తెలంగాణ తెలుగు అకాడమీ నూతన డైరెక్టర్‌గా ఆచార్య భట్టు రమేష్
చిలుకూరు మండలం జానకి నగర్ తండాకు చెందిన సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ రిజిస్ట్రార్, సీనియర్ అధ్యాపకులు ఆచార్య భట్టు రమేష్ ప్రతిష్టాత్మక తెలంగాణ తెలుగు అకాడమీ నూతన డైరెక్టర్‌గా నియమితులయ్యారు. రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి డా. యోగితా రాణా ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆయన బుధవారం హైదరాబాద్ లోని అకాడమీ కార్యాలయంలో విధుల్లో చేరారు.
తెలుగు భాషా పరిరక్షణ, పాఠ్యపుస్తకాల రూపకల్పనలో కీలక భూమిక పోషించే తెలుగు అకాడమీ సారధ్య బాధ్యతలను ఆచార్య భట్టు రమేష్ కు అప్పగించడంపట్ల చైర్మన్ ఆచార్య కూరపాటి వెంకటనారాయణతో పాటు గ్రామస్తులు, యువకులు,గిరిజన సంఘాల ప్రతినిధులు, రాజకీయ నాయకులు, హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆచార్య భట్టు రమేష్ కు ఉన్నత విద్యా రంగంలో మూడు దశాబ్దాలకు పైగా బోధనానుభవం ఉంది. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో రెండు పర్యాయాలు రిజిస్ట్రార్‌గా అత్యుత్తమ సేవలందించారు. వీటితో పాటు జానపద గిరిజన విజ్ఞాన పీఠం పీఠాధిపతిగా, గిరిజన అధ్యయన శాఖ అధిపతిగా, విశ్వవిద్యాలయ పాలక మండలి సభ్యుడిగా పలు కీలక బాధ్యతలను నిర్వర్తించారు.
గిరిజన సామాజిక నేపథ్యం నుండి వచ్చిన ఆచార్య రమేష్ జానపద, గిరిజన సంస్కృతుల పరిరక్షణకు విశేష కృషి చేశారు.
సమాజ శ్రేయస్సు కోరి వివిధ పబ్లిక్ కమిటీల్లో భాగస్వామ్యం వహించారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కాలంలో పీపుల్స్ వార్ గ్రూప్, జనశక్తి వంటి పార్టీలతో జరిపిన శాంతి చర్చలలో మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా, రాష్ట్ర స్థాయి మద్యపాన నిషేధ సలహా కమిటీ సభ్యుడిగా , గిరిజన భూ రక్షణ చట్టాల పర్యవేక్షణ కమిటీ సభ్యుడిగా సేవలందించారు.
వరంగల్ జిల్లాలో గుడుంబా బాధితులైన 200 పైగా గ్రామాల్లోని యువ గిరిజన వితంతువుల సమస్యలపై విస్తృత ప్రచారం నిర్వహించి, వారి పునరావాసం కోసం జిల్లా కలెక్టర్ సహాయంతో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. అలాగే బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనపై పని చేసి నివేదికలను అందించి వారి అభివృద్ధికి కృషి చేశారు.
ఆయన విద్యా సేవలను గుర్తిస్తూ 2014 లో తెలంగాణ ప్రభుత్వం నుండి 'రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు'ను,అలాగే గిరిజన సాహిత్యం, జానపద కళల రంగంలో ఆయన చేసిన కృషికి గాను 2017లో 'డా. బి.ఆర్. అంబేద్కర్ నేషనల్ అవార్డు'ను పొందారు.
ఈ సందర్భంగా ఆచార్య భట్టు రమేష్ మాట్లాడుతూ తెలంగాణ తెలుగు అకాడమీ డైరెక్టర్‌గా తెలుగు భాషా వికాసానికి, పాఠ్యపుస్తకాల ప్రచురణకు, తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణకు తన వంతుగా శాయశక్తులా కృషి చేస్తానని పేర్కొన్నారు.