రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 15 నుండి 31 వరకు జరిగే ఆశ
వర్కర్ల బస్సు జాతాను జయప్రదం చేయండి
ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం 18 వేల రూపాయలు ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలి
పిఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలి
ఉద్యోగ భద్రత కల్పించాలి
బస్సు జాత డిసెంబర్ 23న గద్వాల జిల్లా కేంద్రానికి రాక
జోగులాంబ గద్వాల 16 డిసెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18 వేల రూపాయలు నిర్ణయించి అమలు చేయాలని, 2025 ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం తో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 15వ తేదీ నుండి 31వ తేదీ వరకు బస్సుజాత నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (CITU) జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పద్మ, సునీత తెలిపారు.
సోమవారం స్థానిక CITU జిల్లా కార్యాలయం వద్ద బస్సు జాతాకు సంబంధించిన గోడ పత్రికను విడుదల చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆశాల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని అధికారంలోకి వస్తే మెరువైన సౌకర్యాలు కల్పిస్తామని ఆశాలకు వేతనం పెంచడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పిస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచింది కానీ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందని అన్నారు.
ఆశాల సమస్యలు పరిష్కరించాలని మంత్రులకు ఎమ్మెల్యేలకు అనేకసార్లు వినతి పత్రాల ద్వారా విజ్ఞప్తులు చేసినా ఇప్పటికి నిరంతరం పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని అందుకే ఆశా వర్కర్లను పోరాటానికి సంసిద్ధం చేయడం కోసం 2024 డిసెంబర్ 15వ తేదీ నుండి 31వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు జాత నిర్వహిస్తున్నామని తెలిపారు.
డిసెంబర్ 31న వేలాది మందితో హైదరాబాదులో ఇందిరాపార్కు వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.
బస్సు జాత ఈనెల 23వ తేదీన ఉదయం 10 గంటలకు గద్వాల జిల్లా కేంద్రానికి చేరుకుంటుందని జిల్లాలోని ఆశా వర్కర్లు అందరూ 23వ తేదీన జిల్లా కేంద్రానికి తరలివచ్చి బస్సు జాతాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (CITU) జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పద్మ, సునీత, CITU జిల్లా అధ్యక్షులు A. వెంకటస్వామి, ఆశ వర్కర్స్ యూనియన్ నాయకులు కాంతమ్మ, లక్ష్మి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
పద్మ
జిల్లా అధ్యక్షురాలు
సునీత
జిల్లా ప్రధాన కార్యదర్శి
తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (CITU)
జోగులాంబ గద్వాల జిల్లా కమిటీ.