మే నెలలో ఎల్పిజీ గ్యాస్ సిలిండర్ బుకింగ్, డెలివరీ విధానాల్లో మార్పులు

Apr 28, 2026 - 19:41
 0  2
మే నెలలో ఎల్పిజీ గ్యాస్ సిలిండర్ బుకింగ్, డెలివరీ విధానాల్లో మార్పులు

మే నెలలో ఎల్పిజీ గ్యాస్ సిలిండర్ బుకింగ్, డెలివరీ విధానాల్లో మార్పులు వచ్చే అవకాశంపై చర్చలు వేగంగా జరుగుతున్నాయి. యుద్ధ పరిస్థితులు ప్రపంచ ఇంధన సరఫరాపై ప్రభావం చూపడంతో, భారత్‌లో కూడా గ్యాస్ సరఫరా, ధరలపై ఒత్తిడి పెరిగింది.

 కంపెనీలు కొత్త నిబంధనలను అమలు చేసే దిశగా చర్చలు.. 

ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆయిల్ కంపెనీలు కొత్త నిబంధనలను అమలు చేసే దిశగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

 గ్యాస్ ధరలు మరింత పెరగనున్నాయా? 

ఇటీవల అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా ఎల్పిజీ ధరలు ఇప్పటికే పెరిగాయి. ముఖ్యంగా 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర సుమారు రూ. 60 వరకు పెరిగింది. కమర్షియల్ వినియోగానికి ఉపయోగించే 19 కిలోల సిలిండర్ ధరలు మాత్రం ఒక్క నెలలోనే మూడు సార్లు పెరగడం గమనార్హం. మార్చి, ఏప్రిల్ నెలల్లో వరుసగా ధరలు పెరిగి, మొత్తం మీద గణనీయమైన భారంగా మారాయి. ఈ పరిస్థితుల్లో మే 1, 2026 నుంచి మరోసారి ధరలు మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

 బుకింగ్ గ్యాప్ మార్పు 

ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన తర్వాత మరోసారి బుక్ చేయాలంటే కనీసం 25 రోజుల గ్యాప్ ఉంది. అయితే ఈ వ్యవధిని భవిష్యత్తులో మారుస్తారని సమాచారం. ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో 21 నుంచి 25 రోజుల మధ్య, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల వరకు బుకింగ్ గ్యాప్‌ను అమలు చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఈ విధంగా ప్రాంతాల వారీగా బుకింగ్ నిబంధనలు ఉండే అవకాశముంది. దీని వల్ల వినియోగదారులు ముందుగానే ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది.

 OTP ఆధారిత డెలివరీ 

గ్యాస్ డెలివరీలో పారదర్శకత పెంచడానికి OTP ఆధారిత విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఎక్కువ శాతం డెలివరీలు OTP (DAC) ద్వారా జరుగుతున్నాయి. ఆన్‌లైన్ బుకింగ్ కూడా భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ప్రతి గ్యాస్ సిలిండర్ డెలివరీకి OTP తప్పనిసరి చేయవచ్చని అంచనా. ఇది గ్యాస్ దుర్వినియోగాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

 ఆధార్ ఈకేవైసీ.. 

ప్రభుత్వం LPG వినియోగదారులకు ఆధార్ ఆధారిత eKYC ప్రక్రియను అమలు చేస్తోంది. ముఖ్యంగా ఉజ్వల యోజన కింద గ్యాస్ కనెక్షన్ పొందిన వారు సంవత్సరానికి ఒకసారి eKYC చేయాల్సి ఉంటుంది. ఇది సబ్సిడీ పొందడానికి అవసరమైన ప్రక్రియగా మారింది. సాధారణ వినియోగదారుల విషయానికి వస్తే, ఇప్పటికే eKYC పూర్తి చేసిన వారు మళ్లీ చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పటివరకు చేయని వారు తప్పనిసరిగా పూర్తి చేయాలి. ఈ విధానం ద్వారా నిజమైన లబ్ధిదారులకు మాత్రమే సబ్సిడీ చేరేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

 PNGకి మారకపోతే LPG నిలిపివేత? 

పెద్ద నగరాల్లో LPGకు బదులుగా PNG వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. PNG సదుపాయం అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో వినియోగదారులు మారాలని సూచిస్తోంది. మార్చి 2026లో వచ్చిన ఆదేశాల ప్రకారం, PNG సదుపాయం ఉన్నప్పటికీ LPG వినియోగాన్ని కొనసాగిస్తే మూడు నెలల తర్వాత సరఫరా నిలిపివేయవచ్చని హెచ్చరించారు. ఇప్పటికే లక్షల సంఖ్యలో PNG కనెక్షన్లు యాక్టివ్ అవుతుండగా, మరింత మంది వినియోగదారులు ఈ మార్పుకు సిద్ధమవుతున్నారు. ఇది భవిష్యత్తులో గ్యాస్ వినియోగంలో పెద్ద మార్పునకు దారి తీసే అవకాశం ఉంది..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333