మనిషిని చంపే యుద్దాలకు అంతం లేదా

మనిషిని మనిషి చంపుకుంటూ పోతే ఈ ప్రపంచం మీద మానవజాతి ఉంటుందా.. ఊడుతుందా...?

Mar 4, 2026 - 12:01
Mar 4, 2026 - 12:02
 0  1
మనిషిని చంపే యుద్దాలకు అంతం లేదా

చంపుకోవడానికేనా  సమాజం ఉన్నది... మట్టు పెట్టడానికేనా మనుషులు ఉన్నది... ఆధిపత్యం చెలాయించడానికేనా ఆయుధాలు ఉన్నవి.... నరకమని చెప్పడానికేనా నరం లేని నాలుక ఉన్నది... ఆగ్రహం, ఆవేశాలకు, అహంకారానికేనా  మానవ మేధస్సు ఉన్నది...!!!

బాధితదేశం ఒక్కటే... బాధించే దేశాలు అనేకం... అయినప్పటికీ ఇరాన్ తలవంచలేదు... తల దించలేదు... పోరాటమే శరణ్యం అంటూ అవిరళ పోరు సలుపుతుంది

తన మాట వినని దేశాలపై అమెరికా పెత్తనం ఇంకా ఎంతకాలం.... చిన్న చిన్న దేశాలన్నీ అనిమణిగి ఉండాల్సిందేనా...!

మీరు చెప్పిన మాట వినలేదని.... మీ అడుగులకు మడుగులు వత్తలేదని... మీకు గులాముగా మారి సలాములు చేయలేదని... 165 మంది  అన్నెం పుణ్యం ఎరుగని అమాయక బాల బాలికలను సహా ఇప్పటివరకు 787 మందిని ప్రాణాలు తీయడం మీ క్రూరత్వానికి, రాక్షసత్వానికి పరాకాష్ట కాదా...!

1979 సంవత్సరము నుండి అమెరికాకు జరిగిన చిన్న అవమానాలను దృష్టిలో పెట్టుకొని 47 సంవత్సరాలుగా ఇరాన్ పై కక్ష సాధింపుకు అమెరికా ఎదురు చూడటం సమంజసమా...!

శతకోటి సమస్యలకు అనంతకోటి ఉపాయాలు....మీ సమస్యల పరిష్కారానికి చర్చలు దారి చూపవా..?*రాజీమార్గమే రాజా మార్గమని అగ్రదేశాలకు తెలియదా...?*పసి కూనల పైన అమెరికా ప్రతాపము...?*చైనా, రష్యాలపై కూడా ఇలాగే దుందుడుకు చర్యలు తీసుకునే దమ్ము..ధైర్యం నీకు ఉందా ఓ అమెరికా పెద్దన్న... ప్రపంచ దేశాలన్నీ రెండు కూటములుగా విడిపోయి యుద్దరంగంలో దిగితే జరిగే ప్రాణ, ఆస్తి నష్టాలకు నీవే బాధ్యుడవు కావా... మూడో ప్రపంచ యుద్ధానికి ముగ్గు పోయటానికి సిగ్గు వేయడం లేదా...?

మిత్ర  దేశమని కూడా చూడకుండా గల్ఫ్ దేశాలన్నీ అమెరికా స్థావరాలకు అడ్డాగా నిలవడం ఎంత మేర సబబు...?

ఇరాన్ మెసపటోమియా నాగరికతకు భారతదేశానికి అవినాభావ సంబంధం... ఇప్పటికీ హైదరాబాదులో ఇరానీ చాయ్, పర్షియన్ల  బిరియాని సెంటర్లు

కులం, మతం, ప్రాంతం మనుషుల మధ్య మానవత్వ పరిమళాలు వెదజల్లాలి కానీ మారణ హోమాలు సృష్టించకూడదు...!

ఒక దేశాన్ని మరొక దేశం శాసించే ఆధిపత్య భావనలు ఆగిపోవాలి నియంతృత్వం నశించాలి ప్రజాస్వామ్య భావనలు పరిడవిల్లాలి...!

ఒక చిన్న దేశాన్ని చుట్టుముట్టుతుంటే ప్రశ్నించే వారే లేకపోవడం శోచనీయం

ఒక క్యాస్ట్రో... ఒక గడాఫీ... ఒక చావేజ్... ఒక హోచిమన్... ఒక సద్దాం... ఒక ఖమేని...

ఇలా ఎంతమంది దేశ అధ్యక్షులను చంపుతూ పోతావు అమెరికా సామ్రాజ్యవాది...!

అసలు ఒక దేశ అంతర్గత విషయాలలో జోక్యం చేసుకునే అర్హత, హక్కు అమెరికాకు ఎవరు ఇచ్చారు...?

గగన తలమే కాకుండా భూతల యుద్ధానికి కూడా దిగుతాడంట కంపులేపుతున్న ట్రంప్

ప్రపంచంలో ఇరాన్ ఒక్కటే న్యూక్లియర్ పరీక్షలు జరుపుతుందా... ఆటంబాంబులు కలిగిన దేశాలు ఎన్ని... మీ దగ్గర ఎంత ఆయుధ సంపత్తి ఉంది... మిమ్ములను అడిగే వారే లేరా... అంతా మీ ఇష్టారాజ్యమేనా... మీ నియంతలకు చరమగీతం పాడే రోజులు రావా... మీరేమో ఇష్టం వచ్చిన రీతిలో అన్ని రకాల యుద్ధ సామాగ్రి కలిగి ఉండవచ్చు... నీకు నచ్చని, నువ్వు  మెచ్చని దేశాలు మాత్రం తమ రక్షణ కోసం ఎలాంటి ఆయుధాలను తయారు చేసుకోవద్దు... ఇదెక్కడి యుద్ద నీతి... ఎక్కడ పోయింది రాజనీతి...ఇంకెక్కడి రాజ్య తంత్రం... సామ్రాజ్యవాద కాంక్షకు అంతం ఎప్పుడు...?

ఇరాన్ దేశమా.... నీ పోరాట పట్టిమకు సలాం.... వెను తిరిగేది లేదు... మడమ తిప్పేది అంతకన్నా లేదు... విజయమో...వీర స్వర్గమో...!

మనిషి ఆలోచనలోంచి... మానవుని చేతివేళ్ల నుంచి.. కంప్యూటర్ స్క్రీన్ లపై ఆదేశాలు ఇచ్చేవరకు జరుగుతున్న ఈ నరమేధం.. ఆర్థిక నష్టం ఇంకా ఎంతకాలం...?

విజ్ఞానానికే సైన్స్... విధ్వంసానికి కూడా విచ్చలవిడిగా ఉపయోగిస్తారా...?

మనిషి సృష్టించిన కృత్రిమ మేధ మనిషినే అంతం చేస్తుంది...!

ఆకాశంలో మెరుపులతో క్షిపణులు... యుద్ధ విమానాలు... అవనిపై మంటల చిచ్చులు... మారణ హోమాలు...!!

మనిషి కనిపెట్టిన విజ్ఞానం మనిషిపై పెత్తనమా... విజ్ఞానం మనిషికి బానిస కావాలి గాని యజమాని కాకూడదు... విజ్ఞానం అంటే మానవ మేధస్సుకు లోబడి ఉండాలి గాని మానవజాతినే అంతం చేసేదిగా ఉండకూడదు.. అందుకే ప్రపంచశాంతి వర్ధిల్లాలి...!


వెనకటి కాలంలో యుద్ధాలు అంటే భూమి మీద జరుగుతుంది. మనుషులు నడుచుకుంటూ వచ్చి ఎడ్ల బండ్ల పైన వచ్చి గుర్రాల మీద వచ్చి కత్తులు, కటార్లు, బళ్లాలు  విసురుతూ పొడుచుకుంటూ బాహ్య భాహీగా తలపడుతూ యుద్ధం చేసేవారు. తదుపరి కాలంలో బాంబుల సంస్కృతి కూడా వచ్చింది. ఒకనాడు వడిసెలలో రాళ్లు విసురుతూ గురి సూసి కొట్టేవారు. ముష్టి యుద్ధాలు, మల్ల యుద్ధాలు కూడా జరుగుతుండేది. కానీ ఆధునిక టెక్నాలజీ రూట్ మార్చుకుంది. విజ్ఞానం విస్తరించే కొద్దీ మనిషికి అవసరమైన అన్ని వస్తువులను కనుగొనడమే కాకుండా మనిషిని గ్రూపు రేఖలు లేకుండా హతమార్చే ఆయుధాలు కూడా మానవ మేధస్సు తయారు చేసింది. ఇంకా గత ఐదు రోజులుగా జరుగుతున్న ఇరాన్ ఇజ్రాయిల్ ఆధునిక టెక్నాలజీ కొత్త రూపు సంతరించుకొని గగనతలను నాట్యమాడుతుంది. మారుతున్న కాలంతో పాటు యుద్ధ తంత్రాలు కూడా శరవేగంగా రూపాంతరం చెందుతున్నాయి. నేడు సైన్స్ అండ్ టెక్నాలజీలు రెండు వైపులా పదునైన కత్తిలా మారి, రణక్షేత్రపు వ్యూహాలను సమూలంగా మార్చేస్తున్నాయి. ఈ ఆధునిక పోరాట పటిమలో కృత్రిమ మేధ (ఏఐ) ఇప్పుడు అత్యంత కీలకమైన శక్తిగా ఆవిర్భవించింది. నిన్నటి వెనిజులా అధ్యక్షుడి నిర్బంధం నుంచి, కఖమేనీపై జరిగిన దాడి వరకు,  నేటి ఇరాన్ అధినాయకుడు అయతుల్లా అరాఫి హననం వరకు ప్రతి సంఘటన వెనుక ఏఐ అదృశ్య హస్తం స్పష్టంగా కనిపిస్తోంది. అంతుచిక్కని వేగం, గురి తప్పని ఖచ్చితత్వం మరియు శత్రువు ఊహకు కూడా అందని 'పిన్ పాయింటెడ్' దాడులతో, యుద్ధ గమనాన్ని శాసించడంలో కృత్రిమ మేధ తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది.

కాలం తన గమనాన్ని మార్చుకుంది... చేతికి మట్టి అంటకుండా శత్రువుని మట్టుబెట్టుతుంది...!

 2026 ఫిబ్రవరి. కాలం తన గమనాన్ని మార్చుకున్న క్షణం అది. నిన్నటి వరకు యుద్ధం అంటే రక్తం, కన్నీరు, నేల రాలిన ప్రాణాలు. కానీ ఇప్పుడు యుద్ధం అంటే నిశ్శబ్దంగా సాగే డేటా ప్రవాహం. ఒక అల్గారిథమ్ తీసుకునే నిర్ణయం ఒక దేశ చరిత్రను మార్చేస్తోంది. నేటి అయతుల్లా అరాఫి హననం చూస్తుంటే ఒకటి స్పష్టమవుతోంది. అధికారం మారిన గంటల వ్యవధిలోనే ఆయువు పగిలిపోవడం వెనుక ఉన్నది కేవలం ఆయుధం కాదు, ఒక అజేయమైన కృత్రిమ మేధస్సు.
మనిషి సృష్టించిన విజ్ఞానం, ఇప్పుడు మనిషికే ఒక అంతుచిక్కని ప్రశ్నలా మారింది. యుద్ధం ఇప్పుడు కేవలం సరిహద్దుల్లో కాదు, మన ఆలోచనల లోతుల్లో, కంప్యూటర్ మెదళ్లలో జరుగుతోంది.


సైన్సు అభివృద్ధిని మాత్రమే కాకుండా మానవజాతి అంతం  కూడా కోరుతుంది

మనం గొప్పగా చెప్పుకునే సైన్స్ ఇప్పుడు యుద్ధ రంగంలో 'సర్వాంతర్యామి'లా మారింది. దీనినే శాస్త్రవేత్తలు 'అల్గారిథమిక్ వార్‌ఫేర్' అంటున్నారు. ఇందులో మొదటిది 'పాటర్న్ ఆఫ్ లైఫ్' విశ్లేషణ. ఒక మనిషి ఎప్పుడు నిద్రలేస్తాడు, ఏ దారిలో వెళ్తాడు, ఎవరితో మాట్లాడుతాడు అనే అంశాలను ఏఐ నెలల తరబడి గమనిస్తుంది. వెనిజులా అధ్యక్షుడు మదురో పట్టుబడటానికి కారణం ఆయన వేసిన తప్పుడు అడుగు కాదు, ఆయన అలవాట్లను ఏఐ అత్యంత ఖచ్చితంగా లెక్కగట్టడమే.

రెండవది 'సెన్సార్ ఫ్యూజన్.

ఇది ప్రకృతిలోని పంచేంద్రియాల లాంటిది. వేల కిలోమీటర్ల పైనుండే ఉపగ్రహ చిత్రాలను, డ్రోన్ల ఫుటేజీని, చివరకు గాలిలోని శబ్దాలను కూడా ఒకేసారి విశ్లేషించి లక్ష్యాన్ని గుర్తిస్తుంది. ఈ శక్తి వల్లే ఇరాన్ కొత్త నాయకుడిని సెకన్ల వ్యవధిలో గుర్తించి అంతం చేయడం సాధ్యమైంది. ఇది మనిషి మేధస్సుకు అందని ఒక అతీత వేగం.

విజ్ఞానం వివేకాన్ని,  మానవత్వాన్ని కోరుతుంది... మానవ వినాశనానికి దారితీస్తుంది

విజ్ఞానం ఎప్పుడూ వివేకంతో, మానవతా దృక్పథంతో కూడి ఉండాలని నమ్మిన ఆంత్రోపిక్ (Anthropic) కంపెనీ సీఈఓ డారియో అమోడెయ్, తన క్లాడ్ (Claude) ఏఐ సాఫ్ట్‌వేర్‌ను మనుషుల ప్రాణాలు తీసే 'కిల్లర్ రోబోల' తయారీకి గానీ, సామూహిక నిఘాకు గానీ వాడకూడదని దృఢ నిశ్చయంతో నిరాకరించారు. అయితే, యుద్ధంలో గెలవడమే పరమావధిగా భావించే అమెరికా ప్రభుత్వం దీనిని ఏమాత్రం సహించలేదు; తమ మిలిటరీ అవసరాల కోసం ఎటువంటి ఆంక్షలు లేని 'అన్‌రెస్ట్రిక్టెడ్ యాక్సెస్' ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, అమోడెయ్ మొండితనాన్ని దేశ భద్రతకు విఘాతంగా భావించింది. ఆంత్రోపిక్‌ను "రాడికల్ లెఫ్ట్", "వేక్" కంపెనీగా అభివర్ణించడమే కాకుండా, ఒక ప్రైవేట్ సంస్థ మిలిటరీకి నిబంధనలు విధించడాన్ని తప్పుబడుతూ ఆ సంస్థను 'సప్లై చైన్ రిస్క్' జాబితాలోకి నెట్టి బ్లాక్‌లిస్ట్ చేసింది. ప్రభుత్వం మాట వినకపోతే సివిల్, క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరిస్తూ అన్ని ప్రభుత్వ సంస్థల్లో ఆంత్రోపిక్ టెక్నాలజీ వాడకాన్ని నిలిపివేయడం, ఆధునిక సాంకేతికత మరియు నైతిక విలువల మధ్య జరుగుతున్న పెనుగులాటను స్పష్టం చేస్తోంది.

 ఫిబ్రవరి 27న ట్రంప్ ఆంత్రోపిక్ కంపెనీపై నిషేధం విధించడం వెనుక ఒక చేదు నిజం దాగి ఉంది. ఉబెర్ మాజీ ఎగ్జిక్యూటివ్, ప్రస్తుత అండర్ సెక్రటరీ ఎమిల్ మైఖేల్ ఏకంగా డారియో అమోడెయ్‌కు "గాడ్ కాంప్లెక్స్" (God complex) ఉందంటూ మండిపడ్డారు. తన సాఫ్ట్‌వేర్‌ను సైన్యం ఎలా వాడాలో తానే నిర్ణయిస్తానన్న అమోడెయ్ వైఖరిని ఒక నియంతృత్వ ధోరణిగా అభివర్ణిస్తూ, దేశ భద్రత కంటే వ్యక్తిగత సిద్ధాంతాలకే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారని మైఖేల్ విమర్శించారు. ఒక ప్రైవేట్ వ్యక్తి దేశ రక్షణ వ్యూహాలను శాసించాలని చూడటం ఆమోదయోగ్యం కాదని ప్రభుత్వం భావించడం గమనార్హం. సృష్టికర్త కంటే తాను సృష్టించిన యంత్రానికే ఎక్కువ విలువ ఇచ్చే వింత కాలంలో మనం ఉన్నామని ఈ పరిణామం నిరూపిస్తోంది. ఇక్కడ ఏఐని కేవలం ఒక వ్యాపార ఉత్పత్తిగా కాకుండా, "జాతీయ భద్రతా ఆస్తి"గా (National Security Asset) పరిగణించడం అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక మలుపుగా నిలిచిపోతుంది.

సామ్ ఆల్ట్‌మాన్ నైతికత ముసుగు

మరోవైపు సామ్ ఆల్ట్‌మాన్ నేతృత్వంలోని OpenAI ఆంత్రోపిక్ కంటే భిన్నమైన మార్గాన్ని ఎంచుకుని, పెంటగాన్‌తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ఈ ప్రక్రియలో ఆయన 'నైతికత' అనే ముసుగును మాత్రం వీడలేదు; యుద్ధ క్షేత్రంలో ఏఐ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోకుండా, ఏదైనా దాడి లేదా కీలక చర్యకు పాల్పడే ముందు ఖచ్చితంగా ఒక మనిషి ఆమోదం ఉండాలనే (Human-in-the-loop) 'రెడ్ లైన్స్'ను ఆయన నిబంధనలుగా పెట్టారు. జాతీయ భద్రతకు సహకరిస్తూనే, ఏఐ ప్రాణాంతకమైన 'కిల్లర్ రోబో'గా మారకుండా తనదైన శైలిలో రక్షణ కవచాలను ఏర్పాటు చేశామని వారు చెబుతున్నప్పటికీ, ఇందులో ఒక మౌలికమైన సందేహం మిగిలే ఉంది. యుద్ధం జరిగే ఆ అత్యంత వేగవంతమైన మిల్లీ సెకన్ల వ్యవధిలో, అసలు మనిషికి ఆలోచించే అవకాశం ఎంతవరకు ఉంటుంది? యంత్రం చూపించిన బాటలో మనిషి కేవలం ఒక బటన్ నొక్కే పరికరంలా మారిపోవడం లేదా? అనేది మనల్ని మనం వేసుకోవాల్సిన అసలైన ప్రశ్న.

మనిషి పయనం ఎటువైపు..?

ప్రకృతిలో చీమల సమూహం (Swarm Intelligence) ఏకతాటిపై ఎలాగైతే పని చేస్తుందో, నేడు యుద్ధ క్షేత్రంలో డ్రోన్లు కూడా అదే రీతిలో శత్రువుపై విరుచుకుపడుతున్నాయి. ఇటీవల ఇరాన్‌పై జరిగిన 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ'లో ఈ డ్రోన్ల సమూహాలు శత్రువు రక్షణ వ్యవస్థలను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఊహించని విధ్వంసాన్ని సృష్టించాయి. ఇరాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా సాగిన ఈ భారీ సైనిక చర్యలో అలీ ఖమేనీ వంటి అగ్రనేతలు మరణించడం ఒక ఎత్తైతే, ఆంత్రోపిక్ కంపెనీతో విభేదాలు ఉన్నప్పటికీ పెంటగాన్ వారి 'క్లాడ్' ఏఐ మోడల్స్‌ను ఈ ఆపరేషన్‌లో వాడిందనే వార్తలు రావడం గమనార్హం. అయితే, ఈ సాంకేతిక ప్రగతి వెనుక ఒక భయంకరమైన నైతిక సంక్షోభం పొంచి ఉంది; యుద్ధాన్ని ఒక వీడియో గేమ్ స్థాయికి దిగజార్చడం వల్ల ప్రాణం విలువ పాతాళానికి పడిపోతోంది. రక్తం చిందించే యుద్ధం కాస్తా స్క్రీన్ మీద ఒక యంత్రం చేసే పనిగా మారిపోవడంతో, అవతలి వైపున్న మనిషి కేవలం ఒక ప్రాణం లేని బిందువులా (Pixel) మిగిలిపోవడం మానవత్వానికే ఒక పెద్ద సవాలు.  మనుషులు నియంత్రించలేని 'ఫ్లాష్ వార్స్' కనుక సంభవిస్తే, దానివల్ల ప్రపంచం ఏ గతికి చేరుకుంటుందో ఊహించడం కూడా అసాధ్యం. ఏఐ వ్యవస్థలు మిల్లీ సెకన్ల వ్యవధిలో తీసుకునే నిర్ణయాలు యుద్ధంలో గెలుపును అందించవచ్చు కానీ, ఆ ప్రక్రియలో మానవత్వం పూర్తిగా ఓడిపోకూడదు. 2026 నాటి ఈ పరిణామాలు కేవలం సాంకేతిక విజయాలు మాత్రమే కాదు, అవి మానవాళికి ఒక గంభీరమైన హెచ్చరిక. స్టాక్ మార్కెట్ కూలిపోయినట్లుగా ఒక దేశపు రక్షణ వ్యవస్థలు క్షణాల్లో కుప్పకూలి, నియంత్రణ కోల్పోయిన యంత్రాలు అణు యుద్ధానికి దారితీస్తే, ఆ విధ్వంసానికి బాధ్యులెవరు ? 

విజ్ఞానం మనిషికి బానిస కావాలి గాని, మనిషికి యజమాని కాకూడదు...!

విజ్ఞానం ఎప్పుడూ మనిషికి బానిసగా ఉండి మేలు చేయాలి కానీ, అంతుచిక్కని ఆ సాంకేతికతకే మనిషి బలి కాకూడదు. అంతిమంగా, యంత్రాల వేగం కంటే మనిషి వివేకానికే ప్రాధాన్యత ఉండాలి. యుద్ధం ఇప్పుడు రక్తం నుండి కోడింగ్‌ కు మారింది. ఈ నవయుగ యుద్ధంలో మనం గెలుస్తున్నామా లేక మన ఉనికినే కోల్పోతున్నామా  అన్న విచక్షణా జ్ఞానం ప్రతి మనిషికి అవసరం. మనం కనిపెట్టిన విజ్ఞానమే మనల్ని చంపుకుంటూ పోతే ఇంకా విజ్ఞానం ఎందుకు అన్న రీతిలో ప్రతి మనిషి ఆలోచించి మనిషిపై కృత్రిమ మేధస్సుకు ఆధిపత్యం తగ్గించాలి. ప్రపంచ శాంతి వర్ధిల్లాలి..!!

✍️ సేకరణ: డాక్టర్ కృష్ణ బంటు, హ్యూమనిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, కవి, రచయిత, ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333