అరచేతిలో నేస్తం.. మితిమీరితే అనర్థం
సెల్ అతిగా వాడడంతో శారీరక, మానసిక సమస్యలుసామాజిక మాధ్యమాల వలలో విలవిల
సగటున ప్రతిఒక్కరు రోజుకు 70 సార్లు ఫోన్ చూస్తున్నారు
అతిగా ఫోన్ చూడడం వల్ల 20శాతం మంది కెరీర్‌లో వెనకబడుతున్నారు
ఈనాడు, హైదరాబాద్
ఈతరం ఆధునిక సాంకేతికతకు కేరాఫ్ చిరునామా స్మార్ట్‌ఫోన్. ఆన్‌లైన్ తరగతులతో ఒక్కో కుటుంబంలో సెల్‌ఫోన్ల వినియోగం పెరిగింది. సరైన మార్గంలో వాడిన వారికి ఆసరా అవుతుంది. అతిగా వినియోగిస్తే వ్యక్తిగతంగా..వృత్తిగతంగా అసమర్థులుగా చేస్తోందని మనస్తత్వ నిపుణులు హెచ్చరిస్తున్నారు. శారీరక, మానసిక సమస్యలతో వచ్చిన వారిని ప్రశ్నించినపుడు ఏదోరూపంలో మొబైల్ వినియోగంతో సంబంధం ఉన్నట్టు వైద్యపరీక్షల్లో గుర్తిస్తున్నారు. అకస్మాత్తుగా ప్రవర్తనలో లోపం గుర్తిస్తే తప్పకుండా ఫోన్‌లో మునిగినట్లేనని వైద్యులు చెబుతున్నారు.
శారీరక ఇబ్బందులు
స్క్రీన్ సమయం పెరగడంతో శారీరక శ్రమ తగ్గి అధికబరువు
ఊబకాయంతో జీవనశైలి వ్యాధులు
రాత్రిళ్లు ఎక్కువ సమయం మేల్కొనడంతో నిద్రలేమి
వినికిడి సమస్యలు
కళ్లు పొడిబారటం, తలనొప్పి, పార్శ్యపునొప్పి, దృష్టిలోపం
రోజూ 6గంటలకు పైగా వాడితే చిటికెన వేలు నొప్పి (స్మార్ట్‌ఫోన్ పింక్)
బైక్ నడుపుతూ మెడ ఒక వైపు వంచి ఫోన్ మాట్లాడటంతో మెడనొప్పి
ఎక్కువసేపు మాట్లాడేందుకు ఒకే చేతిని ఉపయోగించటంతో మోచేతినొప్పి (సెల్‌ఫోన్ ఎల్బో)
రోజూ రెండు గంటలు స్క్రీన్ బ్రేక్ ఇచ్చేద్దాం
- డాక్టర్ గీత చల్లా, మనస్తత్వ విశ్లేషకులు
రోజులో కొంత సమయం స్క్రీన్‌కు బ్రేక్ ఇచ్చేద్దాం. రోజూ 2 గంటలు ఫోన్ ముట్టకుండా విరామం ఇవ్వండి. పిల్లలకు మెదడుకు పదనుపెట్టేలా ఆటలు, పజిల్స్ ఇవ్వొచ్చు. సామాజిక మాధ్యమాలు, ఇతర అంశాలు చూసేందుకు నిర్దేశిత సమయాన్ని కేటాయించుకోవాలి.
కంటిపై ఒత్తిడి తగ్గించండి
- డాక్టర్ దివ్యనటరాజన్, ఎల్వీప్రసాద్ కంటి ఆసుపత్రి
విద్యార్థులు స్క్రీన్ ఉపయోగించేటపుడు పెద్దవాటిని ఎంపిక చేసుకోవాలి. మెడ, వెన్నుపై ఒత్తిడి పడకుండా సరైన భంగిమలో కూర్చొని చదవాలి. స్క్రీన్ ప్రొటెక్టర్లు ఉపయోగించాలి. కళ్లు పొడిబారకుండా ప్రతి 20 నిమిషాలకోసారి 20 అడుగుల దూరంలో ఉన్నవాటిని చూస్తూ కంటి కండరాలను కదపాలి.