చనిపోయిన వారు బ్రతికున్న వారికి పాఠాలు చెప్తారు
మనిషి చనిపోవచ్చు కానీ మానవత్వం చనిపోకూడదు
మరణం ప్రకృతి ఇచ్చిన ముగింపు, అవయవదానం మనిషి ఇచ్చే మరో జీవితానికి ఆరంభం
అవయవ దానానికి, మృతదేహాలదానానికి అడ్డంకి గా మారుతున్న మూఢనమ్మకాలు,
సమాజ రుగ్మతలు,
స్వర్గ నరకాలు,
పరలోక నమ్మకాలు,
పునర్జన్మ విశ్వాసాలు,
అజ్ఞాన అంధకారాలు,
కొరవడిన శాస్త్రీయ దృక్పథం,
చైతన్య రహిత జీవితాలు,
తగ్గుతున్న గతి తార్కిక హేతువాద భావనలు,
అంతరిస్తున్న పరిశోధన ఆలోచన తత్వాలు,
బూజు బట్టిన జీవన విధానాలు,
నిరక్షరాస్యత,
అశాస్త్రీయ భావజాలం
ఆగస్టు 13 అవయవ దాన దినోత్సవం సందర్భంగా ప్రత్యేక వ్యాసం
✍️ డాక్టర్ కృష్ణ బంటు, గోల్డ్ మెడలిస్ట్, సీనియర్ ఫ్రీ లాన్సర్, రాష్ట్ర ఉత్తమ జర్నలిస్టు అవార్డు గ్రహీత
ప్రతి జీవికి మరణం తద్యం. ప్రాణంతో ఉన్న ఏ జీవి అయినా కొంతకాలానికి మరణించిక తప్పదు. మనిషి ఖాళీ చేతులతో ఈ లోకంలోకి వస్తాడు. ఖాళీ చేతులతోనే వెళ్తాడు.
కానీ వెళ్లే ముందు ఒక అవయవాన్ని దానం చేస్తే
ఒక కుటుంబానికి తండ్రిని తిరిగి ఇచ్చినట్టవుతుంది.
ఒక తల్లికి బిడ్డను తిరిగి ఇచ్చినట్టవుతుంది.
ఒక జీవితానికి రేపటిని ఇచ్చినట్టవుతుంది.
మరణం ప్రతి మనిషికీ తప్పని సత్యం. కానీ ఆ మరణం తర్వాత కూడా మనిషి తన అవయవాల ద్వారా మరొకరి గుండెలో కొట్టుకునే అవకాశం ఉంది. ఒకరి గుండె మరో కుటుంబానికి ఆశగా మారవచ్చు. ఒకరి కిడ్నీ మరో మనిషికి కొత్త జీవితాన్ని ఇవ్వవచ్చు. కళ్ల దానం ద్వారా చీకటిలో ఉన్నవారికి వెలుగును అందించవచ్చు. మరణించిన తదుపరి మృతదేహాన్ని ఒక వైద్య కళాశాలకు అప్పగిస్తే భవిష్యత్తు డాక్టర్లను తయారు చేసే వారవుతాం. వైద్య కళాశాలలో చనిపోయిన మృతదేహాలు అక్కడ విద్యనభ్యసించే విద్యార్థులకు పాఠాలు చెప్తాయి. శవాలు కూడా విజ్ఞానాన్ని అందిస్తాయి. అందుకే దేహదానం చేయాలనుకునే ప్రతివారు కూడా సమీప మెడికల్ కళాశాలకు వెళ్లి సంబంధిత పత్రాలను నింపి అంగీకారాలను తెలియజేయవచ్చు.
ఇంకా ఎంతకాలం మూడమత విశ్వాసాలు
మనుషుల లో విద్య, విజ్ఞానం ఎక్కువ అయ్యే కొద్ది శాస్త్రీయ దృక్పథం తగ్గిపోతుందేమో అని అనిపించక మానదు. ఇక్కడ బతికేది ఎంతో తాత్కాలికమనీ, జీవితం బుద్బుత ప్రాయమని, తామరాకుపై నీటిబొట్టు చందమని, అసలైన జీవితం పైన ఉందని, పరలోకంలో ఉందని, పుణ్యం పాపాలు మన మరణ అనంతరం మనకు స్వర్గ నరక ప్రాప్తాలు కల్పిస్తాయని ఆయా మతాలు ప్రజలను ఇంకా బూజుపట్టిన భావజాల కాలంలోనే, అజ్ఞాన అంధకారంలోనే ఉంచుతున్నాయి. ఇంకా మతాల మత్తులో కొందరు మరణించిన అనంతరం స్వర్గానికి పోతారని, పరలోకానికి పోతారని మత గ్రంథాలు, మత పెద్దలు చెప్పడం ఈ హైటెక్ యుగంలో ఒక అశాస్త్రీయ సంగతి. విజ్ఞాన పరంగా ఆలోచిస్తే చనిపోయిన వారిని బొంద పెడితే మట్టిలో కలిసిపోయి ఎరువుగా మారవచ్చు, లేదా చనిపోయిన వారిని కాల్చివేస్తే బూడిదగా మారవచ్చు అన్న నగ్న సత్యాన్ని తెలుసుకోకుండా స్వర్గ నరకాల పేర్లతో, పరలోకం పేరుతో, పైన ఏడు లోకాలు, కింద ఏడు లోకాలు ఉన్నాయని భ్రమలో ముంచుతూ చనిపోయిన అనంతరం కూడా మంచి జీవితం ఉంటుందని మనుషులను నమ్మించే వ్యవస్థ ఉన్నంతకాలం అవయవ దానానికి అడ్డంకులు తప్పదు. భూమిలో కలిసిపోయి ఎరువుగా మారిపోయే బదులుగా, కాలిపోయి బూడిదగా మారిపోయే బదులుగా శరీరాన్ని వైద్య కళాశాలకు మృతదేహాన్ని దానం చేస్తే, ఒక మృతశరీరం ద్వారా కనీసం పదిమంది డాక్టర్లను తయారు చేయవచ్చు. బ్రెయిన్ డెడ్ జరిగిన సందర్భం, యాక్సిడెంట్లు జరిగిన సందర్భంలో, మనిషి కోల్పో లేకుండా కోమాలోకి పోయిన సందర్భంలో ఆయా వ్యక్తుల కుటుంబాల వారు ఆలోచించి అవయవ దానం చేస్తే ఎంతోమందికి తిరిగి జీవితాన్ని అందించిన వారవుతారు.
దేహ దానం వైద్య విజ్ఞానానికి మహోన్నత సేవ
ఇటీవల రాష్ట్రంలో, దేశంలో మెడికల్ కళాశాల సంఖ్య బాగా పెరిగింది. విద్యార్థులు ప్రయోగాల కోసం మానవ మృతదేహాలను సరిపడగా లభించడం లేదు. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న ప్లాస్టిక్ మృతదేహాల నమూనా ద్వారా విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. అయితే ఇటీవల మొత్తం శరీరాన్ని మెడికల్ కళాశాలకు దానం చేయడం బాగా పెరిగిపోవడం సంతోషదాయకం. ఇటీవల మరణించిన సిపిఐ జాతీయ నాయకులు సురవరం సుధాకర్ రెడ్డి, సూర్యాపేటకు చెందిన తెలంగాణ సాయుధ పోరాట నాయకురాలు మల్లు స్వరాజ్యం, ప్రముఖ గాయకుడు అరుణోదయ నాగన్న, జర్నలిస్ట్ బంటు కృష్ణ మాతృమూర్తి బంటు బుచ్చమ్మ తదితరులతోపాటు పలువురు తమ శరీరాలను వైద్య కళాశాలలకు ఉచితంగా అందించారు. కమ్యూనిస్టులు మరణిస్తే ఎక్కువ శాతం వైద్య కళాశాలలకు మృతదేహాలను అందిస్తున్నారు. మొత్తం శరీరాన్ని వైద్య విద్య, పరిశోధన కోసం దానం చేయడం కూడా ఒక మహోన్నత సేవ. వైద్య విద్యార్థులు మానవ శరీర నిర్మాణాన్ని నేర్చుకోవడంలో దానం చేసిన మృతదేహాలు ఎంతో విలువైన పాత్ర పోషిస్తాయి.
జీవించి ఉన్నప్పుడు మనం ఒక కుటుంబానికి ఉపయోగపడవచ్చు,
మరణించిన తర్వాత మన దేహం ఒక తరానికి ఉపయోగపడవచ్చు.
మరణం మన శ్వాసను ఆపుతుంది,
అవయవ దానం మాత్రం మన మానవత్వాన్ని కొనసాగిస్తుంది.
కాలిపోయే శరీరాన్ని దానం చేస్తే,
ఎవరో ఒకరి జీవితంలో వెలుగై నిలుస్తుంది.
మనిషి వెళ్లిపోయినా పర్వాలేదు,
అతని గుండె ఇంకొకరిలో కొట్టుకుంటే చాలు.
కళ్ళు మూసుకున్న తర్వాత కూడా
మరొకరి కళ్ళలో ప్రపంచాన్ని చూపించడం కంటే గొప్ప దానం ఏముంటుంది.
మరణం ప్రకృతి ఇచ్చిన ముగింపు,
అవయవ దానం మనిషి ఇచ్చే మరో జీవితానికి ఆరంభం.
దేహం మట్టిలో కలిసే ముందు
ఒకరి జీవితంలో వెలుగుగా మారనివ్వండి. అనుకోని పరిస్థితులలో ప్రమాదాలు జరిగితే ఆ వ్యక్తి బ్రతికే అవకాశం లేకుంటే అతని అవయవాలు ఎవరికైతే ఉపయోగపడతాయో వారికి అందిస్తే తాము చనిపోయినప్పటికీ తమ అవయవాలు సమాజంలో ఇంకా తాము దానం చేసిన వ్యక్తి శరీరం ద్వారా బతికే ఉంటాయి. తాము దానం చేసిన కళ్ళ ద్వారా ఇంకా ప్రపంచాన్ని చూస్తూనే ఉంటారు.
అవయవదానం, దేహదానాలు ఇంకా పెరగాలి
రాష్ట్రము, దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా అవయవ దానం, దేహదానాలు బాగా పెరగాల్సిన అవసరం ఉంది. అవయవ దానం ద్వారా ఎంతో మంది తమ జీవితాన్ని పునః ప్రారంభిస్తారు. దేహదానం ద్వారా వైద్య విద్యార్థులను సమాజానికి అందించవచ్చు.
మరణంతో జీవితం ముగియదు, మన శరీరం మరొకరి జ్ఞానానికి మార్గం చూపితే, మన జీవితం చిరస్మరణీయమవుతుంది.
చితిలో కాలిపోయే శరీరం కాదు, వైద్య విద్యకు వెలుగునిచ్చే శరీరమే నిజమైన మహాదానం.
కళ్లు మూసుకున్న తర్వాత కూడా భవిష్యత్ వైద్యుల కళ్లకు జ్ఞానదీపంగా నిలవడం అన్న సత్యాన్ని వారు తెలుసుకోవాలి. శరీర దానం,
రక్తదానం ప్రాణాన్ని కాపాడుతుంది. శరీరదానం ఎన్నో ప్రాణాలను కాపాడే వైద్యులను తయారు చేస్తుంది.
చివరి శ్వాస మనది కావచ్చు, కానీ చివరి సేవ సమాజానిదిగా మారాలి.
మట్టిలో కలిసిపోయే శరీరాన్ని వైద్య విజ్ఞానానికి అంకితం చేస్తే అదే మహోన్నత మానవత్వం.
జీవించి ఉన్నప్పుడు సేవ చేయడం గొప్పది అయితే మరణించిన తర్వాత కూడా సేవ చేయడం మహోన్నతం.
శరీరం నశించినా, మన దానం ద్వారా పుట్టిన జ్ఞానం తరతరాలకు జీవిస్తుంది.
మరణం చివరి అధ్యాయం కాదు, శరీరదానం చేస్తే అది మరొకరి జీవితానికి తొలి పాఠం.
మన చివరి బహుమతి… భవిష్యత్ వైద్యుల చేతుల్లో జ్ఞానంగా మారాలి.
మరణానంతరం కూడా మానవత్వం పరిమళించాలి. శరీరదానం ద్వారా మనిషి వెళ్లిపోయినా, అతని సేవ మాత్రం కొనసాగాలి. ఆ దిశగా ప్రతివారు కూడా ఆలోచించు అవయవ దానం, దేహదానం విరివిగా ప్రచారం చేస్తూ తాము కూడా తమ మరణానంతరం తమ దేహాలను వైద్య కళాశాలలకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని, అలా దానం చేసే వారిలో మనం కూడా ఉండాలని కోరుకుందాం.