోలీసు కళాబృందం నాటకం ప్రదర్శన.
ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా పోలీసు కళాబృందం ఆధ్వర్యంలో నిర్వహించిన భూలోకం, యమలోకం అనే నాటక ప్రదర్శన ఆకట్టుకున్నది. రోడ్డు ప్రమాదాలకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ నాటక ప్రదర్శన నందు వివరించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతా కార్యక్రమం గురించి నాటక ప్రదర్శన ద్వారా వివరించారు. హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపిన మద్యం మత్తులో వాహనాలు నడిపిన జరిగే ప్రాణప్రాయం గురించి ప్రదర్శనలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజలకు మీడియా ప్రతినిధులకు హెల్మెట్స్ ను అందించి ప్రయాణ సమయంలో హెల్మెట్ ధరించి ప్రయాణించాలని తెలియజేశారు.
కార్యక్రమంలో జైళ్ల శాఖ డిఐజి శ్రీనివాసరావు, అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి, ఆర్టీసీ డిఎం సునీత, ఆర్టీవో జయప్రకాశ్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్, సూర్యాపేట కోదాడ తిరుమలగిరి నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు మున్సిపల్ కమిషనర్లు స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు