నాన్న అడుగుజాడల్లో నడవాలి- డ్రగ్స్ కు దూరంగా ఉండాలి
'పితృవేదన' కార్యక్రమంలో డ్రగ్స్, గంజాయి దుష్పరిణామాలపై అవగాహన.
సూర్యాపేట అర్బన్ : జూన్ 22 :- తండ్రి అంటే కేవలం రెండు అక్షరాల పదం కాదని, పిల్లల భవిష్యత్తు కోసం జీవితాంతం తమ సుఖసంతోషాలను త్యాగం చేసే మహోన్నత వ్యక్తి అని సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గోరంట్లకు చెందిన తెలుగు ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్ అన్నారు. పితృదినోత్సవం సందర్భంగా ఆదివారం సూర్యాపేట పాత వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో ఆయన ఆధ్వర్యంలో "పితృవేదన" అనే ట్యాగ్‌లైన్‌తో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యువతను ఉద్దేశించి మాట్లాడుతూ, కొందరు యువకులు చెడు స్నేహాలకు లోనై డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాలకు బానిసలవుతూ తమ జీవితాలను నాశనం చేసుకోవడంతో పాటు తల్లిదండ్రులకు తీవ్ర మనోవేదన కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల కష్టాలను గుర్తించి, వారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండి మంచి మార్గంలో పయనించాలని యువతకు పిలుపునిచ్చారు. నాన్న చూపిన మార్గంలో నడవడం ద్వారా మాత్రమే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని తెలిపారు. డ్రగ్స్, గంజాయి వల్ల ఆరోగ్యపరంగా, సామాజికంగా, ఆర్థికంగా కలిగే నష్టాలను వివరించి యువతలో అవగాహన కల్పించారు.