దాడుల రాజకీయాలను ఎవరూ సమర్థించరు!
అయితే ప్రభుత్వాన్ని కూలదోచే కుట్ర, కూలిపోతుందని ప్రచారం చేసే హక్కు ప్రతిపక్షాలకు లేదు.
ప్రభుత్వాన్ని గద్దెనెక్కించాలో ప్రజలు నిర్ణయిస్తారు.
అందుకే కాబోలు బెదిరించిన టిఆర్ఎస్ నాయకులను వేప చెట్టుకు కట్టి కొట్టాలన్న ముఖ్యమంత్రి ఆదేశం ఒకరకంగా చట్టబద్ధమే నేమో!.
బాధ్యతలు మరిచి, బెదిరింపు లకు పాల్పడితే ప్రజలు చూస్తూ ఊరుకోరు సుమా!
భారతదేశంలో హింస, దాడుల రాజకీయాలను సర్వత్ర ఖండించవలసినదే . రాజకీయ పార్టీలు తద్వారా ఏర్పడే ప్రభుత్వాలు ప్రజలకు ఆదర్శంగా ఉండవలసినది పోయి అక్రమార్జన కోసం, సేవా ముసుగులో , దాడులకు హింస రాజకీయాలకు పాల్పడడం ఈ దేశంలో కొత్తేమీ కాదు . అయితే ఇటీవలి కాలంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో పాలక పక్షం ప్రతిపక్షాలను భయపెట్టి లొంగదీసుకునే ప్రయత్నం చేయడాన్ని గత ఐదారు సంవత్సరాలుగా మనం గమనించవచ్చు. అదే కోవలో తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం గత 10ఏళ్లలో నిరసన తెలిపే హక్కు వేదిక అయిన ధర్నా చౌక్ ను ఎత్తివేయడంతో పాటు సభలు సమావేశాలు హౌస్ మీటింగులు పెట్టుకోవడానికి కూడా ప్రజాసంఘాలు విప్లవ సంస్థలకు అనుమతించక నోరు నొక్కిన విషయం మనందరికీ తెలిసిందే . అలాంటి హింస ప్రవృత్తి, నియంతృత్వ ధోరణితో వ్యవహరించిన బి ఆర్ఎస్ పార్టీ ఈనాడు ప్రతిపక్ష స్థానంలో ఉండి ప్రభుత్వాన్ని బెదిరిస్తూ లొంగదీసుకునే ప్రయత్నం చేస్తూ ఆరు మాసాలలో ప్రభుత్వం కూలిపోతుందని శాపనార్థాలు చేయడం అంటే అధికారంలోను, ప్రతిపక్షంలో ఉన్న నాడు ఏ రకంగా హింస ప్రవృత్తిని ప్రజా వ్యతిరేక ధోరణినీ అవలంబిస్తున్నదో అందరం గమనించి ఉన్నాము. గమనించవలసిన అవసరం అందరి పైన ఉన్నది . ఏ ప్రభుత్వమైనా ప్రజల మద్దతు ప్రతిపక్షాల యొక్క నిర్మాణాత్మక సూచనలతో ప్రజల ఆకాంక్షల మేరకు పేద వర్గాలు సామాన్యులనే ప్రాతిపదికగా తీసుకొని పరిపాలన చేయవలసి ఉంటుంది .ఆ క్రమంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను కొనసాగించి అమలు చేసే క్రమంలో హామీలను అమలు చేస్తూ ప్రజలకు చేరువవుతూ ఉంటే పదేళ్లలో అమలు చేయకుండా 7 లక్షల కోట్ల అప్పులను చేసి నిర్మించిన అనేక నిర్మాణాలతో పాటు ప్రధానమైన కాలేశ్వరం ప్రాజెక్టును పనికిరాకుండా చేసి0ది వీరుకాధా? ఇప్పటికైనా తప్పును అంగీకరించకుండా ప్రభుత్వాన్ని కూలదోయడానికి పదేపదే హెచ్చరికలు చేయడం, హామీలు ఎప్పుడూ అమలు చేస్తారని నిలదీయడం , కనీసం మూడు మాసాల సమయం కూడా కాకుండానే బెదిరించడం అంటే విడ్డూరమే కదా !
ఏ పార్టీ నైనా ప్రభుత్వ గద్దెనెక్కించడం అనేది ఆ ప్రాంతంలోని ప్రజల యొక్క అభిప్రాయం ,ఆకాంక్షలు, ఆలోచన సరళి పైన ఆధారపడి ఉంటుంది . ఒక ప్రభుత్వాన్ని గడ్డేదించి మరొక ప్రభుత్వాన్ని గద్దెనే క్కించినారు అంటేనే ఆ ప్రభుత్వం పైన అసంతృప్తి ఆగ్రహం ప్రజలలో ఉన్నట్లు లెక్క. ఆ పద్ధతిలో ఆలోచిస్తే బీఆర్ఎస్ ప్రభుత్వ దశాబ్ద కాలపు ద మ ననీతిని సహించని ప్రజల యొక్క అసంతృప్తి జ్వాలల యొక్క పరమార్థమే కొత్త ప్రభుత్వం అని గుర్తిస్తే మంచిది. కేవలం ప్రజల అభిప్రాయం మాత్రమే కాదు బుద్ధి జీవులు మేధావులు అనేక ప్రజాస్వామ్య సంస్థలు కూడా ఎన్నికల సందర్భంలో బిఆర్ఎస్ పార్టీని ఓడించాలని ప్రజలకు ఇచ్చిన పిలుపు, చేసిన పోరాట, ప్రచార కార్యక్రమాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా గద్దెనెక్కడానికి టిఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైనవి. ఈ శాస్త్రీయ, సాంకేతిక, సామాజిక అంశాన్ని టిఆర్ఎస్ పార్టీ గుర్తించకుండా, ప్రజల తీర్పును మన్నించకుండా, ఒంటెద్దు పోకడతో అహంకారంతో, సర్వత్ర చట్ట సభల్లోనూ చట్టసభలో బయట ధిక్కరించి బెదిరించి భయపెట్టే ప్రయత్నం చేయడం ఆత్మవంచన మాత్రమే కాదు.... రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో సంపూర్ణంగా ఓటమికి కూడా పరాకాష్ట అని భావిస్తే అతిశయోక్తి కా దు. అందుకే కాబోలు రాబోయే ఎన్నికల్లో ఒక్క సీట్ అయినా గెలుచుకోగలరా అని ముఖ్యమంత్రి టిఆర్ఎస్ కు సవాల్ విసరడం అంటే తలవంచుకోవలసినపరిస్తితి కాదా?
అంతేకాదు 27 ఫిబ్రవరి 2024 మంగళవారం రోజున చేవెళ్లలో జరిగిన కాంగ్రెస్ జన జాతర మహాసభలో రెండు గ్యారెంటీ ల ప్రారంభోత్సవ(ఉచిత కరెంట్ 200 యూనిట్లవరకు,500కే గ్యాస్) పాల్గొన్న ముఖ్యమంత్రి టిఆర్ఎస్ పార్టీ వైఖరి పై అసహనం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం కూలిపోతుందని పదేపదే చేస్తున్న చౌకబారు ప్రకటనలపై స్పందించి ఇలాగే మాట్లాడితే ప్రభుత్వాన్ని బెదిరిస్తే టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు కార్యకర్తలను గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేప చెట్లకు కట్టేసి కొడతారు జాగ్రత్త సుమా! అని చేసిన హెచ్చరిక టిఆర్ఎస్ పార్టీ యొక్క స్వయంకృత అపరాధమే కాబోలు!
అందుకే ఒక ప్రభుత్వం తన ఆచరణాత్మక కార్యక్రమాల ద్వారా పరిపాలన కొనసాగించినప్పుడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్నప్పుడు దాన్ని సుపరిపాలన అంటారు. అందుకు భిన్నంగా ఉంటే ప్రజా వ్యతిరేక పాలన అని అంటారు. ఇక్కడ ప్రజలు ప్రజాస్వామికవాదులు ప్రజా సంఘాలు మేధావులు నిరంతరం ఒక ప్రభుత్వం యొక్క పనితీరును గమనిస్తూ ఉంటారు అనేది నగ్నసత్యం . ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇక ఏ ప్రతిపక్షాలు లేనట్లు, ప్రశ్నించే వాళ్ళు ఎవరూ లేనట్లు, కేవలం తాము మాత్రమే ప్రశ్నిస్తేనే ప్రభుత్వం పని చేస్తుందనే భ్రమల్లో ఉన్నటువంటి బి ఆర్ ఎస్ పార్టీ ఇటీవల చట్టసభలలోను చట్టసభలు బయట పలుమార్లు అధికార పార్టీని ప్రభుత్వాన్ని దూషించిన తీరు ప్రజాస్వామ్య విరుద్ధమే కాదు, ఆ పార్టీ యొక్క కు సంస్కారాన్ని, రాజకీయ అజ్ఞానాన్ని తెలియజేస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు లక్షల కోట్ల రూపాయలతో నిర్మిస్తే మేడిగడ్డ ఇతర బరాజులు మేధావులు ఇంజనీర్లు పనికి రాకుండా పోయినవని హెచ్చరిస్తూ ఉంటే ఆ ప్రాజెక్టును నిర్మించిన టిఆర్ఎస్ పార్టీ కనీసం వాస్తవాన్ని గుర్తించక చట్టసభలో ప్రాజెక్టులపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి ఇప్పటికైనా తప్పును అంగీకరించి క్షమాభిక్ష కోరుమని హెచ్చరించినప్పటికీ కూడా ఆ వైపుగా ఆలోచించకుండా ఎదురు దాడికి దిగడం జరిగింది.పైగా మీ హయాములో నిర్మించిన ప్రాజెక్టులు కూలిపో లేదా అని సన్నాయి నొక్కులు నొక్కడం అంటే బాధ్యతల నుండి తప్పుకోవడమే. అందుకే ప్రజలు కూడా ప్రతిపక్ష పార్టీ యొక్క విధానాన్ని గమనిస్తున్నారు, ప్రభుత్వం ప్రజలకు అనుగుణంగా పరిపాలన చేయకుండా అడ్డంకులు కల్పిస్తే ప్రజలు ప్రజాస్వామ్యవాదులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇక ఊరుకునే పరిస్థితులు లేవని ముఖ్యమంత్రి హెచ్చరిక ద్వారా తెలుస్తున్నది . ఆ హెచ్చరిక అమలు కాకముందే ఇప్పటికైనా టిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయలేని బలహీనతలను అంగీకరించడంతోపాటు , ప్రస్తుత ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు చేయడం ద్వారా కనీసం సంవత్సర కాలమైన అవకాశం కల్పించి ప్రభుత్వాన్ని స్థిరంగా కొనసాగే విధంగా ప్రోత్సహించడం ఒక సామాజిక బాధ్యత అని గుర్తిస్తే మంచిది . టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి వచ్చిన కొత్తలో కనీసం నాలుగు సంవత్సరాల తర్వాత కానీ ఆనాడు ప్రతిపక్షాలు మేధావులు, ప్రజా సంఘాలు ప్రభుత్వాన్ని విమర్శించడం ప్రారంభం కాలేదు అనే చేదు వాస్తవాన్ని తెలుసుకుంటే మరీ మంచిది.
----వడ్డేపల్లి మల్లేశం
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు హుస్నాబాద్ (చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం )