రైతులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రఘునందన్ రెడ్డి
తిరుమలగిరి 21 అక్టోబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:- రైతులకు వానాకాలం సీజన్ రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా మొదటి దఫా పంట పెట్టుబడి సాయం రైతు భరోసా రూ.7500 ఇవ్వకుండా రైతులను మోసగించిందని బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రఘునందన్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికల హామీలో పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా రూ. 15వేలు ఇస్తామని ప్రగల్బాలు పలికిందని, ఇప్పుడు కుంటి సాకులు చెబుతూ రైతు భరోసా ఎగ్గొడుతుందని విమర్శించారు. రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఎంతో ఆర్భాటంగా ప్రకటించి సగం మంది రైతులకు కూడా రుణమాఫీ చేయలేదని, ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ అమలు చేస్తామని చెప్పి రేషన్ కార్డు లింక్ పెట్టి రైతులకు రుణమాఫీ చేయకుండా ఇబ్బందులు పెడుతుందని తెలిపారు. వానాకాలం పంట ముగిసి రైతులు రెండో పంట వేసేందుకు సిద్ధమవుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రైతు భరోసా రూ.15 వేలు రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొమ్మినేని సతీష్ ధూపటి రవీందర్ సర్వోత్తమ్ రెడ్డి కందుకూరి ప్రవీణ్ కందుకూరి బాబు నరేందర్ వెంకన్న మల్లయ్య వివిధ గ్రామాల అధ్యక్షులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు