నటి జత్వానీ కేసులో ఏసీపీ, సీఐపై సస్పెన్షన్ వేటు..

Sep 14, 2024 - 14:08
Sep 14, 2024 - 14:38
 0  2
నటి జత్వానీ కేసులో ఏసీపీ, సీఐపై సస్పెన్షన్ వేటు..

 ఐపీఎస్‌లు కాంతిరాణా, పీఎస్ఆర్, విశాల్‌గున్నీపై చర్యలకు సిద్ధం

ఉన్నతాధికారుల ఆదేశాలతో జత్వానీని ఆగమేఘాలపై అరెస్ట్ చేసిన సత్యానారాయణ.. గత రాత్రి ఇబ్రహీంపట్నం పోలీసులకు జత్వానీ ఫిర్యాదు..!!

ఏపీలో సంచలనమైన ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన పోలీసులపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన విజయవాడ ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం అప్పటి సీఐ ఎం.సత్యనారాయణరావును ఉన్నతాధికారులు  సస్పెండ్ చేశారు. జత్వానీ కేసు అనంతరం హనుమంతరావు కాకినాడకు డీఎస్పీగా బదిలీ అయ్యారు. 

జత్వానీ ఇంటరాగేషన్‌లో హనుమంతరావు కీలకంగా వ్యవహరించారు. ఆమె పోలీసు కస్టడీలో ఉండగా కాకినాడ నుంచి ప్రత్యేకంగా విజయవాడ వచ్చి ఆమెను ఇంటరాగేట్ చేశారు. దర్యాప్తు అధికారిగా ఉన్న సత్యనారాయణరావు ఎలాంటి వివరాలు లేకున్నా సరే ఉన్నతాధికారుల ఆదేశాలపై జత్వానీని అరెస్ట్ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక, ఈ కేసులో అన్నీ తామై నడిపించిన ఐపీఎస్ అధికారులు పి. సీతారామాంజనేయులు, కాంతిరాణా, విశాల్‌గున్నీ తదితరులపై చర్యలకు రంగం సిద్దమైంది.

ఇబ్రహీంపట్నం పోలీసులకు జత్వానీ ఫిర్యాదు..!!

తల్లిదండ్రులు, న్యాయవాదులు పీవీజీ ఉమేశ్‌చంద్ర, పాల్‌తో కలిసి గతరాత్రి  ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన నటి జత్వానీ విజయవాడ సీపీ కాంతిరాణా, డీసీపీ విశాల్ గున్నీ, వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌పై ఫిర్యాదు చేశారు. ఫోర్జరీ పత్రంతో తనపై తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురిచేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విద్యాసాగర్‌తో తప్పుడు ఫిర్యాదు ఇప్పించి అప్పటికప్పుడు తమను అరెస్ట్ చేశారని, ఏ తప్పూ  చేయకున్నా తమ కుంటుంబం 42 రోజులపాటు జైలులో మగ్గిందని ఆమె తన ఫిర్యాదులో ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు కారణమైన పోలీసు అధికారులతోపాటు విద్యాసాగర్‌పైనా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు..!!

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333