ఉపాధ్యాయులు నిబద్ధతతో పనిచేస్తేనే మెరుగైన ఫలితాలు
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి.
నిర్దేశిత పారామీటర్స్ లో మెరుగైన ర్యాంక్ సాధించాలి.
ఫిన్లాండ్ దేశ విద్యా వ్యవస్థ అమలుకు కృషి.
ఎంఈఓలు నిరంతరం పాఠశాలలను పర్యవేక్షించాలి.
జ్ఞాన దీప్తి శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.
ఉపాధ్యాయులు నిబద్ధతతో పని చేస్తేనే ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు వస్తాయని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.
ఎర్రవల్లి మండల కేంద్రంలోని బెటాలియన్ పోలీస్ ట్రైనింగ్ సెమినార్ హాల్లో మంగళవారం జ్ఞాన దీప్తి పేరుతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు నిర్వహించిన పాఠశాలల ప్రారంభ మార్గ దర్శక శిక్షణా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని తరగతులతోపాటు ప్రీ ప్రైమరీ తరగతుల్లో కూడా విద్యార్థుల సంఖ్య పెరిగేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. విద్యాశాఖకు సంబంధించిన 32 పారామీటర్స్ లో మన జిల్లా మంచి ర్యాంకింగ్ సాధించేలా ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో తమ విధులను నిర్వర్తించాలన్నారు. యుడైస్ అప్డేట్ పక్కాగా ఉండాలని, ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ కచ్చితంగా అమలు చేయాలన్నారు. ఇటీవల తాను విద్యాశాఖ అధికారులతో కలిసి ఫిన్లాండ్ దేశంలో పర్యటించి, అక్కడి విద్యావ్యవస్థను అధ్యయనం చేయడం జరిగిందని, కొన్ని అంశాలను మన వద్ద కూడా అమలు చేసి మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నామన్నారు. మండలాల విద్యాధికారులు తమ పరిధిలోని పాఠశాలలను ప్రతినెల 15వ తేదీలోగా సందర్శించి నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. ఉపాధ్యాయులు లీవ్ లెటర్ ఇవ్వకుండా పాఠశాలలకు గైర్హాజరైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్య ఇస్తోందని, పూర్తిస్థాయిలో మౌలిక వసతులను కల్పించేందుకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తుందన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో టాయిలెట్స్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం జరిగిందని 15 రోజుల్లోగా పనులు పూర్తి చేయించాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, పోషణ్ యాప్ లో ఎప్పటికప్పుడు వివరాలను పక్కాగా నమోదు చేయాలన్నారు. ప్రత్యేక పునఃశ్చరణ తరగతుల ద్వారా చదువులో వెనుకబడ్డ విద్యార్థులు మెరుగుపడేందుకు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా పిపిటీ ద్వారా మాస్టర్ ట్రైనర్ అగస్టీన్ వివిధ అంశాలపై సమగ్రంగా శిక్షణను ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు మనోజ్ కుమార్ రెడ్డి, రాజ్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి విజయలక్ష్మి, బెటాలియన్ కమాండెంట్ జయరాజు, అసిస్టెంట్ కమాండెంట్ పాణి, సెక్టోరియల్ అధికారులు, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
.......................................................
జారీ చేయువారు: డీపీఆర్ఓ / జోగులాంబ గద్వాల జిల్లా.